జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాద దాడి భారత దేశాన్నే కాక ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంత పెద్ద సంఖ్యలో అమాయకులు బలికావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. ప్రకతి సౌందర్యానికి పర్యాటకానికి పేరుగాంచిన మినీ స్విట్జర్లాండ్‌లో ఆహ్లాదకరంగా యాత్రకు వెళ్లిన పౌరులను చుట్టుముట్టి తలలో కాల్చి మరి ప్రాణాలు తీయడం భయత్పాతం సష్టించడం కోసమే. పర్యాటకుల మత విశ్వాసాలను తెలుసుకుని మరి హత్య చేశారన్నది మీడియాలో ప్రధానంగా వెళ్లడవుతున్న కథనం. దీన్ని బట్టి ఇది మతపరమైన దాడిగా చిత్రించే ప్రయత్నాలు కూడా ఆయా శక్తులు తీవ్రం చేస్తున్నారు. ఈ ఘాతుకానికి కారణమైన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్) లష్కర్-ఎ-తోయిబాకు ముసుగు మాత్రమేనని నిఘా వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి కుల,మత,జాతి,సాంస్కతిక తదితర ముద్రలతో దురభిమానాలను తగిలించి ప్రజల్ని విభజించటం, విద్వేషాలు పెంచడం కుటిల రాజకీయాల్లో భాగమే. పహల్గాం మారణకాండ భారతదేశాన్ని దెబ్బతీయటానికి జరిగిందే గాక, మతపరమైన ఉద్వేగాల వైపు మళ్లించటం నిజంగానే ఒక పెద్దకుట్ర. ఉగ్రవాద బందాల్లోనూ ఒక ఆదిల్ అనే టెర్రరిస్టు ఉండగా ఈ నరహంతకుల బారి నుంచి యాత్రికులను కాపాడేందుకు సాహసంతో ప్రాణాలర్పించిన పోనీ రైడర్ పేరు కూడా ఆదిల్. తన కొడుకు ఉగ్రవాదుల నుంచి యాత్రికులను రక్షించినందుకు గర్విస్తున్నానని ఆదిల్ తండ్రి మహమ్మద్ గొప్పగా చెప్పారు. పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వెంటనే ఈ ఘాతుకం జరగడం కూడా యాదచ్ఛికం కాదు. తన మనుగడ కోసం మరోసారి కాశ్మీర్‌లో చొరబాట్ల ద్వారా తీవ్రవాదాన్ని ఎగదోసేందుకు పాకిస్తాన్ సైనిక శక్తులు ఇదే సరైన అదను అని భావించినట్టు కనిపిస్తోంది. కాశ్మీర్‌లో మా మూలనరం అలాగే ఉన్నదని జనరల్ మునీర్ ప్రకటించిన రెండు మూడు రోజుల్లోనే ఇంతటి హత్యాకాండ జరిగింది. ఎప్పుడో మహమ్మద్ అలీ జిన్నా, గోల్వాల్కర్ వంటి వారు ముందుకు తెచ్చిన ద్విజాతి సిద్ధాంతాన్ని కూడా జనరల్ మునీర్ ప్రస్తావించటం దుర్బుద్ధితోనే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాజకీయ ఆర్థిక దుస్సాహస చర్యలు, టారిఫ్ యుద్ధాలతో ప్రపంచం తికమక పడుతున్న సమయంలోనే ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పన్నేండేండ్ల తర్వాత భారత సందర్శనకు వచ్చిన సమయంలోనే. ఈ అమానుషానికి పాల్పడటంలో స్పష్టమైన, కచ్చితమైన రాజకీయ వ్యూహాత్మక సంకేతాలున్నాయి. కాశ్మీర్‌లో పర్యాటక రంగం పునరుద్ధరణ జరగకుండా ఆదిలోనే అడ్డుకోవడం దుండగుల పథకంగా కనిపిస్తోంది. ఎందుకంటే పారిశ్రామిక వ్యవసాయ అవకాశాలు అభివద్ధిలేని ఆ రాష్ట్రంలో పర్యాటకమే ప్రధాన జీవనోపాధిగా కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాం తాలకు సంకేతాలు పంపడానికి కూడా టూరిస్టులపై దాడి ప్రభావం చూపుతుంది. తెలుగువారు కూడా ఈ హత్యాకాండలో బలయ్యారు.
ఉద్రిక్తతల పరాకాష్ట
సహజంగానే భారతదేశం దీనిపై తీవ్రంగా స్పందించింది. సౌదీ అరేబియా నుంచి ముందుగానే వచ్చేసిన ప్రధాని మోడీ తగు సమాధానం ఇస్తామని ప్రకటించారు. అమరుసటి రోజు బీహార్‌లోని మధువనిలో రాజకీయ సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఊహించలేని స్థాయిలో తమ జవాబు ఉంటుందని హెచ్చరించారు. ఆ టెర్రరిస్ట్ గడ్డను తుడిచేస్తామని ప్రకటించారు.1960 నుంచి మూడు యుద్ధాలు తట్టుకుని కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తున్నట్లు ఇండియా ప్రకటించింది.దేశంలోని పాకిస్తానీయులు వెంటనే వెనక్కి వెళ్లాలని ప్రభుత్వం అల్టిమేట్ జారీచేసింది. పాక్ జాతీయుల వీసాలను రద్దు చేసింది. తమ తమ రాష్ట్రాల్లోని పాకిస్తాన్ పౌరులను గుర్తించి పంపేయాలని అధికారులను ఆదేశించింది. సైనిక దళాల ప్రధాన అధికారి ద్వివేది కాశ్మీర్‌లో పర్యటించి లెప్టిినెంట్ గవర్నర్ మనోజ్ సక్సేనాతో చర్చలు జరిపారు. సరిహద్దుల్లో కాల్పుల ఘటనలు, ఒక ఉగ్రవాది ఇల్లు పేల్చివేత అటు ఇటు మరికొన్ని మరణాలు సంభవించాయి. ఇందుకు ప్రతిగా పాకిస్తాన్ ప్రభుత్వం సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడమంటే యుద్ధం ప్రకటించడమేనని పాకిస్తాన్ వ్యాఖ్యానించింది. 1972 ఇందిరాగాంధీ , భుట్టోల సిమ్లా ఒప్పందం ఇరుదేశాలు సమస్యలను ద్వైపాక్షి చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, మరో దేశానికి చోటివ్వరాదని నిర్దేశిస్తున్నది. దాని రద్దు పర్యవసానాలు చాలా ఉంటాయి. అదే విధంగా పాకిస్తాన్ భారత విమానాలకు గగన తలాన్ని మూసివేసింది. ఇరుగు పొరుగు దేశాలు, అమెరికాతో సహా ఉగ్రదాడిని ఖండించాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గూటెక్ రెండు దేశాలు సంయమనం చూపాలని పిలుపునిచ్చారు. ఇలా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.
రాజకీయ నేపథ్యం
దేశంలో వక్ఫ్‌చట్టం, ప్రార్థనాస్థలాల చట్టం మార్పులు, రాజకీయ న్యాయ పోరాటాలకు దారితీస్తున్న సమయం. పెద్ద రాష్ట్రాలైన బీహార్, ఉత్తర ప్రదేశ్,తర్వాత కేరళ, బెంగాల్, గుజరాత్, తమిళనాడు వంటివి వరుసగా ఎన్నికలకు వెళుతున్న సందర్భం. ఒకే దేశం-ఒకే ఎన్నిక వంటి రాజకీయ రాజ్యాంగ అంశాలు చర్చ నడుస్తున్న తరుణం. మరీ ముఖ్యంగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చబడిన జమ్మూకాశ్మీర్‌లో తొలి సారిగా ఎన్నికైన ఓమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం హయాంలో కాశ్మీర్ జీవనాధారమైన పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటూ వేసవి యాత్రికుల సందడి పెరుగుతున్న సమయం. మరో రెండు మాసాల్లో జూన్‌లో చాలా ప్రత్యేకమైన అమర్‌నాథ్ యాత్ర కూడా ప్రారంభం కానుంది. మరోవంక చూస్తే పాకిస్తాన్ ఆర్థికంగా పూర్తి దివాలా తీసి రాజకీయ అస్థిరతలో అంత:కలహాల్లో చిక్కి సైన్యం పట్టు పెరుగుతున్న తరుణం. ప్రజల మద్దతుతో ఎన్నికైన ఒమర్ ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి సహకరించకపోగా కేంద్రం సర్వాధికారాలు గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల ఉపాధి అవకాశాలు పెరక్క అసంతప్తి వ్యాపిస్తున్నదని పరిశీలకులు చెబుతూ వచ్చారు. ప్రశాంతత నెలకొనగానే కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తిని ఇస్తామని సుప్రీంకోర్టుకు, పార్లమెంటుకు హామీనిచ్చిన మోడీ ప్రభుత్వం దాన్ని వెంటనే అమలు అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని ప్రజాస్వామ్య శక్తులు కోరుతూ వచ్చాయి. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా యువత స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు ఆటంకం కల్పించడంపై ఆందోళన వ్యక్తమవుతూ వస్తున్న సమయంలో ఈ దాడి అనేక విధాల కాశ్మీర్‌ను మరింతగా కష్టాలపాలు చేసే ప్రమాదం పొంచివుంది.
