కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను వెంటనే ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు పాలనా విభాగం కోరింది. 2024 నవంబరు 10న సీజేఐగా పదవీ విరమణ పొందిన జస్టిస్ చంద్రచూడ్, గత 8 నెలలుగా టైప్-8 అధికారిక బంగ్లాలోనే ఉంటున్నారని తెలుపుతూ జులై 1న కేంద్ర హౌజింగ్, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. రిటైర్ అయ్యాక టైప్-7 ప్రభుత్వ బంగ్లాలో ఆరు నెలల పాటు అద్దె చెల్లించకుండానే ఉండొచ్చని, ఆ గ్రేస్ పీరియడ్ కూడా ఇప్పటికే గడిచిపోయిందని సుప్రీంకోర్టు పాలనా విభాగం పేర్కొంది. ప్రస్తుతం సీజేఐగా ఉన్న వారికి టైప్-8 అధికారిక బంగ్లాను కేటాయించాల్సి ఉన్నందున, దాన్ని వెంటనే ఖాళీ చేయించాలని కోరింది. టైప్-8 అధికారిక బంగ్లాలో నివసించేందుకు మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌కు ఇచ్చిన గడువు ఈ ఏడాది మే 31తోనే ముగిసిందని తెలిపింది. అధికారిక క్వార్టర్స్‌లో ఉండేందుకు మంజూరు చేసే ఆరు నెలల గ్రేస్ పీరియడ్ కూడా ఈ ఏడాది మే 10తోనే గడిచిపోయిందని సుప్రీంకోర్టు పాలనా విభాగం గుర్తుచేసింది.
2025 ఏప్రిల్ 30 వరకు అనుమతి మంజూరు
జస్టిస్ చంద్రచూడ్ భారతదేశ 50వ సీజేఐగా 2022 నవంబరు నుంచి 2024 నవంబరు వరకు సేవలు అందించారు. ఆయన అనంతరం జస్టిస్ సంజీవ్ ఖన్నా భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. అయితే ఆయన ఆరు నెలలే సీజేఐగా సేవలు అందించారు. ఆ వ్యవధిలో టైప్-8 అధికారిక బంగ్లాను కేటాయించమని జస్టిస్ సంజీవ్ ఖన్నా కోరలేదు. 2024 డిసెంబరు 18న నాటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు జస్టిస్ చంద్రచూడ్ ఒక లేఖ రాశారు. 2025 ఏప్రిల్ 30 వరకు తనను ప్రస్తుత బంగ్లాలోనే ఉండేందుకు అనుమ తించాలని కోరారు. తనకు మరో ప్రభుత్వ బంగ్లాను కేటాయించారని, అయితే అక్కడ మరమ్మతు పనులు జరుగుతున్నందున వెం టనే వెళ్లలేకపోతున్నట్టు ఆ లేఖలో జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు. ఈ లేఖకు నాటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సానుకూలంగా స్పందించారు. 2025 ఏప్రిల్ 30 వరకు ప్రస్తుత బంగ్లాలోనే ఉండేందుకు జస్టిస్ చంద్రచూడ్‌కు అనుమతి ఇవ్వాలని కేంద్ర హౌజింగ్, పట్టణ వ్యవహారాల శాఖకు సూచించారు. ఈ వ్యవధిలో ప్రతినెలా రూ.5వేలు చొప్పున లైసెన్సు ఫీజును జస్టిస్ చంద్రచూడ్ నుంచి వసూలు చేశారు. ఈవివరాలను 2025 ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టు పాలనా విభాగానికి కేంద్ర హౌజింగ్, పట్టణ వ్యవహారాల శాఖ తెలిపింది.
జస్టిస్ సంజీవ్ ఖన్నాకు మరోసారి మౌఖిక విన్నపం
తదుపరిగా నాటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు జస్టిస్ చంద్రచూడ్ ఒక మౌఖిక విన్నపం చేశారు. ప్రస్తుతం ఇండ్లను వెతుకుతున్నానని, ప్రత్యేక అవసరాలు కలిగిన తన కుమార్తెలకు అనుకూలంగా ఉండే ఇల్లు దొరకగానే అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తానన్నారు. 2025 మే 31 వరకు ప్రస్తుత బంగ్లాలోనే ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు నాటి సీజేఐ వెంటనే ఓకే చెప్పారు. అయితే ఈ వెసులుబాటును ఇంకా పొడిగించలేమని జస్టిస్ చంద్రచూడ్‌కు స్పష్టం చేశారు. కొత్త సుప్రీంకోర్టు జడ్జీలకు బంగ్లాల కొరత ఏర్పడటంతో వారికి ఢిల్లీలోని గెస్ట్ హౌజ్‌లు, ఇతరత్రా చోట్ల వసతి ఏర్పాట్లు చేయాల్సి వస్తోందన్నారు. మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఇద్దరు కుమార్తెలు ప్రత్యేక అవసరాలు కలిగిన వారని, వారికి ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స జరుగుతోందని తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఎయిమ్స్‌కు సమీపంలో ఉండే క్రిష్ణ మీనన్ మార్గ్‌లో ఉన్న అధికారిక బంగ్లాలోనే కొన్నాళ్లు ఉండేందుకు ఆయన పదేపదే విన్నపాలు చేశారని సమాచారం. జూన్ 30 వరకు అధికారిక బంగ్లాలోనే ఉండేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నుంచి జస్టిస్ చంద్రచూడ్ మౌఖిక అనుమతిని తీసుకున్నారని పలువురు అంటున్నారు. ఇక ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ బీఆర్ గవారు ఇంకా తన పాత బంగ్లాలోనే నివసిస్తున్నారు.
‘రూల్ 3బీ’ ఏం చెబుతోంది ?
సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ‘రూల్ 3బీ’ ప్రకారం పదవీ విరమణ పొందిన సీజేఐకు అద్దె లేకుండానే టైప్-7కు చెందిన ప్రభుత్వ బంగ్లాను ఢిల్లీలో కేటాయిస్తారు. మాజీ సీజేఐ పదవీ విరమణ తేదీ నుంచి ఆరు నెలల పాటు ఇందులో ఉండొచ్చు. దీన్ని గ్రేస్ పీరియడ్‌గా పరిగణిస్తారు. జస్టిస్ చంద్రచూడ్ విషయంలో ఈ ఆరు నెలల గ్రేస్ పీరియడ్ అనేది 2025 మే 10నే ముగిసిందని తాజాగా కేంద్ర సర్కారుకు రాసిన లేఖలో సుప్రీంకోర్టు పాలనా విభాగం పేర్కొంది. ఆయన ప్రత్యేకంగా పొందిన అనుమతుల గడువు కూడా 2025 మే 31తోనే ముగిసిందని తెలిపింది.