– నిర్దేశించిన ధర కంటే తక్కువకు రీసైక్లర్ల నుంచి బిడ్‌లు
– ‘హితాచీ’ ఈ-వేలంపై ఎదురవుతున్న పలు ప్రశ్నలు
– రూ.కోట్లను సంస్థ ఆదా చేసినట్టు అనుమానాలు
– అంతర్గత రికార్డులతో బహిర్గతం
న్యూఢిల్లీ: ఎయిర్ కండిషనర్ తయారీదారు జాన్సన్ నియంత్రిత హితాచీ.. ఈ-వేస్ట్ విషయంలో ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించినట్టుగా తెలుస్తున్నది. ఈ వ్యర్థాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే చాలా తక్కువ ధరకు రీసైక్లర్ల నుంచి బిడ్‌లను అనుమతించినట్టు సమాచారం. అంతర్గత రికార్డుల కాపీల పత్రాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. అయితే, దీనిపై సంస్థ స్పందించాల్సి ఉన్నది.ఈ-వేస్ట్ నిబంధనల ప్రకారం సెంట్రల్ పొల్యూషన్ ఆఫ్ కంట్రోల్ బోర్డ్(సీపీసీబీ) వినియోగదారుల విద్యుత్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల (సీఈఈడబ్ల్యూ) రీసైక్లింగ్ చేయటానికి కిలోగ్రామ్‌కు రూ.22 ఫ్లోర్ ధరను తప్పనిసరి చేస్తుంది. కానీ, ఈ నెల ప్రారంభంలో డిజిటల్ ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ద్వారా రివర్స్ ఈ-వేలం సమయంలో కంపెనీ ఈ ధర కంటే తక్కువకు బిడ్‌లను అనుమతించినట్టు తెలుస్తున్నది. అది రూ.5.9గా ఉన్నట్టు సమాచారం.ప్రభుత్వ ధరల ప్రకారం ఈ ఈ-వ్యర్థాలకు సంబంధించి వార్షిక రీసైక్లింగ్ బాధ్యతను తీర్చేందుకు కంపెనీ కనీసం రూ.30.04 కోట్లను రీసైక్లర్లకు ఇవ్వాలి. ఈ-వ్యర్థాల మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 13,655 మెట్రిక్ టన్నులుగా ఉన్నది. కానీ ఈ ఈ-వేలం కోసం మొత్తం బిడ్డింగ్ దాదాపు రూ.10 కోట్ల వరకే ఉన్నట్టు అంతర్గత రికార్డులు చూపిస్తున్నాయి. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఈ-వేలంలో దాదాపు 36 బిడ్‌లు దాఖలైనట్టు సమాచారం.
నిబంధనలపై కోర్టును ఆశ్రయించిన పలు కంపెనీలు
ఈ-వేస్ట్ నిబంధనల ప్రకారం రీసైక్లర్లకు అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తుందన్నది హితాచీతో పాటు పలు ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీల ఆందోళన. దీంతో ఈ అధిక చెల్లింపును సవాలు చేస్తూ పలు కంపెనీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్‌ను వేశాయి. ఆ తర్వాత హితాచి తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నది.
ఇతర పిటిషనర్లలో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ, సామ్‌సాంగ్, జపాన్‌కు చెందిన డైకిన్, టాటా యాజమాన్యంలోని వోల్టాస్, హావెల్స్, బ్లూస్టార్‌లు ఉన్నట్టు సమాచారం. ఈ కేసు ఇప్పటికీ కోర్టులో పెండింగ్‌లో ఉన్నది.
సీపీసీబీ చర్యలు తీసుకుంటుందా?
ఈ-వేస్ట్ నిబంధనలను ఏమీ పట్టించు కోకుండా హితాచీ వ్యవహరించిన తీరు ఇప్పుడు పలు అనుమానాలకు దారి తీస్తున్నది. అతి తక్కువ ధరలకు బిడ్‌ను అంగీకరించి.. కోట్ల రూపాయ లను ఆ సంస్థ ఆదా చేసిందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముగింపు ధర, మొత్తం బిడ్డర్ల సంఖ్య ఎంత అనేదానిపై సదరు కంపెనీ నుంచి సమాచారం అందాల్సి ఉన్నది. ఈ వ్యవహారంలో పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోని సీపీసీబీకి నిబంధనల ఉల్లంఘన గురించి సమాచారం అందినట్టు తెలుస్తున్నది. అయితే, ఈ విషయంలో కంపెనీపై సీపీసీబీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది.
రూ.5.90 ధరకు బిడ్‌లు
ఈనెల 6న హితాచీ తన రీసైక్లింగ్ లక్ష్యాలను చేరుకోవటానికి రివర్స్ ఈ-వేలాన్ని ప్రారంభించటానికి ఆన్‌లైన్ సేకరణ వేదికను ఉపయోగించింది. ఈ ప్రక్రియల అత్యల్ప బిడ్డర్ కాంట్రాక్ట్‌ను పొందుతాడు. రూ.5.90 బిడ్ అనేది అప్పటి వరకు దాఖలైన బిడ్‌లను అవరోహనా క్రమంలో పరిశీలిస్తే 17వ స్థానంలో ఉన్నది. అంటే, దాని కంటే కనీసం 16 బిడ్‌లు తక్కువగా ఉండటం గమనార్హం. ”ఎలక్ట్రానిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయటానికి నిర్వహణ ఖర్చు కిలోకు కనీసం రూ.12 నుంచి రూ.16 వరకు ఉంటుంది. రీసైక్లింగ్ చేసేవారు కిలోకు రూ.5-6 చొప్పున ఈపీఆర్ సర్టిఫికెట్లు తమకు అమ్ముతారని హితాచీ ఎలా ఆశించగలదు? ఇది సీపీసీబీ మార్గదర్శకాలైన కిలోకు రూ.22ను ఉల్లంఘించటమే” అని ఈ-వేలం గురించి తెలిసిన రీసైక్లర్ ఒకరు తెలిపారు.