– అమెరికా ఆంక్షలున్నా తట్టుకుని నిలబడుతున్నాం
– క్యూబా ఒంటరి కాదు… ప్రపంచమంతా అండగా ఉంది
– చేగువేరా, క్యాస్ట్రో మాకు నిరంతరం స్ఫూర్తిదాయకం
– భారత్‌తో కొనసాగుతున్న సత్సంబంధాలు : క్యూబా రాయబారి జుయెన్ కార్లోస్
– క్యూబాకు మద్దతుగా నిలబడదాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
హైదరాబాద్‌లో క్యూబా సంఘీభావ సదస్సు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సామ్రాజ్యవాదంపై పోరాడేది సోషలిస్టు దేశాలేనని భారత్‌లో క్యూబా రాయబారి జుయెన్ కార్లోస్ అన్నారు. అమెరికా అనేక రూపాల్లో ఆంక్షలు విధిస్తున్నా వాటిని తట్టుకుని నిలబడుతున్నామనీ, ముందుకెళ్తున్నామని చెప్పారు. క్యూబా ఒంటరి కాదనీ, ప్రపంచమంతా అండగా ఉందన్నారు. చేగువేరా, ఫైడల్ క్యాస్ట్రో తమకు నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉంటారని వివరించారు. వారు చూపిన మార్గంలోనే వెళ్తున్నామని అన్నారు. సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో క్యూబా సంఘీభావ సదస్సును నిర్వహించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు స్టాలిన్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన క్యూబా రాయబారి జుయెన్ కార్లోస్ మాట్లాడుతూ 1959 నుంచి భారత్‌తో క్యూబా సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఫైడల్ క్యాస్ట్రో పేద దేశాలు, పేదల ప్రజల గురించే నిత్యం ఆలోచించారని అన్నారు. 1973, 1983లో క్యాస్ట్రో భారత్‌కు వచ్చారని గురు చేశారు. అలీన ఉద్యమంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. సోషలిస్టు దేశాల మధ్య ఐక్యత, కమ్యూనిస్టుల ఐక్య ఉద్యమాలతోనే సామ్రాజ్యవాదాన్ని ఓడించగలమని అన్నారు. క్యూబా మీద అమెరికా అనేక రకాలుగా ఆంక్షలను విధిస్తున్నదని చెప్పారు. ప్రపంచ దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలు ముఖ్యంగా భారత్‌లో ఉన్న సీపీఐ(ఎం), సీపీఐ ఎల్లప్పుడూ తమకు అండగా నిలబడ్డాయని వివరించారు. ఆగస్టు 13న క్యాస్ట్రో జయంతి వరకు క్యూబా సంఘీభావ కార్యక్రమాలను చేపడతామన్నారు. అమెరికా ఆంక్షల వల్ల క్యూబా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని చెప్పారు. పర్యాటక రంగంపై ఆంక్షలున్నాయనీ, పర్యాటకులు స్వేచ్ఛగా రావడం, వెళ్లడం జరగడం లేదని అన్నారు. క్యూబాలో అమెరికా ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదులున్నారని విమర్శించారు. ఆ దేశాన్ని అన్ని రంగాల్లో అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నదని చెప్పారు. ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోకుండా అమెరికా ఆంక్షలు విధిస్తున్నదని వివరించారు. అయినప్పటికీ విద్యావైద్య రంగాల్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని అన్నారు. వివిధ దేశాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కాకుండా పేద దేశాల్లో క్యూబా వైద్యులు సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. క్యాస్ట్రో, చేగువేరా చూపిన మార్గంలో పేదల కోసం పనిచేస్తున్నామని చెప్పారు. క్యూబాలో ఏకపార్టీ ఉన్నా అమెరికా కంటే గొప్ప ప్రజాస్వామ్యం ఉందన్నారు. పార్లమెం టులో 45 శాతం మహిళలు, 20 శాతం యువ కులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని వివరించారు. క్యూబా విప్లవం విజయవంతమైందనీ, దీన్ని ఏ శక్తీ విచ్ఛిన్నం చేయలేదని అన్నారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎంఏ బేబీకి, శత వార్షికోత్సవాలను నిర్వహిస్తున్న సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజాకు శుభాకాంక్షలు చెప్పారు. భారత్, క్యూబా మైత్రి బరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు.
