Tuesday, July 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్‌ రామచందర్‌రావు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్‌ రామచందర్‌రావు

- Advertisement -

– ఒకే నామినేషన్‌ దాఖలుతో ఏకగ్రీవం
– నేడు అధికారికంగా అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్‌ సభ్యుల పేర్ల ప్రకటన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్‌.రామచందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన అధ్యక్ష పదవి కోసం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన నామినేషన్‌ పత్రాలను సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శోభా కరంద్లాజే స్వీకరించారు. జాతీయ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నికల నామినేషన్లు కూడా స్వీకరించబడ్డాయి. రాజాసింగ్‌ కూడా అధ్యక్ష పదవి కోసం నామినేషన్‌ వేసేందుకు వచ్చారు. ఆయనకు పది మంది రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుల మద్దతు లభించలేదు. కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే సంతకం చేయడంతో నామినేషన్‌ దాఖలు చేయలేకపోయారు. అధ్యక్షున్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవాలనే అధిష్టానం ఆదేశాలతో ఆయనకు పోటీగా ఎవ్వరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే, మంగళవారం మన్నెగూడలోని వేద కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్‌ సభ్యుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. నరపరాజు రామచందర్‌రావు 1959 ఏప్రిల్‌ 27న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన భార్యపేరు సావిత్రి. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు. ఆయన తండ్రి ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్‌ కావడంతో వర్సిటీలోనే ఉండేవారు. అదే వర్సిటీలో ఎమ్‌ఏ(పొలిటికల్‌ సైన్స్‌), లా విద్యలను అభ్యసించారు. రైల్వే కాలేజీలో డిగ్రీ చదివే రోజుల్లోనే ఏబీవీపీలో చేరారు. ఆ కాలేజీ అధ్యక్షులుగా మూడేండ్లపాటు పనిచేశారు. వర్సిటీలో కొందరు ఆయనపై దాడి చేయడంతో కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. 1977 నుంచి 85 వరకు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. 1986లో అధికారికంగా బీజేపీ పార్టీలో చేరారు. రవీంద్రనగర్‌ నుంచి కార్పొరేటర్‌గా పోటీచేశారు. 1980-82 కాలంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, 2003-06 మధ్యకాలంలో బీజేపీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌గా బాధ్యలు నిర్వర్తించారు. బీజేపీ హైదరాబాద్‌ నగర అధ్యక్షులుగానూ పనిచేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా 2007-15 వరకు బాధ్యతలు చేపట్టారు. 2015లో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2021 వరకు మండలిలో బీజేపీ ప్లోర్‌లీడర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ట్రిబ్యునళ్లలో క్రిమినల్‌, సివిల్‌, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. బీజేపీకి లీగల్‌ సంబంధింత అంశాల్లో సేవలందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -