నవతెలంగాణ-హైదరాబాద్: జులై 9న ప్రతీకార సుంకాలపై డెడ్ లైన్ ముగియనుంది. ఈక్రమంలో కేంద్రమంత్రి పియూష్ గోయాల్, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మధ్య కౌంటర్ వార్ నడుస్తోంది. నిన్న ఢిల్లీలో జరిగిన ఓ వ్యాపార సమావేశంలో మాట్లాడిన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్.. ‘భారత్ ఎప్పుడూ డెడ్లైన్ల ఆధారంగా ఒప్పందాలు కుదుర్చుకోదు. రైతులు, డెయిరీ రంగ ప్రయోజనాలు కాపాడే విధంగా, పరస్పర లాభదాయకమైన ఒప్పందం అయితేనే ముందుకు సాగుతాం’ అని స్పష్టం చేశారు.
ఆయన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని మోదీ ఆ డెడ్లైన్కు ముందు కచ్చితంగా ట్రంప్ వద్ద తల వంచుతారని ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. ఇప్పటికే అనేక విషయాల్లో యూఎస్ నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని, మరోమారు అదే వైఖరిని ప్రదర్శించిబోతుందని శనివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.
ఈ టారిఫ్ వివాదం మొదలైనప్పటి నుంచి రెండు దేశాల మధ్య వివిధ అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా డెయిరీ, వ్యవసాయ రంగాల్లోకి భారత మార్కెట్ ప్రవేశానికి ఒత్తిడి తెస్తున్నప్పటికీ, భారత్ తన స్థానిక వ్యవసాయ, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాల కోసం టారిఫ్ తగ్గించడానికి నిరాకరిస్తోంది. ఇదే సమయంలో భారత్ కార్మికాధారిత రంగాలు టెక్స్ టైల్, ఆభరణాలు, లెదర్, కెమికల్స్ వంటివాటిలో అమెరికా మార్కెట్లోకి ప్రవేశానికి అవకాశం కోరుతోంది.