Friday, July 11, 2025
E-PAPER
Homeజాతీయంముంబయిలో పాలస్తీనా సంఘీభావ నిరసనను అడ్డుకున్న పోలీసులు

ముంబయిలో పాలస్తీనా సంఘీభావ నిరసనను అడ్డుకున్న పోలీసులు

- Advertisement -

– సీపీఐ(ఎం), వామపక్ష నాయకులు, కార్యకర్తల ముందస్తు అరెస్టులు
– పెద్దఎత్తున హాజరైన ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పాలస్తీనా సంఘీభావ నిరసనను ముంబయి పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ(ఎం), వామపక్ష నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. పోలీసుల అణచివేతను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. గాజాలో ఇజ్రాయిల్‌ మారణహోమాన్ని ఖండిస్తూ వామపక్ష పార్టీలు ముంబయిలోని ఆజాద్‌ మైదాన్‌లో ప్రదర్శన నిర్వహించాయి. ఈ నిరసనను అడ్డుకునేందుకు ముంబయి పోలీసులు తెల్లవారుజాము నుంచే నాయకులను అరెస్టు చేయడం ప్రారంభించారు. ఇందుకోసం సీపీఐ(ఎం) భాండుప్‌ కార్యాలయం వద్ద భారీస్థాయిలో పోలీసులు మోహరించారు. పార్టీ ముంబాయి జిల్లా కమిటీ సభ్యులు హరి ఘాడ్గే, శైలేంద్ర చౌహాన్‌, స్థానిక కమిటీ కార్యదర్శి, ఆరే కాలనీ పోరాట నాయకుడు తబ్రేజ్‌ అలీని అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ పోవై పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధంలో ఉంచారు. సీపీఐ సీనియర్‌ నాయకులు ప్రకాష్‌ రెడ్డి, చారుల్‌ జోషిలను వారి ఇండ్ల నుంచి తీసుకెళ్లారు. పీడబ్ల్యూపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి రాజు కోర్డే, ధారావికి చెందిన ఇద్దరు అదానీ వ్యతిరేక కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రాష్ట్ర కార్యదర్శి మెరాజ్‌ సిద్ధిఖీ, సీపీిఐ(ఎంఎల్‌)కు చెందిన శ్యామ్‌ గోహిల్‌, ఐపీఎస్‌ఎఫ్‌కు చెందిన ఫిరోజ్‌ మిథిబోర్వాలాను కూడా నిర్బంధంలో ఉంచారు. ఈ సంఘీభావ ప్రదర్శనలో భాగస్వామ్యం కావాలని సన్నద్ధమైన ప్రతి రాజకీయ పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలను పోలీసులు తీసుకెళ్లారు.
ప్రజాస్వామ్య వ్యతిరేక, నిరంకుశ, రాజ్యాంగ వ్యతిరేక అణచివేత చర్యను సీపీఐ(ఎం) మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయిల్‌ మారణహోమానికి మద్దతిస్తున్న పాలక బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ఆదేశం మేరకు పోలీసులు ఈ అణచివేతకు పూనుకున్నారు. ప్రజాస్వామ్య నిరసనలకు వేదికగా ముంబయి హైకోర్టు ఆజాద్‌ మైదాన్‌ను కేటాయించిందని, ఈ నిరసన ప్రదర్శనను నిషేధించడంతో ముంబయి పోలీసులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని పార్టీ విమర్శించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ హోం శాఖను కూడా నిర్వహిస్తున్నారని, ఆయన ఆదేశం మేరకే పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రజలు వామపక్ష పార్టీల పిలుపునకు పెద్దసంఖ్యలో స్పందిస్తూ పాలస్తీనా సంఘీభావం ప్రదర్శనల్లో పాల్గొన్నారని తెలిపింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడింది. అసెంబ్లీలో పెండింగ్‌లో ఉన్న మహారాష్ట్ర ప్రజా భద్రతా బిల్లును దూకుడుగా ముందుకు తీసుకురావడంలోనే రాష్ట్ర ప్రభుత్వ అణచివేతను అర్థం చేసుకోవచ్చని వెల్లడించింది.
అయితే ఈ అణచివేత చర్యలన్నింటినీ ప్రతిఘటించి ఆల్‌ ఇండియా పీస్‌ అండ్‌ సాలిడారిటీ ఆర్గనైజేషన్‌ (ఏఐపీఎస్‌ఓ) ఆధ్వర్యంలో ముంబయిలోని ఆజాద్‌ మైదాన్‌ శివార్లలో నిరసన కొనసాగింది. పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతూ.. గాజాలో ఇజ్రాయిల్‌ జాతి విధ్వంసాన్ని ఆపాలని డిమాండ్‌ చేస్తూ ప్రజలు శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ(ఎం), సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, సీఐటీయూ, ఐద్వా వంటి మహిళా సంఘాలకు చెందిన ప్రతినిధులు పోలీసుల వలయాన్ని, భారీ పోలీసు మోహరింపును తప్పించుకుని, నిషేధాన్ని ధిక్కరించి, నిర్ణయించిన విధంగా ఆజాద్‌ మైదాన్‌లో ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలో సీపీఐ(ఎం), ఏఐపీఎస్‌ఓ నాయకులు డాక్టర్‌ వివేక్‌ మోంటెరో, శైలేంద్ర కాంబ్లే, డాక్టర్‌ ఎస్‌.కే రేగే, అడ్వకేట్‌ ఆర్మైటీ ఇరానీ, చంద్రకాంత్‌ భోజ్‌గర్‌, సుగంధి ఫ్రాన్సిస్‌, రేఖ దేశ్‌పాండే, సంగీత కాంబ్లేతో సహా అనేక మంది పాల్గొన్నారు. ఏఐపీఎస్‌ఓ ఆధ్వర్యంలో ముంబాయి మరాఠీ పత్రకార్‌ సంఫ్‌ు, ప్రెస్‌ క్లబ్‌ ఆజాద్‌ మైదాన్‌ వెలుపల ఉన్న ఈఎన్‌ఎస్‌ఏ కాంపౌండ్‌లో ప్రదర్శన జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -