నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నగారా మోగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోగస్ ఓట్ల ఏరివేతలో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను వేగవంతంగా సాగేందుకు కృషిచేస్తున్న ఎన్నికల సిబ్బంది శ్రమను ఈసీ గుర్తించింది. ఈక్రమంలో ఒక్కొక్కరికి రూ. 6,000 ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ప్రకటించింది.
అయితే ఆ రాష్ట్రంలోని ఆర్జీడీతోపాటు పలు పార్టీలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రక్రియపై తమకు పలు సందేహాలు ఉన్నాయని, వాటిపై ఈసీ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్స్(ADR) శనివారం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎన్నికల సంఘం చర్య రాజ్యాంగంలోని ఆర్టీకల్ 14,19,21,352లను ఉల్లంఘిస్తున్నాయని, ఉన్నట్టుండి బీహార్ స్థానికతను ఓటర్ల అందరూ నిరూపించుకోవాలని ఈసీ జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ పేర్కొంది. ఈసీ నిర్ణయం ఏకపక్షంగా ఉందని, ఆమోదయోగ్యం కాదని, ఓటు హక్కును హరిస్తుందని, ఈ ప్రక్రియను నిలివేయాలని ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరారు.