1975 జూన్ 25/26 నాకు ఇంకా బాగా జ్ఞాపకం ఉంది. అది డిగ్రీ పరీక్షల చివరి రోజు. నేను మార్క్సిస్టు పార్ట్టీ పూర్తికాలం కార్యకర్తగా వచ్చిన రోజు. ఆ రోజు నిరంకుశత్వం దేశాన్ని అంధకారంలో ముంచిన రోజు. ఆ రోజును నేను మర్చిపోను. మనలో ఎవరూ కూడా మర్చిపోకూడదు.
శ్రీమతి ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న ఆనాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం జూన్ 25 అర్థరాత్రి దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వందలాది మంది ప్రతిపక్ష నాయకులను రాత్రికి రాత్రి అరెస్టు చేసి జైళ్లలో కుక్కింది. పత్రికల నోరునొక్కింది. సెన్సార్‌షిప్ విధించింది. సమ్మెలను నిషేధించింది. వందలాది కార్మిక నాయ కులను చెరసాలలో వేసింది. విద్యార్థి నాయకులను నిర్బంధించింది. నిరసన తెలిపే హక్కును కూడా తొలగించారు. ఎన్నికలు రద్దుచేశారు. వేతనాలను స్తంభింపచేశారు. సెలవులలో కోత పెట్టారు. లే ఆఫ్‌లను చట్టబద్ధం చేశారు. కరువుభత్యాన్ని సగానికి తగ్గించారు. రాత్రికి రాత్రే ప్రాథమిక హక్కులు తుడిచిపెట్టబడ్డాయి. మురికివాడలను, గుడిసెలను నేలమట్టం చేశారు. ఒక్క ఢిల్లీ నగరంలోనే 1,50,105 ఇళ్లను కూల్చివేశారు. దేశ వ్యాప్తంగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. లక్ష మందికి పైగా ప్రతిపక్ష నాయకులను, కాంగ్రెస్‌లోని అసమ్మతి వాదులను రాత్రికి, రాత్రే అరెస్ట్ చేసి జైళ్లో పెట్టారు. వందలాది మంది జర్నలిస్టులు, ట్రేడ్ యూనియన్ వాదులు, విద్యార్థి నాయకులు, రాజకీయ పార్టీల కార్యకర్తలను నిర్బంధించారు. మిసా, డిఐఎస్‌ఐఆర్, సిఓఎఫ్‌ఇపిఒఎస్‌ఎ అనే క్రూరమైన చట్టాలు ప్రజలను విచారణ లేకుండా జైలులో పెట్టడానికి ఉపయోగించారు. మిసా కింద 34,988 మందిని, డిఐఎస్‌ఐఆర్ కింద 75,818 మందిని నిర్బంధించారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చాలా మం దిని కస్టడీలో హింసించారు. కొందర్ని చంపారు కూడా! 1976 మార్చి 1న కాలికట్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి పి.రాజన్‌ను కస్టడీలో చంపడం నాటి క్రూరత్వానికి ఒక చిహ్నం. నా విద్యార్థి ఉద్యమ సహచరుడు, రూమ్ మేట్ అయిన నాయకుడ్ని, ఆయనతో గదిలో నిద్రిస్తున్న గెస్టును కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. గెస్టు సౌకర్యం కోసం పడుకునేందుకు వేరే రూమ్‌కు వెళ్లిన నేను తప్పించుకున్నాను.
