నవతెలంగాణ-హైదరాబాద్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు, మెరిట్ లిస్ట్‌లను ICAI ఆదివారం విడుదల చేసింది. విద్యార్థులు https://icai.nic.in/ వెబ్‌సైట్‌లో తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ తదితర వివరాలను ఎంటర్ చేయడం ద్వారా స్కోరు కార్డులతో పాటు మెరిట్ కార్డులను పొందవచ్చని తెలిపింది.
సిఎ ఫౌండేషన్ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 551 కేంద్రాల్లో 82,662 మంది హాజరయ్యారు. వీరిలో కేవలం 12,472 మంది (15.09శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో వ్రిందా అగర్వాల్ (ఘజియాబాద్) జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించగా, యద్నేష్ రాజేశ్ నర్కర్ (ముంబయి), శార్దుల్ శేఖర్ విచారే (ఠాణే) రెండు, మూడు ర్యాంకులు సాధించారు.
సిఎ ఇంటర్‌లో గ్రూప్- 1 పరీక్షలకు 97,034మంది హాజరు కాగా.. కేవలం 14,232 మంది మాత్రమే (14.67శాతం) పాస్ అయ్యారు. గ్రూప్-2లో 72,069 మంది హాజరు కాగా.. 15,502 మంది (21.51శాతం మంది), రెండు గ్రూపులనూ 38,029మంది రాయగా, 5,028మంది (13.22శాతం మంది) మాత్రమే ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. సిఎ ఇంటర్ పరీక్షల్లో దిశ ఆశీష్ (ముంబయి) తొలి ర్యాంకు సాధించగా, దేవిదాన్ యశ్ సందీప్ (ఔరంగాబాద్) రెండో ర్యాంకు, యామిష్ జైన్ (జైపూర్), నిలరు డంగీ (ఉదయ్‌పూర్ ) మూడో ర్యాంకు సాధించారు.
సిఎ ఫైనల్‌లో గ్రూప్ 1 పరీక్షలకు 66,943 మంది హాజరు కాగా.. కేవలం 14,979 మంది (22.38%) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. గ్రూప్ 2 పరీక్షల్లో 46,173 మంది హాజరవ్వగా.. కేవలం 12,204మంది (26.43%) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రెండు గ్రూపుల్లో 29,286మంది పరీక్షలు రాయగా.. 5,490 మంది (18.75శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. సిఎ ఫైనల్ పరీక్షల్లో రాజన్ కబ్రా(ముంబయి) జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించగా, నిషిత బోత్రా (కోల్‌కతా), మానవ్ రాకేశ్ షా (ముంబయి) మూడో ర్యాంకు సాధించారు.