నవతెలంగాణ-హైదరాబాద్: గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడుల వల్ల ఇప్పటికే వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ నేపథ్యంలో అక్కడ శాంతిని నెలకొల్పాలని, ఇజ్రాయిల్ దాడులు ఆపాలని చాలా దేశాలు కోరుతున్నాయి. తాజాగా గాజాపై జరుగుతున్న దాడులను ఇజ్రాయిల్ ఆపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు. గాజాపై 60 రోజుల కాల్పుల విమరణకు నెతన్యాహు అంగీకరించారని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ గాజాపై 60 రోజుల కాల్పుల విరమణకు అవసరమైన షరతులను ఇజ్రాయిల్ అంగీకరించింది.
ఈ సమయంలో యుద్ధాన్ని ముగించడానికి మేము అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాము’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గాజా కాల్పుల విరమణ, ఇరాన్ విషయాలతోపాటు.. ఇతర అంశాలను చర్చించడానికి సీనియర్ పరిపాలన అధికారులతో చర్చలు జరపడానికి ఇజ్రాయిల్ వ్యూహాత్మక వ్యవహారాల మంత్రి రాన్ డెర్మెర్ మంగళవారం వాషింగ్టన్‌కు చేరుకున్నారు. డెర్మెర్ అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌లను కలిసే అవకాశం ఉంది.
కాగా, శాంతిని నెలకొల్పడానికి, గాజాపై కాల్పుల విరమణ ఒప్పందానికి ఖటారీలు, ఈజిప్షియన్లు సహాయం చేశారు. ఈ ఒప్పందానికి హమాస్ కూడా ఒప్పుకుంటుందని వారు అభిప్రాయపడ్డారు.