అర్ధరాత్రి అకస్మాత్తుగా అత్యవసర పరిస్థితి విధించడంతో దేశం దిగ్భ్రాంతికి గురైంది. కానీ పెరుగుతున్న నిరంకుశత్వపు ముప్పు గురించి సీపీఐ(ఎం) చాలా కాలం క్రితమే హెచ్చరించింది. 1972 మధురై మహాసభలోనే భారతదేశం ఏకపార్టీ నిరంకుశత్వం వైపు పయనిస్తోందని, అణచివేతకు సీపీఐ(ఎం) ప్రధాన లక్ష్యమవుతుందని పేర్కొన్న పార్టీ రానున్న రోజుల్లో ఈ నిర్బంధం అందరి మీదకు వస్తుందని హెచ్చరించింది. ఆ కాలంలో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ మూకలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సాయంతో అర్థ ఫాసిస్టు నిర్బంధానికి దిగాయి. మన సహచరులను అనేకమందిని హత్య చేశారు. కేరళలో కూడా అదే కాంగ్రెస్ పాలనలో మన కార్యకర్తలు చాలామంది హత్యలకు గురయ్యారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటాలలో సీపీఐ(ఎం) ముందంజలో ఉన్నందున దాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నిరంకుశత్వం కొనసాగింపే దేశానికి విస్తరించి ఎమర్జెన్సీ రూపంలో ప్రజాస్వామ్యాన్ని హరించింది.
నిర్బంధంతో, నిరంకుశత్వంతో అధికారాన్ని కాపాడుకోగలమని శ్రీమతి ఇందిరాగాంధీ భావించారు. కానీ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సిద్ధమయ్యారు. ఎమర్జెన్సీకి అధికార ముద్ర వేయడానికి సమావేశమైన పార్లమెంటులో ప్రతిఘటనా స్వరాన్ని సీపీఐ(ఎం) నేత కామ్రేడ్ ఎ.కె.గోపాలన్ వినిపించారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఆయన చేసిన ప్రసంగాన్ని ముద్రించి రహస్యంగా విద్యార్థుల్లో పంపిణీ చేసిన విషయం నాకింకా గుర్తుంది.
కొన్ని వార్తా పత్రికలు కూడా తమ ప్రతీకాత్మక చర్యల ద్వారా నిరసనను తెలియచేశాయి. జూన్ 26న ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ ‘డెమోక్రసీ, బిలవ్డ్ హజ్బెండ్ ఆఫ్ ట్రూత్, లవింగ్ ఫాదర్ ఆఫ్ లిబర్టీ, బ్రదర్ ఆఫ్ ఫెయిత్, హోప్ అండ్ జస్టిస్ ఎక్స్‌పైర్డ్ ఆన్ జూన్ 26’ అనే శీర్షికతో సంస్మరణ ప్రకటనను ప్రచురించింది. జూన్ 28న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఖాళీ సంపాదకీయాన్ని ప్రచురించింది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ రవీంద్రనాథ్ టాగూర్ రాసిన ‘వేర్ ది మైండ్ ఈజ్ వితవుట్ ఫియర్’ పద్యాన్ని పునర్‌ముద్రించింది. సీపీఐ(ఎం)కు చెందిన వివిధ ప్రచురణలు తమ కాలమ్‌ల ద్వారా సెన్సార్‌షిప్‌ను, రాజ్యం యొక్క అణచి వేత చర్యలను తీవ్రంగా నిరసిస్తూనే ఉన్నాయి.
సహజంగానే ప్రతిఘటనలో కేరళ అగ్ర భాగాన ఉంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియచేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై, ప్రజా ఉద్యమాలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. అచ్యుతా నందన్, పినరయి విజయన్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పినరయి క్రూరమైన థర్డ్ డిగ్రీ హింసకు గురయ్యారు. హింస అణచివేతకు ఒక సాధారణ సాధనంగా మారింది. అయితే కేరళ నుండి వచ్చిన ఈ ప్రతిఘటనోద్యమం దేశానికే ఉత్తేజాన్నిచ్చింది. అందుకు జేజేలు తెలియజేస్తున్నాను. ప్రజా ఉద్యమాలు, ప్రజా ఒత్తిడికి ఇందిరాగాంధీ తలొగ్గక తప్పలేదు. 1977 మార్చి 21న ఆమె ఎమర్జెన్సీని ఎత్తివేశారు. తీవ్రమైన ప్రజాగ్రహానికి గురయిన ఆమె ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
అయితే, అన్ని రాజకీయ శక్తులు ఎమర్జెన్సీని ప్రతిఘటించలేదు. భారతీయ జనసంఫ్‌ు (బీజేపీ పూర్వ రూపం) అగ్ర నాయకత్వం నాటి ప్రభుత్వం ముందు లొంగిపోయింది. ది హిందూలో ప్రచురితమైన తన 2,000వ వ్యాసం ‘అన్‌లెరన్డ్ లెసన్స్ ఆఫ్ ది ఎమర్జెన్సీ’లో డాక్టర్ సుబ్రమణ్యన్ స్వామి ఆర్‌ఎస్‌ఎస్, బిజెఎస్‌లకు చెందిన నాయ కులు ఇందిరా గాంధీతో ఎందరు రహస్య చర్చలు చేశారో సవివరంగా రాశారు. పాలకులతోనూ, పాలనా యంత్రాంగంతోనూ ఆరెస్సెస్ చాలా త్వరగా సుహృద్భావ సంబంధాలను పెట్టుకుంది. ఆరెస్సెస్ చీఫ్ బాలా సాహెబ్ దేవరస్ ఇందిరా గాంధీకి మద్దతు ఇస్తూ రాసిన లేఖలు ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. వామపక్షాలతో పాటు ఇతర ప్రతిపక్ష శక్తులకు చెందిన వేలాది మంది కార్యకర్తలు జైలు పాలై, చిత్ర హింసలకు గురయ్యారు. అదే సమ యంలో సంఫ్‌ు అగ్ర నాయకులు మాత్రం తప్పించుకున్నారు. ఎమర్జెన్సీని ప్రతిఘటించడంలో తాము కూడా భాగమయ్యామని చెప్పుకునే నైతిక హక్కు నేడు బీజేపీకి లేదు.
అయినప్పటికీ, అదే బీజేపీ ఇప్పుడు జూన్ 25ను ‘సంవిధాన్ హత్య దివస్’ (రాజ్యాంగ హత్య దినం)గా ప్రకటిస్తోంది. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఈ రోజుకు గుర్తుగా ఏడాది పొడవునా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన వారిని గౌరవించడానికి మరియు రాజ్యాంగాన్ని బలహీనపరచడం వల్ల కలిగే ప్రమాదాలను ఎత్తిచూపడానికి ఈ కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది. కానీ ఇది ఒక క్రూర పరిహాసం. అత్యవసర పరిస్థితిలో లొంగిపోయిన వారు ఇప్పుడు తమను తాము ప్రజాస్వామ్య రక్షకులుగా చెప్పుకుంటున్నారు. ఎవరో సరిగ్గానే చెప్పినట్లు ”రాజ్యాంగాన్ని వధించిన వారే ఇప్పుడు దాని గొప్పతనాన్ని ప్రశంసిస్తూ పాడుతున్నారు. దాని సంరక్షకులుగా నటిస్తున్నారు.” వాస్తవానికి, మోడీ పాలనలో నేడు మనం చూస్తున్నది ‘ఎమర్జెన్సీ నాటి నిరంకుశత్వపు పునరుద్ధరణ’. అయితే ఈసారి దాన్ని అధికారికంగా ప్రకటించ లేదు. కానీ, 1975 అత్యవసర పరిస్థితి నాటి ప్రతి భయానక ఘట్టం ఇప్పుడు పునరావృతమవుతోంది. విస్తృతమవుతోంది!
