– టెండర్ల ద్వారా కాకుండా నేరుగా నిధులను ఇవ్వాలి :
సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మత్స్యసొసైటీలకు ఉచిత చేప/రొయ్య పిల్లలను పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెండర్ల ద్వారా కాకుండా మత్స్యసొసైటీల ద్వారా మత్స్యకారుల ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డికి శుక్రవారం ఆయన లేఖ రాశారు. 2015 నుంచి రాష్ట్రంలో మత్స్య పరిశ్రమలో మధ్య దళారీలకు తావులేకుండా మత్స్య సొసైటీలు స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. 2023 నాటికి సుమారు రూ.560 కోట్లతో ఉచిత చేప/రొయ్య పిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించిందని వివరించారు. కానీ ఈ పథకం అమల్లో జరుగుతున్న లోపాల వల్ల నిజమైన మత్స్యకారులకు లబ్ది చేకూరటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యదళారీ విధానం పోవాలనే లక్ష్యం కోసం ఏర్పడిన ఈ పథకాన్ని తిరిగి టెండర్ల ద్వారా మళ్లీ దళారీల ద్వారానే ఈ పథకం అమలు చేయడం ద్వారా దాదాపు 70 శాతం వరకు అవినీతి జరుగుతున్నట్టు తెలుస్తున్నదని తెలిపారు. బోగస్ వ్యక్తులు/సంస్థలు టెండర్లను దక్కించుకుంటున్నాయని పేర్కొన్నారు. దళారీలు టెండర్లు దక్కించుకుని మత్స్యశాఖ అధికారులు, మత్స్యసొసైటీ పాలకవర్గాలను మభ్యపెట్టి తక్కువ సంఖ్యలో తక్కువ సైజులో నాసిరకం చేప/రొయ్య పిల్లలను వదులుతున్నారని విమర్శించారు. దీంతో తక్కువ సైజులలో అవి పెరుగుతున్నాయని వివరించారు. జూన్/జులై మాసాల్లో వదలాల్సిన చేప/రొయ్య పిల్లలను సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఆలస్యంగా వదలడంతో మార్చి నెల నాటికే చెరువులు, కుంటలు ఎండిపోయి పక్షులు వాటిని తినటం వల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైందనీ, 80 శాతం జలాశయాలు చేపల పెంపకానికి అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఈ పథకంపై ఎలాంటి ప్రకటన రాలేదని పేర్కొన్నారు. బడ్జెట్‌లో నిధులను కేటాయించలేదని తెలిపారు. అందువల్ల మత్స్యసొసైటీలకు వెంటనే ఉచిత చేప/రొయ్య పిల్లల పంపిణీ పథకాన్ని ప్రకటించాలనీ, ఈ పథకాన్ని టెండర్ల ద్వారా కాకుండా నేరుగా మత్స్యసొసైటీల ఖాతాలో నగదు జమ చేసి మత్సకారులు లబ్దిపొందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మత్స్యసొ సైటీలకు ఉచిత చేపపిల్లల్ని పంపిణీ చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES