Wednesday, April 30, 2025
Homeదర్వాజకోపం నిండిన కవిత్వం

కోపం నిండిన కవిత్వం

కోపం ఆత్మకథ (The Biography of Anger) అనే ఈ పుస్తకం ఒడియా కవి కుమార్‌ మొహంతి కవితల ఆంగ్లానువాదాల సంకలనం. ఒడియా కవులలో ప్రధానంగా చెప్పుకోదగినవారిలో కుమార్‌ మొహంతి (1941-1955) ఒకరు. ఆనం కాబ్య ఆందోళన్‌ (Anam Kabya Andolan) అనే నూతన వైతాళిక కవిత్వ ఉద్యమానికి ఆయన ఆద్యుడు. శీర్షికల స్థానంలో కేవలం బిందువులను (చుక్కలను) పెట్టి, వాటిని అనామక శీర్షికలుగా వదలడం ఈ పద్ధతిలోని విశేషం. ఆ కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవిత్వంలో విధ్వంసకరమైన వస్తువులతో నడపబడిన విప్లవ సాహిత్యోద్యమం అది. 1969 లో ప్రారంభమైన ఆనం ఉద్యమం 20 వ శతాబ్ది చివరి దశాబ్దం వరకు చురుకుగా సాగింది.

ఈ సంకలనంలో కుమార్‌ మొహంతి రాసిన 30 కవితలకు ఆంగ్లానువాదాలు వున్నాయి. వాటిలో చిన్మొరు జెనావి నాలుగు, దుర్గా ప్రసాద్‌ పాండావి ఐదు, మనువా దాస్‌ వి ఐదు, మను దాష్‌ వి మూడు, మోనాలిసా జెనావి ఐదు, నిఖిలేశ్‌ మిశ్రావి ఐదు, రబీంద్ర కె. స్వేన్‌ వి మూడు ఉన్నాయి. ఈ ఆంగ్లానువాద కవితల సంకలనం కమార్‌ మొహంతి చనిపోయిన తర్వాత 77 సంవత్సరాలకు వెలువడింది. ఈ కవితలలో ఆర్తి, క్రూరమైన దుఃఖపు జీర, సొంత సాంస్కతిక వాతావరణానికి చెందిన ఆభిజాత్యం కనిపిస్తాయి. అవి కవులు, తత్త్వవేత్తలు ఏ ప్రాథమిక అంశాలనైతే నిరంతరంగా సవాలు చేస్తూ వచ్చారో వాటిమీద తిరిగి ప్రశ్నలను వేస్తాయి. శీర్షికల విషయంలో ప్రపంచం ఆమోదించిన పద్ధతిని నిరాకరించడాన్ని నిరసనగా సంకేతిస్తుంది కుమార్‌ మొహంతి కవిత్వం. ఆనం అనే ఒడియా పదానికి వాచ్యార్థం (literal meaning) ‘అనామక’ ఐనా, దాని భావార్థం (implied meaning) నిరాకరణ అని మనం గ్రహించాలి. ఈ సందర్భంలో కోపం అంటే, పాటిస్తూ వచ్చిన విధానాలను తిరిగి సమీక్షించడం అని భావించాలి. మనుషుల వ్యవహారాలను లేదా బాధలను పట్టించుకోవడం, తీవ్రమైన ఆక్రోశంతో ప్రశ్నించడం ప్రాథమిక పరిశీలనకు దారి తీస్తుంది. ఇక్కడ నిరాశ, కోపం, ప్రపంచం ఆమోదించిన పద్ధతిని మళ్లీ సమీక్షించడానికి, నిరోధించడానికి పనికొచ్చే సాధనాలు. మనుషుల ఆత్మగౌరవం ప్రధాన భూమికగా మొహంతి తన కవితలలో విశ్వాసం గురించిన, ఆశ గురించిన విమర్శనాత్మక ఆలోచనను కొత్త సష్టికి మార్గంగా ఎన్నుకున్నారు. ఈ కవితలలో సరళమైన అభివ్యక్తి, సహానుభూతి తీవ్రత, భావగీతాల ప్రవాహ గతి కనిపిస్తాయి. ఈ సంకలనంలోని కవితావస్తువులను ఇలా వర్ణించవచ్చు: మొహంతి దష్టిలో నిరసన అన్నది సహానుభూతికి మరో రూపం. ఆశాభంగం ప్రారంభం, ఆర్తీ సహానుభూతులు అంతిమ న్యాయాలు కాగా, వాటిని సాధించే సాధనం కోపం.
