అదేంటో…అప్పట్లో కాళ్లకు బలపం కట్టుకొని ఊరూరా తిరిగిన పెద్దాయన, పదేండ్లు సీఎం కాగానే, ఏసీలు, ప్రోటోకాళ్లకు అలవాటు పడి, జనానికి దూరం అయ్యాడు. ఆ పదేండ్లలో నిజాం సర్కార్‌నాటి దొరతనాన్ని చూసిన ఓటరు దేవుళ్లు, సాల్లే ఇక…పెతిపక్షంలో కూసో అంటూ ప్రజాస్వామ్య తీర్పు సెప్పారు. ఠాఠ్…నన్నే కుర్సీ నుంచి దింపుతారా? అంటూ జనంపై అలిగిన పెద్దాయన, అసెంబ్లీకి రాకుండా, జనంలోకి వెళ్లకుండా, లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోయి, ఏ ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికలోనూ పోటీ చేయకుండా, సీఎం కుర్సీ అయితేనే కూసుంటా అంటూ పంతం పట్టి పరదాల సాటునే ఉండిపాయే! ఏడాదికోపాలి వైకుంఠ ద్వార దర్శనం లెక్క ఇప్పుడు ఆ పార్టీ పాతికేండ్ల సంబురం వచ్చేసింది. ఇంకేముంది…సారొస్తారొస్తారూ…అంటూ సిన్నా, పెద్దా లీడర్లంతా వరంగల్ వైకుఠద్వారం వద్ద ఆ ‘సారు’ ప్రత్యక్ష దర్శనం కోసం కండ్లు కాయలు కాసేలా సూడబడ్తిరి. అప్పట్లో పుట్టపర్తి సాయి బాబాను కూడా భక్తుల మధ్యలోకి రాకుండా, అద్దాల మేడలో ఉంచి, ఎక్కడలేని దైవత్వాన్ని ఆపాదించి, అప్పుడప్పుడు బయట తిప్పుతూ, ఆహా ప్రత్యక్షదైవం…ఓహో కలియుగదైవం అంటూ కీర్తించేవారట! ఇప్పుడీ ‘సారు’ పరిస్థితీ ఇలాగే తయారైనట్టుంది. ఇంతకీ ఇప్పుడీ సంగతి ఎందుకు గుర్తొచ్చిందబ్బా!!
– ఎస్‌ఎస్‌ఆర్ శాస్త్రి
హే ప్రభూ… దర్శనమియ్యవా?
- Advertisement -
RELATED ARTICLES