నవతెలంగాణ-హైదరాబాద్: టీజీపీఎస్సీకి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమ అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష లేదని, గ్రూప్ 1కు ఎంపికైన తెలుగు మీడియం అభ్యర్థులు 9.95 శాతం, ఆంగ్ల మాధ్యమం అభ్యర్థులు 89.88 శాతం, ఉర్దూ మాధ్యమంలో 0.1 శాతంగా ఉన్నారని టీజీపీఎస్సీ రాష్ట్ర హైకోర్టుకు చెప్పింది. ఏపీలో రెండేళ్ల క్రితం నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షల్లోనూ ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. . అందరికీ నిపుణులు ఎంపిక చేసిన అంశాల ఆధారంగా మార్కులు వేశారు’’అని కోర్టుకు తెలిపారు.
తెలుగు మీడియం అభ్యర్థులకు సరైన మార్కులు వేయలేదని పలువురు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదన్నారు. నామినల్ రోల్స్, అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడించినట్లు చెప్పారు.
వాదనలు విన్న ధర్మాసనం.. ఎవాల్యుయేటర్‌కు ఏమైనా మార్గదర్శకాలున్నాయా అని ప్రశ్నించింది. టీజీపీఎస్సీ నుంచి వివరాలు తీసుకొని సీల్డ్ కవర్‌లో సమర్పిస్తామని నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను ఉన్నత న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.