– సన్నద్ధానికి కేంద్రం కుట్రలు.. రైతు ఆత్మహత్యలు ఆపలేని ప్రభుత్వ ‘భరోసా, బీమా’
– వ్యవసాయాన్ని కబళిస్తున్న కార్పొరేట్ కంపెనీలు
– విత్తనాలు, పురుగుమందుల్లో గుత్తాధిపత్యం
– ఉత్పత్తి ఖర్చును తక్కువగా చూపి ఎమ్మెస్పీ నిర్ణయం సరికాదు : అరిబండి ఫౌండేషన్, రైతు సంఘం సదస్సులో ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూకృష్ణన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరించే క్రమంలో వ్యవసాయ కరెంట్ మోటార్లకు మీటర్లు బిగించేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూకృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఒక్కో మీటర్‌కు రూ. 8 వేల నుంచి రూ.10 వేల భారం రైతులపై పడుతుందని చెప్పారు. వేల కోట్ల ఆస్తులు కలిగి, లాభాల్లో ఉన్న చంఢగీడ్ విద్యుత్ రంగాన్ని అదానీ కంపెనీకి అప్పగించారని గుర్తు చేశారు. దీనివల్ల రైతులపై అదనపు ఆర్థిక భారం పడిందన్నారు. గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమురయ్య హాల్‌లో అరిబండి పౌండేషన్, తెలంగాణ రైతు సంఘం సంయుక్తాధ్వర్యంలో ‘వ్యవసాయం రంగం- ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఫౌండేషన్ చైర్మెన్ అరిబండి ప్రసాదరావు అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా విజ్జూకృష్ణన్ మాట్లాడుతూ దేశంలోని వ్యవసాయాన్ని నాలుగు కార్పొరేట్ కంపెనీలు శాసిస్తున్నాయని చెప్పారు. ఆ కంపెనీల గుత్తాధిపత్యంలోనే 46 శాతం విత్తనాలు, పురుగు మందులు ఉన్నాయని విమర్శించారు. వాటిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. సరళీకరణ విధానాల(1990) ప్రభావం వ్యవసాయం పడిందనీ, వాటివల్ల రైతులకు అనేక సౌకర్యాలు అందుతాయని ఆనాటి పాలకులు నమ్మబలికారని తెలిపారు. కానీ అందుకు భిన్నంగా దేశంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. 30 ఏండ్లుగా సరళీకరణ విధానాలను అమలు చేయడం వల్ల దేశంలో నాలుగున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో కౌలు రైతులు, కూలీలు, ఆదివాసీలు, మహిళా రైతులు ఉన్నారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామంటూ హామీ ఇచ్చి, మోడీ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలే లేవని చూపించడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఉపాధి కూలీలకు ఏడాదికి రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని కోరుతుంటే, ఆ చట్టానికి బడ్జెట్‌లో నిధులు తగ్గించారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు నిర్ణయించడంలో రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నదని విమర్శించారు. ఉత్పత్తి ఖర్చును తగ్గించి చూపించి, మద్దతు ధరలు నిర్ణయించడం కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో పత్తి సాగు 50 లక్షల ఎకరాల్లో పండుతున్నదనీ, మద్దతు ధరల వల్ల రైతులు రూ.28వేల కోట్లు నష్టపోతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చిందని గుర్తు చేశారు. వాటికి వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో 380 రోజులపాటు సమరశీల ఉద్యమం జరిగితే, చివరకు కేంద్రం దిగొచ్చి, ఆ చట్టాలను రద్దు చేసి, రైతులకు క్షమాపణ చెప్పిందన్నారు. ఆ ఉద్యమంలో 736 మంది రైతులు చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. ఈ మూడు చట్టాలను కలిపి నూతన వ్యవసాయ మార్కెంటింగ్ చట్టాన్ని తీసుకొస్తున్నదని హెచ్చరించారు. సబ్సిడీల విషయంలో ధనిక దేశాలు, భారత రైతాంగం మధ్య అసమానతలు పెరుగుతున్నాయనీ, ఫలితంగా విదేశాల నుంచి దిగుమతులు పెరిగి, భారతీయ పంటలకు అధిక ధరలు రావడం లేదని వివరించారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌తో రైతులకు నష్టం జరుగుతుందనీ, మలేషియా, థారుల్యాండ్ దేశాల రబ్బర్‌కు కేజీ రూ. 230 ఉంటే, కేరళలో ఉత్పత్తి అవుతున్న రబ్బర్‌కు కేజీ రూ. 120 మాత్రమే ఉందన్నారు. టైర్ల ధరలు మాత్రం పెరుగుతున్నాయని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ రాజిరెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటలు వేయాలని సూచించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ కలిపి చేసే చోట రైతులు లాభాసాటిగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో బహుళ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలనీ, పత్తి, వరి సాగు చేయడం వల్ల రైతులకు నష్టాలు వస్తున్నాయన్నారు. కోతులు, పందులు, నెమళ్లు వల్ల పంటలకు తీవ్ర నష్టాలు వస్తున్నాయన్నారు. ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
పంజాబ్ ప్రభుత్వ కార్యదర్శి అరిబండి వేణు ప్రసాద్ (రిటైర్డ్) వ్యవసాయం చేయడం అంత సులువు కాదన్నారు. పంజాబ్‌లో 1100 అడుగుల లోతు నుంచి నీటిని తోడి వరి పండిస్తున్నారనీ, దీనివల్ల రైతులకు పెద్దగా ప్రయోజనాలు ఏమీ లేకపోగా, కరెంట్ వినియోగం ఎక్కువగా ఉందని వివరించారు. పంజాబ్‌లో రైతుఆత్మహత్యలు ఎక్కువగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమని తెలిపారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ సమగ్ర ప్రణాళిక లేదని విమర్శించారు. దీనివల్ల రైతులు తమకు ఇష్టం వచ్చిన పంటలు సాగు చేస్తున్నారనీ, డిమాండ్-సప్లరు సూత్రం వికటించి నష్టాలపాలైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌రావు, టి. సాగర్, ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి, సహాయ కార్యదర్శి మూఢ్ శోభన్, అరిబండి పౌండేషన్ కార్యదర్శి అరిబండి మనోహర్, సభ్యులు అమర్‌నాథ్, అరిబండి ప్రసాదరావు భార్య ఝన్సీ, ఆయన కుమారులు, కోడళ్లు, బంధువులు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
రైతులపై మీటర్ల భారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES