నవతెలంగాణ-హైదరాబాద్: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సోమవారం తెల్లవారుజామున భీకరదాడులు చేసింది. రెబల్స్ ఆధీనంలో ఉన్న ఓడరేవులు, వారి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఎర్ర సముద్రం కారిడార్‌లో 2023, నవంబర్‌లో వాహన రవాణా నౌక గెలాక్సీ లీడర్‌ను హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. హైజాక్ చేసి తమకు అనుకూలంగా మలుచుకున్నారు. అంతేకాకుండా పెద్ద విజయంగా కూడా పేర్కొన్నారు. తాజాగా గెలాక్సీ లీడర్‌ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసేసింది.
హౌతీల ఆధీనంలో ఉన్న హోదీడా, రాస్ ఇసా, సలీఫ్‌లోని హౌతీల ఆధీనంలో ఉన్న ఓడరేవులతో పాటు రాస్ కనాటిబ్ విద్యుత్ ప్లాంట్‌పై కూడా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ ఓడరేవులను హౌతీ ఉగ్రవాదులు.. ఇరాన్ నుంచి ఆయుధాలను సరఫరా చేసుకోవడానికి ఉపయోగిస్తోంది. ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలపై ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు రైబల్స్ ఉపయోగిస్తున్నట్లుగా ఐడీఎఫ్ తెలిపింది.
గెలాక్సీ లీడర్ నౌక ఇజ్రాయెల్ చెందినదిగా హౌతీ రెబల్స్ భావించి హైజాక్ చేశారు. రెండేళ్ల నుంచి రెబల్స్ ఆధీనంలోనే ఉంటుంది. ఈ నౌకను ఆధారంగా చేసుకుని ఉగ్రవాదులు.. ఇతర ఓడలపై దాడులు చేస్తున్నారు. దీనిపై రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎర్రసముద్రం పైనుంచి వెళ్తున్న నౌకలను ట్రాక్ చేసి దాడులు చేయడం మొదలు పెట్టారు. అయితే ఉగ్రవాదులకు అస్త్రంగా మారిన గెలాక్సీ లీడర్ నౌకను తాజాగా ఇజ్రాయెల్ పేల్చేసింది. దాడులు ప్రారంభం కాగానే అందులోంచి తిరుగుబాటుదారులు పారిపోయినట్లు సమాచారం. ఇక ఇజ్రాయెల్‌పై కూడా హౌతీ రెబల్స్ క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తోంది.