నిజానికి గత పదకొండు సంవత్సరాలలో ఒక పద్ధతి ప్రకారం జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలు అత్య వసర పరిస్థితిని ప్రతి విషయంలోనూ ప్రతిబింబిస్తాయి. నేటి ‘ఉపా’ అప్పట్లో ‘మిసా’ పోషించిన పాత్రనే పోషిస్తోంది. మునుపటిలాగే, రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థులు, రాజకీయ ప్రత్యర్థులు, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే గొంతులను అణచివేస్తున్నారు. ప్రబీర్ పుర్కాయస్థ 1975లోనూ, 2023లోనూ అరెస్టు చేయబడి భారత ప్రజా స్వామ్యంలోని రెండు చీకటి అధ్యాయాలకు (1975-77, 2014 -2025. సజీవ చిహ్నంగా నిలుస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో, మోడీ పాలన ఇద్దరు సిట్టింగ్ ముఖ్యమంత్రులను అరెస్టు చేసింది. ప్రతిపక్ష నాయకులను భయపెట్టడానికి, ఒత్తిడికి గురిచేయడానికి దర్యాప్తు సంస్థలను ఉపయోగించింది. పార్టీని ఫిరాయింపచేయడం లేదా లొంగిపోవడం లక్ష్యంగా ఈ వేధింపులు కొనసాగాయి. మూక హత్యలు, ద్వేషపూరిత ప్రచారాలు, మైనారిటీ ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం, రాజ్య మద్దతుతో కూడిన నిఘా, హింస మోడీ పాలనలో సాధారణ అంశాలుగా మారాయి. విశ్వవిద్యాలయాల నుండి మురికివాడల వరకు అన్ని ప్రాంతాల్లోనూ నిరసనను, అసమ్మతిని అణచివేస్తున్నారు.
ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ 21 నెలలు కొనసాగింది. మోడీ అప్రకటిత ఎమర్జెన్సీ పదకొండవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రధాన మీడియా మోడీ ప్రచార సాధనంగా మారింది. ఉద్యమాలను అణిచివేయడం, విమర్శ కులను అణచి వేయడం, ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేయడం, నిఘాను కొనసాగించడం వంటి కొత్త ఫాసిస్ట్ పరిస్థితిని ఒక క్రమపద్ధతిలో ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కమ్యూనిస్టులు, మైనారిటీలు, లౌకిక శక్తులను ఈ అణచివేతకు లక్ష్యంగా చేసుకున్నారు.
పెద్ద పెట్టుబడిదారులు, భూస్వాములు తమ వర్గ ప్రయోజనాలను కాపాడుకోవడానికి నిరంకుశ శక్తులకు మద్దతు ఇస్తారని సీపీఐ(ఎం) ఎల్లప్పుడూ హెచ్చరిస్తూనే ఉంది. 1975లో కూడా, గుత్తాధిపత్య పెట్టుబడిదారుల్లో ఒక విభాగం అత్యవసర పరిస్థితిని స్వాగతించింది. ‘పార్లమెంటరీ వ్యవస్థ మన ప్రజలకు సరిపోదు’అని నాడు టాటా అన్నారు. నేడు, మోడీ పాలనలో లౌకికవాదం, సమాఖ్యవాదం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం యొక్క పునా దులను నాశనం చేసే ప్రాజెక్ట్‌లో మతతత్వ శక్తులతో కార్పొరేట్ ప్రపంచంలోని చాలా భాగం చేతులు కలిపింది.
అప్పుడు ఎమర్జెన్సీతో పోరాడి ఓడించినట్లే, మనం మళ్లీ కదలాలి. నిరంకుశత్వాన్ని నిరోధించడానికి, రాజ్యాం గంలో పేర్కొన్న ప్రాథమిక విలువలను రక్షించడానికి లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను సీపీఐ(ఎం) మరోసారి సమీ కరిస్తోంది. 50 సంవత్సరాల తర్వాత అత్యవసర పరిస్థితిని గుర్తుంచుకోవడం కేవలం చరిత్రను జ్ఞాపకం చేసుకోవడం కోసం కాదు. పెరుగుతున్న మతతత్వ, నయా ఫాసిస్టు శక్తుల నుండి మన గణతంత్రాన్ని రక్షించుకోవాలనే మన సంక ల్పాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడానికి ఇది ఓ క్రీయాశీల పిలుపు!
(1975 జూన్ 25 దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజు)
– బి.వి.రాఘవులు
జూన్ 25: గుర్తుంచుకోవలసిన ప్రతిఘటనా దినం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES