నవతెలంగాణ-జుక్కల్: మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో పి.మారుతి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదని తెలియజేశారు. ప్రజావాణి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే అన్ని శాఖల మండలంలోని వివిద స్థాయిలోని అధికారులు తప్పకుండా ప్రజావాణి కార్యక్రమంలో బాధ్యతగా పాల్గొనాలని సూచించారు. నేటి ప్రజావాణి కార్యక్రమానికి డిటి హేమలత, ఆర్ఐ రామ్ పటేల్ , మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి, జుక్కల్ మండల్ పరిషత్ సీనియర్ అసిస్టెంట్, ఐకేపీ ఎపీఎమ్ సత్యనారాయణ పాల్గొన్నారు.
మరోవైపు కొన్ని వారాలుగా ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖలు అధికారులు గైరాజరవుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇతర ముఖ్యమైన మండల స్థాయి శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనక పోవడంతో.. దరఖాస్తులు ఇచ్చి ఏమి లాభమని, సమస్యలు పరిష్కరించే సమస్యల పరిష్కారం ఎలా చేస్తారని దరఖాస్తుదారులుఅధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి రాని అధికారులపై జిల్లా కలెక్టర్ స్పందించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.