తన కవితా వాతావరణాన్ని అన్వేషించడం కోసం కుమార్‌ మొహంతి కొన్ని మానసిక స్థితులను, భావోద్వేగాలను ఎంచుకుంటారు. కొన్ని కవితలలో కరుణకు తావిచ్చే శోకరసం కనపడుతుంది. ఈ పంక్తులను చూడండి: ”కళ్లు కన్నీళ్లలో కుళ్లిపోతాయి.” ”నీ మది ఒక వర్షాకాలపు జల్లు” ఇటువంటి భావోద్వోగం ఒక మానసిక స్థితిని నెలకొల్పే ప్రాథమిక పద్ధతి అని ఈ సమీక్షకుని అభిప్రాయం. మొహంతి పదేపదే నిరసనకు పాల్పడుతారు. ఈ విషయాన్ని ఈ పంక్తులలో గమనించవచ్చు: ”ప్రజలను మోసం చేసేవాళ్లమీద/ మతాన్ని మారువేషంగా మార్చుకునేవాళ్లమీద/ ఓ కన్నేసి ఉంచండి.” ”నువ్వు నా ఆకలిని ఆసరాగా చేసుకుని నన్ను దోచుకున్నావు/ వకాల్తా తీసుకుని మాట్లాడకు,” అంటూ మొదలయ్యే అతని కవితలో కఠినమైన కంఠస్వర ధోరణి, ప్రత్యక్ష విమర్శ ఉంది. సమాజంలో వ్యాపించిన పీడనను, అన్యాయాలను ప్రతిఘటించేందుకు కవి తన కోపాన్ని ప్రభుత్వం మీదికి, ప్రభుత్వ సంస్థల మీదికి మళ్లిస్తాడు. అదేవిధమైన ప్రభావాన్ని సాధించేందుకు కవి కొన్నిసార్లు వ్యంగ్యాన్ని ఆశ్రయిస్తాడు. ఈ పంక్తిని పరిశీలించండి: ”పున్నమరాత్రి వేళ ఆడే జూదపు ఆటలో/ మనం మారువేషాల్లో ఉండే బేహారులం.” కానీ మొహంతి కొన్నిసార్లు సున్నితమైన భావోద్వేగంతో మనలో ఆశలను రేకెత్తిస్తారు. ఈ పంక్తులను గమనించండి: ”నింగిలో మబ్బులు లేవు/ ఐనా తనంత తానుగా నాట్యమాడే నెమలి ఉంది.”
నదులు, దేవాలయాలు, జగన్నాథుడు, చీకటి దేవుడు కాలియా, గ్రామీణులు, వారి అలవాట్లు వీటిని సూచించే మాటలు కవిలోని స్థిరత్వాన్ని తెలుపుతాయి. కానీ అంతిమ ఫలితం అన్నిసార్లు ఆకర్షణీయంగా ఉండదు. ఎందుకంటే, అనువాదంలో భావం నష్టానికి గురౌతుంది. దీనికి ఉదాహరణ ఏమంటే, చక్కని ఒడియా సాంస్కతిక ప్రవత్తిని వెలయించే పాటలాంటి కవిత, అరిగిపోయిన ఆంగ్లపదాల రూపంలో దర్శనమిస్తుంది. ఈ కవితా భాగాన్ని పరిశీలించండి:
Life is to plunge into a stream, between the twin flames of birth and death. In the currents of these streams the heart burns and flames look through the ashes.
(జననం, మరణం అనే జంటజ్వాలల మధ్య ప్రవహించే నదిలోకి దూకడమే జీవితం ఆ స్రవంతులలో హదయం దహించుకుపోయి మంటలు బూడిదగుండా వీక్షిస్తాయి).
(ఆంగ్లానువాదంలో భావానికి నష్టం జరిగిందని సమీక్షకుడు చెప్పాడు కాబట్టి, ఇక్కడ ఆంగ్లమూలాన్ని ఇచ్చి, దానికి నా తెలుగు అనువాదాన్ని పొందుపరచాను. – అనువాదకుడు)
కోపం ఆత్మకథ కుమార్‌ మొహంతి కవిత్వానికి అచ్చమైన పరిచయం, ఆనం కవిత్వ లక్షణాలను ప్రతిబింబించే వత్తాంతం లేదా ఉదాహరణ. ఐతే అది కేవలం చారిత్రక ప్రాధాన్యాన్ని సూచించేది కావచ్చు. ఒడిశాకు చెందిన ఆనం కవిత్వ ఉద్యమం గురించిన పుస్తకాలు ఆంగ్లభాషలో ఎక్కువగా ఉన్నాయో లేవో నేను చెప్పలేను. కాబట్టి, ఆ సాహిత్యోద్యమ చారిత్రక సాంస్కతిక పరిచయం, ఆ ఉద్యమంలో చేరిన ఇతర కవుల మరిన్ని ఉదాహరణలతో కూడిన వివరణ ఈ సంకలనపు విలువను ఇంకొంచెం పెంచివుండేది అని నా భావన. ఒడిశా రాష్ట్రానికి బయట ఉన్న పాఠకులకు కుమార్‌ మొహంతి కవిత్వాన్ని, ఆయన స్ఫూర్తి పొందిన ఆనం ఉద్యమాన్ని పరిచయం చేసిన అనువాదకులు, సంపాదకుడు ప్రశంసకు అర్హులు అని చెప్పవచ్చు.
(ఈ సమీక్ష ఇండియన్‌ లిటరేచర్‌ 345 వ సంచికలో ప్రచురితమైంది)

ఆంగ్లమూలం: కమలాకర్‌ భట్‌
అనువాదం: ఎలనాగ 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img