క్యూబాకు అండగా నిలబడాలి : జాన్‌వెస్లీ
అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి పోరాడుతున్న సోషలిస్టు దేశం క్యూబాకు అండగా నిలబడాల్సిన అవసరముందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. అమెరికా ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రభుత్వాలను కూల్చిందనీ, ఆర్థిక వ్యవస్థలను విధ్వంసం చేసిందని చెప్పారు. అమెరికాకు అనుకూలమైన ప్రభు త్వాలను ఏర్పాటు చేసే కుట్రలు చేసిందన్నారు. క్యూబాను అస్థిరపరిచేందుకు కుట్రలు చేసిందని వివరించారు. వాటిని తట్టుకుని నిలబడిందనీ, ప్రపంచ దేశాలకు క్యూబా ఆదర్శంగా నిలిచిందని అన్నారు. మందుల ముడిసరుకులు, ఆహార ధాన్యాల దిగుమతి, పర్యాట కరంగంపై అమెరికా ఆంక్షలు విధించిందని చెప్పారు. ఉగ్రవాదులకు అండగా నిలిచిందన్నారు. బైడెన్ ఉన్నపుడు వాటికి మినహాయింపులు ఇచ్చినప్పటికీ ట్రంప్ వచ్చాక వాటిని రద్దు చేశారని అన్నారు. అయినప్పటికీ క్యూబాలో ప్రజలకు నాణ్యమైన విద్యావైద్యం ఉచితంగా అందుతు న్నదని వివరించారు. అనేక దేశాలకు వైద్యులను పంపిం చిందని చెప్పారు. అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గ కుండా ఆ దేశానికి దీటుగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. క్యూబాకు ఆర్థిక సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
అమెరికా ఆంక్షలను తిప్పికొట్టాలి : విఎస్ బోస్
క్యూబా ఉండాలి, నిలబడాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్ బోస్ అన్నారు. క్యూబాపై అమెరికా విధిస్తున్న ఆంక్షలను ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఫైడల్ క్యాస్ట్రో మీద అమెరికా సామ్రాజ్యవాదం అనేకసార్లు హత్యా ప్రయత్నాలు చేసిందనీ, లొంగదీసుకోవడానికి కుట్ర చేసిందని చెప్పారు. అమెరికాలాంటి దేశాలు పది వచ్చినా తట్టుకుని సోషలిస్టు దేశంగా నిలబడిందని అన్నారు. ఆయుధాలను అమ్ముకో వడానికి ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధాన్ని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని అమెరికా ప్రోత్సహించిందని వివరిం చారు. అమెరికా ఇప్పుడు ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభంలో ఉందన్నారు. ప్రజల దృష్టిని మరల్చడం కోసమే ట్రంప్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. క్యూబాపై ఆంక్షలను విధిస్తున్నారనీ, వివిధ దేశాలపై సుంకాలను పెంచుతున్నారని అన్నారు. అయినప్పటికీ క్యూబా సోషలి జాన్ని వీడబోదనీ, మార్క్సిజం, లెనినిజం దారిలోనే పయని స్తుందని చెప్పారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు డీజీ నరసింహారావు వేదికపైకి నాయకులను ఆహ్వానించారు.
క్యూబా సంఘీభావంగా విరాళాల సేకరణ
క్యూబాకు సంఘీభావంగా సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో విరాళాలను సేకరించాలని నిర్ణయించాయి. సదస్సుకు హాజరైన వారు విరాళంగా రూ.12,630 ఇచ్చారు. కొంత మంది పెన్షన్ ఇస్తామన్నారు. ఫైడల్ క్యాస్ట్రో జయంతి సందర్భంగా ఆగస్టు 13 వరకు విరాళాల సేకరణ ఉంటుందని ఆ పార్టీలు ప్రకటించాయి. రాష్ట్రంలోని సీపీఐ(ఎం), సీపీఐ శాఖలు, సభ్యులు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సహకరించి క్యూబాకు సంఘీభావంగా నిలబడాలని కోరాయి.
సామ్రాజ్యవాదంపై పోరాడేది సోషలిస్టు దేశాలే
- Advertisement -
RELATED ARTICLES