– ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా
– కోర్సులకు అమలు : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
– త్వరలో అధికారులతో కమిటీ నియామకం..ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సులకు పాత ఫీజులే అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా సోమవారం ఉత్తర్వులు (జీవోనెంబర్ 26) జారీ చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి 2022-25 బ్లాక్ పీరియెడ్‌లో ఉన్న ఫీజులే ఉంటాయని తెలిపారు. త్వరలో అధికారుల కమిటీని నియమిస్తామని పేర్కొన్నారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా వచ్చే విద్యాసంవత్సరాలకు ఫీజులను నిర్ణయిస్తామని వివరించారు. రాష్ట్రంలో ప్రయివేటు ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కాలేజీల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఆర్క్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మా-డీ, ఫార్మా-డీ (పీబీ), ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీఏ ఇంటిగ్రేటెడ్, లా, బీఈడీ, ఒకేషనల్ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో గత బ్లాక్ పీరియెడ్ (2022-25)లో ఉన్న ఫీజులనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 2025-28 బ్లాక్ పీరియెట్‌కు సంబంధించి ఫీజుల ఖరారు కోసం తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) కాలేజీలతో సంప్రదించి ప్రతిపాదనలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏఐసీటీఈ నిబంధనలు, విశ్వవిద్యాలయాల మార్గదర్శకాలను ప్రయివేటు ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు పాటిస్తున్నాయా?లేదా? అనేది పరిశీలించాలని అధికారులకు సూచించింది. ఇంకోవైపు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు అమలు చేస్తున్నాయా?లేదా?అన్నది చూడాల్సి ఉన్నది. మరోవైపు ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఫీజుల వివరాలపైనా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసమే అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించనుంది. ఆ కమిటీ సమర్పించే నివేదిక వరకు 2022-25 బ్లాక్ పీరియెడ్‌లో ఉన్న ఫీజులే 2025-26 విద్యాసంవత్సరంలో అమల్లో ఉంటాయి. పాత ఫీజులే అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎప్‌సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగే అవకాశమున్నది. మంగళవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. ఈనెల ఆరో తేదీ నుంచి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అప్పటి వరకు రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీలు, వాటిలో ఉండే సీట్ల వివరాలను సాంకేతిక విద్యాశాఖ ప్రకటించనుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పాత ఫీజులే అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది. న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టు సమాచారం.
ఈ ఏడాది పాత ఫీజులే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES