విద్యార్థిని కుటుంణబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..
నవతెలంగాణ – పరకాల: హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామం శివారులో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహంలో ఉరివేసుకొని బలవన్మరణం చెందిన పరకాల పట్టణానికి చెందిన ఏకు శ్రీవాణి కుటుంబాన్ని పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి బుధవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీవాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీవాణి ది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్య అని అన్నారు. ఈ ఘటనపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగకుండా పూర్తి విచారణ చేసి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో గురుకుల పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయన్నారు. అయిన గాని ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు.
అదే విధంగా ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తో మాజీ ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు.
గురుకుల పాఠశాలను ఒకసారి సందర్శించి మిగతా పిల్లలకు మనోధైర్యం కల్పించాలని,ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలని కోరారు.మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో పరకాల పట్టణ బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.