Tuesday, April 29, 2025
Homeజాతీయంప్రాంతీయ ఆర్థిక అసమానతలతోనే అధిక నష్టం

ప్రాంతీయ ఆర్థిక అసమానతలతోనే అధిక నష్టం

– ట్రంప్‌ సుంకాల ప్రభావంపై ఆర్థిక నిపుణుల మనోగతం
– ఉత్తరాదిపై రాజకీయ ఉదాసీనత
– ఈశాన్య రాష్ట్రాలను విస్మరించారు
– కొన్ని రాష్ట్రాలపైనే ఆధారం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 10వ తేదీన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. భారతీయ ఉత్పత్తులపై ఆయన 26 శాతం సుంకాలు విధించారు. ఆ వెంటనే స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఐటీ, ఫార్మ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయన్న వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమంటే ఎగుమతుల విషయంలో భారత్‌ సాధిస్తున్న విజయాలు కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి.
న్యూఢిల్లీ: మన దేశం నుంచి జరుగుతున్న ఎగుమతులలో గుజరాత్‌ అగ్రస్థానంలో ఉంది. అక్కడి నుండి 33.5 శాతం ఎగుమతులు జరుగుతున్నాయి. గుజరాత్‌తో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి జరుగుతున్న ఎగుమతులు దేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతులలో 70 శాతానికి పైబడి ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రాలపై ట్రంప్‌ విధించిన నూతన సుంకాల కారణంగా వెంటనే ప్రభావం పడుతుంది. అయితే ట్రంప్‌ ప్రభుత్వం సుంకాల నుంచి 90 రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించడంతో ఆయా రాష్ట్రాలు కొంత ఊపిరి పీల్చుకున్నాయి.
ఎగుమతుల్లో అసమానతలు
ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఎగుమతులు ఒకేలా జరగడం లేదు. వాటి మధ్య తీవ్రమైన అసమానతలు ఉన్నాయి. ఉదాహరణకు అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి కేవలం 4.97 శాతం ఎగుమతులు మాత్రమే జరుగుతుండడం గమనార్హం. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచి అయితే మొత్తం ఎగుమతులలో కేవలం 2.15 శాతం ఎగుమతులు మాత్రమే జరుగు తున్నాయి. ఈ అసమానతలకు కారణం ఆయా రాష్ట్రాలలో వనరులు లేకపోవడం కానేకాదు. రాజకీయ చిత్తశుద్ధి, వ్యవస్థాగతమైన జడత్వమే దీనికి ప్రధాన కారణం.
కనీస సౌకర్యాలకు నోచుకోని ఈశాన్యం
గుజరాత్‌లో ప్రత్యేక ఆర్థిక మండళ్లు, లాజిస్టిక్స్‌పై దృష్టి సారిస్తున్నారు. పెట్టుబడులపై ఆ రాష్ట్రానికి ఓ స్పష్టత ఉంది. అయితే ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కంటే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అక్కడి నుండి జరిగే నగదు బదిలీల పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఈ ప్రాంతం 5,400 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నప్పటికీ ఎగుమతులలో దాని వాటా కేవలం 0.13 శాతం మాత్రమే. నాగాలాండ్‌, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు రవాణా, గిడ్డంగులు, పంపిణీ, సరఫరాల విషయంలో బాగా వెనుకబడి ఉన్నాయి. అక్కడ డ్రై పోర్టులు, వాణిజ్య కారిడార్లు, గిడ్డంగులు కూడా లేవు. అంటే దీనర్థం ఇతర ప్రాంతాల కంటే ఈశాన్య భారతం వెనుకబడి ఉన్నదని కాదు. కాకుంటే అది ఎన్నడూ ఇతర ప్రాంతాలతో కలసిపోలేదు.
అతిగా ఆధారపడితే ముప్పే
అమెరికా ఉత్పత్తులపై భారత్‌ సగటున 52 శాతం సుంకాలు విధిస్తే ట్రంప్‌ ప్రభుత్వం అందుకు ప్రతిగా మన వస్తువులపై 26 శాతం సుంకాలు విధించింది. ప్రస్తుతం భారత్‌తో అమెరికా వాణిజ్య లోటు 46 బిలియన్‌ డాలర్లు. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులలో సుమారు 18 శాతం అమెరికాకే వెళుతున్నాయి. ట్రంప్‌ విధించిన సుంకాలు ఔషధాలు, టెలికం పరికరాలు, ఆభరణాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. 2023-24లో మన దేశం నుంచి అమెరికాకు జరిగిన 77.8 బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన వస్తువుల ఎగుమతులలో ఈ మూడింటి విలువ 17.8 బిలియన్‌ డాలర్లు. వీటి తయారీ పరిశ్రమలన్నీ ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలలోనే ఉన్నాయి. ఇలా కొన్ని రాష్ట్రాలపైనే ఆధారపడే విధానాన్ని కేంద్రం మార్చుకోని పక్షంలో, అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతులు జరిగేలా చూడని పక్షంలో ఇబ్బందులు తప్పవు. ఆగేయాసియాకు సరిహద్దున ఉన్న మణిపూర్‌, మిజోరం రాష్ట్రాల నుంచి ఎగుమతులే జరగడం లేదు. ఎగుమతి విధానాన్ని రూపొందించే పట్టికలో కూడా ఆ రాష్ట్రాలకు చోటు లేదు.
ప్రభుత్వం ఏం చేయాలంటే…
ఈ అసమానతలను నివారించాలంటే కేంద్రం ఏం చేయాలి? నగదు బదిలీలపై ఆయా రాష్ట్రాలు ఎక్కువగా ఆధారపడడాన్ని నివారించాల్సి ఉంటుందని నిపుణులు సూచించారు. భూమి, కార్మిక విధాన సంస్కరణలు, లాజిస్టిక్స్‌ ఫలితాలు, ఎగుమతుల వైవిధ్యంతో ముడిపెట్టి నిధులను అందజేయాలి. 2029 నాటికి రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరపాలని రాజస్థాన్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈశాన్య రాష్ట్రాలకు సాధికారత కల్పించడం కూడా కేంద్రం బాధ్యతే. ఆ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని కేంద్రం ఎన్ని డప్పాలు కొట్టుకున్నా మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలలో సరిహద్దును పంచుకుంటున్న దేశాలకు ఒక్క వాణిజ్య కారిడార్‌ కూడా లేదు. కొల్‌కతాను సముద్రం ద్వారా మయన్మార్‌ తో కలపడానికి ఉద్దేశించిన కలడాన్‌ మల్టీ మోడల్‌ ప్రాజెక్ట్‌, భారత్‌-మయన్మార్‌-థారులాండ్‌ త్రైపాక్షిక హైవే నిలిచి పోయాయి. ఇంఫాల్‌, ఐజ్వాల్‌ వంటి రాష్ట్రాలలో పట్టణ పాలన, వాణిజ్య మౌలిక సదుపాయాలు ఇప్పటికీ జాతీయ ప్రాధాన్యత లతో అనుసంధానం కాలేదు. ఈశాన్య ప్రాంతంలోని వాణిజ్య ఇంటిగ్రేషన్‌ మిషన్‌ ద్వారా మన దేశం ప్రయోజనం పొంద వచ్చు. అందుకోసం సరిహద్దు ప్రాంతాలలో మౌలిక సదుపా యాల కల్పన, గిడ్డంగుల నిర్మాణం, వ్యవసాయాధారిత సంస్థల ఏర్పాటు జరగాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా జాతీయ వాణిజ్య వ్యూహాలలో ఈశాన్య రాష్ట్రాల విధానాలకు స్థానం కల్పించాలి.
ప్రస్తుతం మన ఎగుమతి వ్యవస్థ ఉత్తరాదిని రాజకీయంగా అంటరాని ప్రాంతంగా చూస్తోంది. ఈశాన్య ప్రాంతాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఇప్పుడు మనం సహకార ఫెడరలిజం నుంచి పనితీరు ఫెడరలిజంకు మారాల్సి ఉంటుంది. ఉత్తరాదిని 21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈశాన్యాన్ని ఓ సరిహద్దు ప్రాంతంగా కాకుండా వ్యూహాత్మక ఆర్థిక మండలిగా చూడాలి. వాణిజ్య ఏకీకరణ అనేది ప్రసంగాల ద్వారా కాకుండా విధానం, మౌలిక వసతుల కల్పన, ప్రాతినిధ్యం ద్వారా జరగాలి. ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయంతో ప్రమాదంలో పడింది కేవలం ఎగుమతుల పరిమాణమే కాదు. అది భారత ఆర్థిక పొందికను కూడా ప్రమాదంలో పడేస్తోంది.
బయటపడిన లోపాలు
భారత ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సంబంధాలు, కరెన్సీ మార్కెట్లపై అమెరికా సుంకాలు స్వల్ప, దీర్ఘకాలిక ప్రభావాలు చూపుతాయని ఆర్థిక విశ్లేషకుడు అంకుర్‌ శర్మ తెలిపారు. ఇప్పటికే ఎగుమతులు అధికంగా జరుగుతున్న రాష్ట్రాల పైనే ఈ ప్రభావం ఉంటుంది. ట్రంప్‌ సుంకాలు భారత ఆర్థిక ఫెడరలిజంలో రెండు విభిన్న లోపాలను బయట పెట్టాయి. హిందీ రాష్ట్రాలలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు రాజకీయ ఉదాశీనతకు నిదర్శనాలు. ఈ రాష్ట్రాలలో వాణిజ్య సంబంధమైన మౌలిక సదుపాయాలు లేవని, లాజిస్టిక్స్‌ పనితీరు అధ్వానంగా ఉన్నదని నిటి ఆయోగ్‌ సూచిక చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img