నిఘా, భద్రతా వైఫల్యం
ఈ దాడుల తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు కేంద్రం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ప్రకటిస్తూనే పూర్వపరాలను ప్రశ్నించాయి. నిఘా విభాగం నుంచి ముందస్తు సమాచారాలు అందలేదా? భద్రత దళాలు అప్రమత్తంగా లేవా? ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి. జమ్మూకాశ్మీర్ శాంతిభద్రతలు పూర్తిగా కేంద్రం అధీనంలోనే ఉన్నాయి. హోంమంత్రిగా అమిత్‌షా జరిపే సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రితో సహాఎవరు అనుమతించడం లేదు. 370 రద్దు తర్వాత రూపుదాల్చిందంటున్న నవ కాశ్మీరం (నయాకాశ్మీర్) ఒక్కసారిగా పహల్గాంకు ఎందుకు చేరిందని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశారు వంటి వారు ప్రశ్నించారు. ఎందు కంటే పాక్ జనరల్ వ్యాఖ్యలకు ముందే ఏదోకుట్ర తలపెట్టారని కథనాలు వస్తూనే ఉన్నాయి. తాము ముందే నిఘా సమాచారం అందించినప్పటికీ భద్రతాలోపం జరిగిందని కేంద్రం చూచాయిగా అంగీకరించింది.అయితే బైసరన్ లోయకు పర్యాటకులను అనుమతి స్తున్నట్టు అధికారులు తెలియ జేయలేదని వ్యాఖ్యానించింది. ఏడాది పొడుగునా జరిగే బైసరన్ పర్యాటకం గురించి ప్రత్యేకించి తెలియజేయడం ఏమీ ఉండదని రాష్ట్ర పోలీ సులు చెబుతున్నారు. ఇక్కడే స్పష్టమైన సమాచారం సమన్వయ లోపం కనిపిస్తుంది. వాస్తవానికి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయం కలిగించటానికి కేంద్రం పనిచేస్తుందని కాశ్మీర్ సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడైన యూసఫ్ తరిగామి ఆపార్టీ 24వ మహాసభ సందర్భంగానే వ్యాఖ్యనించారు. ఇప్పుడైనా రాష్ట్రానికి పూర్తి అండదండలివ్వడం ద్వారా ప్రజలనుకు ఉపాధి కల్పన విశ్వాసం పాదుకొల్పాలని రాష్ట్రంలో జరిగిన అఖిలపక్ష సమావేశం కోరింది.
అవాంఛనీయం..అత్యవసరం..
ఈ ఘటనల తర్వాత దేశంలోని కొన్నిచోట్ల విశ్వవిద్యాలయాల్లో ఇతర కేంద్రాల్లో కాశ్మీర్ విద్యార్థులపై దాడులు జరగటం ఆందోళన కలిగిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ , చండీగర్, ఉత్తరాఖండ్‌లలో సంఘ పరివార్ సంస్థలు వేధింపులకు దిగుతున్నట్లు వార్తలు వచ్చాయి. డెహ్రాడూన్‌ను అనేక మంది విద్యార్థులు, సంస్థలు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి. ఉత్తరప్రదేశ్‌లో ఆమిటీ యూనివర్సిటీలో కాశ్మీర్ విద్యార్థిని తీవ్రంగా కొట్టిన వీడియో వైరల్ అయింది. దీనిపై జమ్మూకాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ కన్వీనర్ నశీర్ కుహామి ఫిర్యాదు చేశారు. మీడియా చర్చల్లో కూడా కొంతమంది నేతలు తీవ్రభాషతో విద్వేషాలు పెంచడం దష్టికి వచ్చింది. గతంలో ఎన్నికలకు ముందు పుల్వామా, బాలకోట్ వంటి ఘటనలు అప్పటి సర్జికల్ స్ట్రైక్స్ పదేపదే ప్రస్తావిస్తూ ఈసారి యుద్ధం వచ్చేసినట్టు మాట్లాడటం పరిష్కారం చూపదు. ప్రధాన పత్రికల సంపా దకీయాలు యుద్ధం పరిష్కారం కాదని నొక్కి చెప్పాయి. చైనాకు, పాకిస్తాన్‌కు సంబంధాలు నిజమైనప్పటికీ ఇలాంటి విషయాల్లో మద్దతిస్తున్నట్లు కొంతమంది చిత్రించటం కూడా వాస్తవ దూరమే. అమెరికా అదేశాలతోనే తాము ఉగ్రవాదాన్ని పోషించే తప్పు పనిచేశామని పాకిస్తాన్ రక్షణ మంత్రి కాజా ఆసిఫ్ చెప్పారు. దాడి చేసిన వారు స్వాతంత్య్ర యోధులని పాక్ ఉపప్రధాని ఇషార్ ఖాన్ అంటే కీలుబొమ్మ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీనిపై తటస్త దర్యాప్తునకు సిద్ధమంటున్నారు. ఏమైనప్పటికీ దేశ సమైక్యతను కాపాడుకుంటూ, దుష్టశక్తుల విషయంలో అప్రమత్తత పాటించడం, కాశ్మీర్‌ను బలోపేతం చేయడం ఇప్పుడు జరగాల్సింది.
– తెలకపల్లి రవి