నవతెలంగాణ-హైదరాబాద్: గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎవరిపైనా పోరాడాల్సిన అవసరం లేదని కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. తెలంగాణతో తాను ఎప్పుడైనా గొడవ పడ్డానా? ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందామని, మిగిలిన నీటినే వాడుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. కేటాయింపుల చట్టబద్ధత కోసం కేంద్రం వద్ద కూర్చుని మాట్లాడుకుందామని అన్నారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయని, వీటిని ఏపీ, తెలంగాణ రెండూ వాడుకోవచ్చన్నారు. కృష్ణానదిలో మాత్రం నీళ్లు తక్కువ ఉన్నాయని, కొత్త అథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందామని చెప్పారు. తెలంగాణ పైన ఉందని, కింద ఉన్న ఏపీ సముద్రంలోకి వెళ్లే నీళ్లు వాడుకుంటే ఇబ్బందేంటని చంద్రబాబు ప్రశ్నించారు. మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం లేదన్నారు.
కేంద్రంలో పలుకుబడి ఉందని బనకచర్లకు అన్ని అనుమతులు వస్తాయని అనుకుంటే అది చంద్రబాబు నాయుడు భ్రమే అవుతుంది అని, ఈ ప్రాజెక్టు విషయంలో టెక్నికల్, లీగల్, పొలిటికల్ మూడు పద్ధతుల్లో పోరాటం చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దీంతో ఆ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు.