– ఈ జంట మహమ్మారులతో ప్రాణాలకే ప్రమాదం
– నివారణకు మార్గదర్శకాలు విడుదల చేసిన వైద్య నిపుణులు
న్యూఢిల్లీ : ఆసియాలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న భారతీయులు ప్రస్తుతం టైప్-2 మధుమేహం, జీవక్రియ సరిగా జరగకపోవడంతో వచ్చే కొవ్వు కాలేయ వ్యాధి…అనే ఈ రెండు మహమ్మారులనూ ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. జనాభాకు అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ వ్యాధుల నిర్మూలన కోసం వైద్య నిపుణులు తాజాగా ఏకాభిప్రాయంతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇవి ఇటీవలే ఓ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కొవ్వు కాలేయ వ్యాధిని, టైప్-2 మధుమేహాన్ని నిర్ధారించి, అవసరమైన చికిత్స అందించేందుకు అందులో కొన్ని సిఫార్సులు సూచించారు.
ఒక వ్యాధి సోకితే మరొకటి తీవ్రమవుతుంది
ఇతర జాతులతో పోలిస్తే ఆసియాలో నివసిస్తున్న భారతీయులే ఎక్కువగా కాలేయంలో అధిక కొవ్వుతో బాధపడుతున్నారు. మన దేశంలో ఈ రెండు వ్యాధులు ప్రభావం చూపుతున్నాయి. ఒక వ్యాధి మరో వ్యాధిని తీవ్రతరం చేస్తుందని న్యూఢిల్లీకి చెందిన డాక్టర్ అనూప్ మిశ్రా తెలిపారు. మార్గదర్శకాల రూపకర్తలకు ఆయన నేతృత్వం వహించారు. గతంలో కొవ్వు కాలేయ వ్యాధిని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ) అని పిలిచేవారు. సాధారణంగా ఏ దేశంలో అయినా దీర్ఘకాలిక కాలేయ వ్యాధి సోక డానికి ఇదే కారణమవుతోంది. మన దేశంలో దీని ఉనికి జనాభా ఉప సమూహాలను బట్టి 27.7 శాతం నుండి 88.6 శాతం వరకూ ఉంది. ఆసియా లో నివసిస్తున్న భారతీయులలో ఊబకాయం, మధుమేహం, ఇతర జీవక్రియ సమస్యలు ఉన్న వారిలో దీని ఉనికి 52.8 శాతానికి చేరింది. సగటు న పెద్దగా ప్రమాదం లేని వారిలో ఇది 28.1 శాతం గా మాత్రమే ఉన్నదని ఆ జర్నల్‌లో వివరించారు.
కొవ్వు కాలేయ వ్యాధితో హృద్రోగం ముప్పు
కొవ్వు కాలేయ వ్యాధికి సంబంధించి అంతర్జాతీయంగా మార్గదర్శకాలు ఉన్నప్పటికీ టైప్-2 మధుమేహ రోగుల విషయంలో అలాంటివేవీ లేవని 2006లో అత్యున్నత వైద్య పురస్కారమైన డాక్టర్ బీసీ రారు అవార్డును అందుకున్న డాక్టర్ మిశ్రా తెలిపారు. 2007లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. కాలేయ సంబంధమైన అనారోగ్యానికి, మరణాలకు మాత్రమే కాదు…హృద్రోగ వ్యాధులకు కూడా కొవ్వు కాలేయ వ్యాధి కారణమవుతోంది. ఎయిమ్స్ వంటి సంస్థలకు చెందిన సీనియర్ వైద్యుల భాగస్వామ్యంతో రూపొందించిన మార్గదర్శకాలు…టైప్-2 మధుమేహం రోగులకు, ముఖ్యంగా జీవక్రియ సమస్యలు, ఊబకాయం ఉన్న వారికి తరచుగా కొవ్వు కాలేయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించాయి. బరువు తగ్గడం ఎంతో అవసరమని, దీనివల్ల కొవ్వు కాలేయ వ్యాధి, కాలేయ ఫైబ్రోసిస్ వ్యాధిగ్రస్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపింది.
జీవనశైలిలో మార్పులు అవసరం
ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. తీసుకునే ఆహారంలో 50-60 శాతం కాంప్లెక్స్ కార్బోహైడ్రేడ్లు, 20-30 శాతం కొవ్వులు (ప్రధానంగా అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు), 15-20 శాతం ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. శాచ్యురేటెడ్ కొవ్వులు, రిఫైన్డ్ కార్బోహైడ్రేడ్లు, చక్కెర వినియోగాన్ని తగ్గించాలని సూచించాయి. మొక్కల ఆధారిత ఆహారాన్ని ప్రోత్సహించాలని, అందులో చిక్కుళ్లు, గింజలు, విత్తనాలను చేర్చాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇవి పీచు పదార్థాలు, అత్యవసర పోషకాలలో సమృద్ధిగా ఉంటాయి. కాలేయ ఆరోగ్యానికి మద్దతు ఇస్తూ వాపును తగ్గిస్తాయి. మాంసాహారులు చేపలు, సముద్ర ఆహారం తీసుకోవాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. క్షీరదాల నుండి వచ్చే మాంసాన్ని, ప్రాసెస్ చేసిన మాంసాన్ని తగ్గించాలని అంటున్నాయి. ఎందుకంటే అవి కొవ్వు కాలేయ వ్యాధిని పెంచుతాయి. మరో ముఖ్యమైన సూచన ఏమిటంటే వారానికి 150-300 నిమిషాలు ఓ మాదిరిగా లేదా 75-150 నిమిషాలు తీవ్రంగా శారీరక శ్రమ చేయడం. మద్యపానాన్ని పూర్తిగా వదిలేయాలి.
వీటిని వాడొద్దు
భారతీయ వంటలలో ఉండే కొన్ని రకాల కొవ్వులు హానికారక ప్రభావాన్ని చూపుతాయని మార్గదర్శకాలను రూపొందించిన వైద్య నిపుణులు హెచ్చరించారు. శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వినియోగాన్ని…ముఖ్యంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాన్ని, తరచుగా వేడి చేసిన వంట నూనెలను వాడవద్దని వారు చెబుతున్నారు. వీటిని అధికంగా తీసుకుంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. శరీరానికి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. వాపులు ఏర్పడతాయి. నెయ్యి, కొబ్బరి నూనె, పామాయిల్, వెన్న, క్రీమ్, జంతువుల నుండి తీసిన కొవ్వులో శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒమేగా-6 ప్యూఫాలు ఎక్కువగా ఉన్న నూనెల వినియోగాన్ని కూడా పరిమితం చేయాల్సి ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే వాపులు వస్తాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తీసుకోవడానికి…కాలేయ ఎంజైములు మెరుగుపడడానికి, కాలేయ కొవ్వు-వాపులు తగ్గడానికి మధ్య సంబంధం ఉంది. కాగా రోగులను నిపుణుల వద్దకు ఎప్పుడు పంపాలో కూడా మార్గదర్శకాలలో సూచించారు.+
మధుమేహం…కొవ్వు కాలేయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES