Tuesday, July 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంజల ప్రళయం.. 100 దాటిన మృతుల సంఖ్య

జల ప్రళయం.. 100 దాటిన మృతుల సంఖ్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య 100 దాటినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా చాలా మంది గల్లంతైన నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ దుర్ఘటనలో కెర్ కౌంటీలోని బాలికల వేసవి శిబిరంలో చోటుచేసుకున్న విషాదం అందరినీ కలచివేస్తోంది. ‘క్యాంప్ మిస్టిక్’ అనే ఈ శిబిరంలో బస చేస్తున్న 27 మంది బాలికలు, సిబ్బంది వరద ఉధృతికి బలయ్యారు. మరో 10 మంది అమ్మాయిలు, ఒక క్యాంప్ కౌన్సిలర్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గ్వాడలుపే నది ఆకస్మికంగా ఉప్పొంగడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాద సమయంలో చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించి, క్యాంప్ డైరెక్టర్ రిచర్డ్ ఈస్ట్‌లాండ్ (70) కూడా ప్రాణాలు అర్పించారు. ఆయనో హీరోలా మరణించారని స్థానికులు కొనియాడారు. సహాయక బృందాలు బురదలో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.

మరోవైపు ఈ విపత్తుపై రాజకీయ దుమారం రేగింది. జాతీయ వాతావరణ శాఖ (NWS)లో ట్రంప్ ప్రభుత్వం ఉద్యోగాల కోత విధించడం వల్లే ముందస్తు హెచ్చరికల వ్యవస్థ విఫలమైందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా దైవిక ఘటన అని, దీనికి ప్రభుత్వ వైఫల్యాన్ని ఆపాదించడం సరికాదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ స్పష్టం చేశారు.

వాతావరణ శాఖ సరైన సమయంలోనే హెచ్చరికలు జారీ చేసిందని ఆమె తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని వందేళ్లలో చూడని విపత్తుగా అభివర్ణించారు. ఇది పరస్పరం రాజకీయ ఆరోపణలు చేసుకునే సమయం కాదని సెనేటర్ టెడ్ క్రజ్ హితవు పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -