Thursday, July 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలురాష్ట్రంలో ప్రభుత్వ విద్య వివక్షకు గురైంది

రాష్ట్రంలో ప్రభుత్వ విద్య వివక్షకు గురైంది

- Advertisement -

– టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ టౌన్‌

గత పదేండ్ల కాలంలో ప్రభుత్వ విద్య వివక్షతకు గురైందని, దాదాపు 8 లక్షల విద్యార్థులు ప్రయివేటుకు తరలివెళ్లారని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని డైట్‌ కళశాలలో నిర్వహించిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది 16 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలో 1 లక్షా 20 వేల మంది చేరితే, 11 వేల ప్రయివేటు పాఠశాలల్లో 5 లక్షల మంది విద్యార్థులు చేరారన్నారు. ప్రయివేటు పాఠశాలల్లో నర్సరీ, కేజీ తరగతులు ఉండటం కూడా దీనికి ఒక బలమైన కారణమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం వెనుకడుగు వేస్తోందని అన్నారు. కేవలం 250 పాఠశాలల్లో మాత్రమే పూర్వ ప్రాథమిక తరగతులకు అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. రాష్టవ్య్రాప్తంగా 5 వేల ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంచి అభివృద్ధి చేయాలి తప్ప కొత్త పాఠశాలలను ప్రారంభించడం అనాలోచిత నిర్ణయమని అన్నారు. దీనివల్ల నష్టమే తప్ప లాభం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగాన్ని కాపాడాల్సిన బాధ్యతను తీసుకోవాలని, అందుకు అవసరమైన ప్రయత్నాలు మొదలుపెట్టాలని కోరారు. ఉపాధ్యాయుల పదోన్నతులు వెంటనే చేపట్టాలని, హెల్త్‌ కార్డ్స్‌ ప్రయోజనాలు అందేలా చూడాలని, పెండింగ్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ అమలుకు ముందుకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.కిష్టన్న, వి. అశోక్‌, ఉపాధ్యక్షులు టి.సూర్య కుమార్‌, కోశాధికారి కె శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శులు ఏ.స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -