నవతెలంగాణ-హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 10 మంది మరణించగా, మరో 34 మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా మండి జిల్లాలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత 32 గంటల్లో సుమారు 332 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రాష్ట్రంలో నిన్న 11 కుండపోత వర్షాలు (క్లౌడ్‌బరస్ట్), నాలుగు ఆకస్మిక వరదలు, ఒక భారీ కొండచరియ విరిగిపడిన ఘటన నమోదైనట్టు అధికారులు తెలిపారు. వీటిలో ఎక్కువ శాతం మండి జిల్లాలోనే సంభవించాయి. సోమవారం సాయంత్రం నుంచి మండిలో రికార్డు స్థాయిలో 253.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ జల ప్రళయానికి వందలాది రహదారులు కొట్టుకుపోగా, విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తీవ్రంగా నష్టపోయిన గోహర్, కర్సోగ్, థునాగ్ పట్టణాల్లో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందాలను రంగంలోకి దించారు. ఒక్క మండి జిల్లాలోనే 316 మందిని కాపాడగా, హమీర్‌పూర్‌లో 51 మంది, చంబాలో ముగ్గురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రం (ఎస్‌ఈఓసీ) ప్రకారం, ఈ విపత్తులో 24 ఇళ్లు, 12 పశువుల పాకలు, ఒక వంతెన పూర్తిగా దెబ్బతిన్నాయి.