Wednesday, April 30, 2025
Homeజాతీయంట్రక్‌ డ్రైవర్లపై పనిభారం

ట్రక్‌ డ్రైవర్లపై పనిభారం

– అంగీకరించినందుకు నితిన్‌ గడ్కరికీ ఏఐటీడబ్ల్యూఎఫ్‌ కృతజ్ఞతలు
న్యూఢిల్లీ: దేశంలో ట్రక్‌ డ్రైవర్లపై పనిభారం ఉందని, వారు రోజుకు కనీసం 14 గంటలు పనిచేస్తున్నారనే నిజాన్ని అంగీకరించినందుకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీకి అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య (ఏఐటీడబ్ల్యూఎఫ్‌) కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం న్యూఢిల్లీలో ఈఎన్‌సీఏపీ, ఐఆర్‌టీఈ నిర్వహించిన ఒక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ట్రక్‌ డ్రైవర్లుపై పనిభారం అధికంగా ఉందని, పనిభారం తగ్గించడానికి పని గంటలపై చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. దీనిపై ఏఐటీడబ్ల్యూఎఫ్‌ స్పందిస్తూ నిజానికి ట్రక్‌ డ్రైవర్లు రోజుకు 14 గంటలు చేయడం లేదని, రోజులు తరబడి పని చేస్తున్నారని తెలిపింది. అంతకు మించి నిజమైన చిత్రమేమింటే నేషనల్‌ పర్మిట్‌ ట్రక్కుల్లో ఇద్దరు డ్రైవర్లను నియమించాలనే నియమం గతంలో ఉండేదని, కానీ దీనిని మోడీ ప్రభుత్వమే ఉపసంహరించిందని ఏఐటీడబ్ల్యూఎఫ్‌ గుర్తు చేసింది. అలాగే మోటార్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ (ఎంటిడబ్ల్యూ) చట్టం 1961 ఏ రవాణా కార్మికుడు కూడా రోజుకు 8 గంటలకు మించి పనిచేయకూడదని స్పష్టంగా నిర్దేశిస్తుందని తెలిపింది. కాబట్టి మోడీ ప్రభుత్వం కొత్తగా మరొక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో ఉన్న 29 చట్టాలను రద్దు చేసి మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందని, ఇందులో ఒక కోడ్‌ ‘వృత్తి భద్రత, పని పరిస్థితుల కోడ్‌’ వలన ఎంటీడబ్ల్యూ చట్టం రద్దయిందని తెలిపింది. అన్ని ప్రమాదకరమైన పనులు చేస్తూ, పైకి డ్రైవర్ల పని గంటల నుంచి మాట్లాడం డ్రైవర్లను మోసం చేయడమేనని ఏఐటీడబ్ల్యూఎఫ్‌ విమర్శించింది. మంత్రి నితిన్‌ గడ్కారీ అంతకుముందు జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రహదారుల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ఇది ప్రమాదాలకు కారణమవుతోందని చెప్పారని గుర్తు చేసింది. కాంట్రాక్టర్లు, సంబంధిత ఇంజనీర్లను జైలుకు పంపుతామని కూడా చెప్పారని తెలిపింది. అయితే ఇప్పటి వరకూ ఏమీ జరగలేదని విమర్శించింది. మంత్రి నిజంగా తన మాటలకు కట్టుబడి ఉండే ముందుగా గతంలో తప్పులను సరిదిద్దడానికి తగిన చర్యలు ప్రారంభించాలని, ఆ తరువాత తన వైఫల్యాలకు రాజీనామా చేయాలని ఎఐటిడబ్ల్యూఎఫ్‌ డిమాండ్‌ చేసింది. అప్పుడు మాత్రమే డ్రైవర్లు, రోడ్డు రవాణా రంగంలోని ఇతర భాగస్వాములకు మంత్రిపై విశ్వాసం ఏర్పడుతుందని ఎఐటిడబ్ల్యూఎఫ్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img