– రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ
వాషింగ్టన్: అమెరికాలో చదువుకుంటున్న వేలాది మంది విదేశీ విద్యార్థుల వీసా రిజిస్ట్రేషన్లను ట్రంప్ ప్రభుత్వం పునరుద్ధరించింది. స్వల్ప కారణాలతో, చట్టపరమైన ఉల్లంఘనలతో రద్దు చేసిన వీసాలు కూడా వీటిలో ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను న్యాయమూర్తులు పరిశీలించారు. విదేశీ విద్యార్థుల ఆచూకీ తెలుసుకోవడానికి ఉపయోగించే ఫెడరల్ డేటాబేస్ నుంచి విద్యార్థులను పెద్ద సంఖ్యలో తొలగించడం చట్టవిరుద్ధమని వారు తేల్చారు. దీంతో తమ ఉత్తర్వులను రద్దు చేసుకుంటున్నామని న్యాయ మంత్రిత్వ శాఖ కోర్టుకు తెలిపింది.
ఫెడరల్ డేటాబేస్ నుంచి తమ పేర్లను తొలగించడంపై వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టపరంగా తమకు లభిస్తున్న ఇమ్మిగ్రేషన్ హోదాను కోల్పోతామని, తమను వెంటనే స్వదేశాలకు తరలిస్తారని వారు భయపడ్డారు. ప్రభుత్వ చర్యను సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. తాము చదువుతున్న విద్యా సంస్థలు తమను ఇప్పటికే తరగతులకు హాజరు కానివ్వడం లేదని, పరిశోధనలు చేయనివ్వడం లేదని, గ్రాడ్యుయేషన్‌కు కొన్ని వారాల ముందే ఇలాంటి చర్యలు చేపట్టారని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. విద్యార్థులను తరగతులకు అనుమతిస్తారా లేక వారు వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాల్సిన అవసరం ఉన్నదా అని న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వ న్యాయవాదులు ఇష్టపడలేదు. దీనిపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఫెడరల్ డేటాబేస్ నుంచి విద్యార్థులను తొలగించడంపై ఈ నెల ప్రారంభంలో వందకు పైగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిలో 50 కేసులపై తీర్పు వెలువరించిన న్యాయమూర్తులు విద్యార్థులకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని కనీసం 23 రాష్ట్రాలలో విద్యార్థులపై చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న వారి ఎఫ్-1 వీసాలకు సంబంధించి నూతన విధానాన్ని రూపొందించే విషయంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కృషి చేస్తున్నారని న్యాయ శాఖ తెలిపింది. విధానాన్ని జారీ చేసే వరకూ విద్యార్థుల సేవిక్ రికార్డులను తొలగించడం జరగదని హామీ ఇచ్చింది. కాగా అమెరికా విదేశాంగ శాఖ విద్యార్థుల వీసాలను పూర్తిగా రద్దు చేసే ప్రక్రియను నిలిపివేస్తుందో లేదో తెలియడం లేదు.
విద్యార్థి ‘వీసా’లపై వెనక్కి తగ్గిన ట్రంప్
- Advertisement -
RELATED ARTICLES