ఆంక్షల ఒత్తిడితో ఆర్థిక సవాళ్లు
ఆహార రవాణాకూ జరిమానా
సహాయానికి ఎన్‌సీఎస్‌సీ పిలుపు
న్యూఢిల్లీ : కోవిడ్‌లాంటి కష్టకాలంలో తమ దేశంలోని వైద్యులను ప్రపంచ నలుమూలలకూ పంపించి, వైద్యసేవలందిం చిన క్యూబా అమెరికా ఆంక్షలతో తీవ్రంగా నష్టపోతోంది. ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్న ఆ దేశానికి సంఘీభావంగా, మద్దతుగా భారతీయులు సహాయమందించాలని నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా (ఎన్‌సీఎస్‌సీ) సంస్థ విజ్ఞప్తి చేసింది. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆహారం, ఔషధాలు , ఇంధనం, రవాణా వంటి ప్రాథమిక అవసరాల కొరతతోపాటు విద్య, వైద్యం, గృహనిర్మాణం వంటి రంగాలు నష్టపోయాయి. క్యూబాతో వాణిజ్యం చేయాల నుకునే కంపెనీలు, దేశాలపై ఒత్తిడితెచ్చి అస్థిరపరిచే విధంగా అమెరికా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఎల్‌ఎల్‌సి అనే లాజిస్టిక్స్ కంపెనీ క్యూబాకు ఆహార పదార్థాలతోపాటు చిన్నపాటి యంత్రాలు, ఎలక్ట్రిక్ వస్తువులను రవాణా చేసినందుకు 6 లక్షల డాలర్ల జరిమానా అమెరికా విధించడం దుర్మార్గం.
క్యూబాకు సంఘీభావం, మద్దతు
ఇటీవల దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో దీర్ఘకాలిక అంతరాయం ఏర్పడింది. ప్రపంచానికి తమ ఔషధాలతో సహాయం చేసిన క్యూబా, ఇప్పుడు ఔషధ ఉత్పత్తికి కావాల్సిన ముడిసరుకు కొరతను ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధనం, ముడిసరుకు లభ్యత లేకుండా పోయింది. మరోవైపు క్యూబాను టెర్రరిజం స్పాన్సర్ చేస్తున్న దేశాల జాబితాలో అమెరికా అన్యాయంగా చేర్చింది. ఈ దుర్మార్గాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఖండించాయి. అయినా అమెరికా నిర్బంధాన్ని కొనసాగించడం దుర్మార్గమని పలువురు విమర్శిస్తున్నారు. ఆత్మగౌరవం, స్వేచ్ఛ కోసం ఆత్మవిశ్వాసంతో పోరాడుతున్న సార్వభౌమాధికారం కలిగిన క్యూబాను బలపరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. క్యూబా భవిష్యత్తు కోసం ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ”నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా ” సంస్థ దాతలను ప్రకటనలో కోరింది. క్యూబా కోసం విరాళాల సేకరణకు భారతీయ కార్మిక సంఘాలు, రైతు, లాయర్, మహిళా, యువజన, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి.
ఇతర దేశాలకు కోవిడ్ వైద్య సహాయం
1962 నుంచి అమెరికా విధించిన ఆర్ధిక ఆంక్షలను క్యూబా ఎదుర్కొంటోంది. ఈ ఆంక్షలు క్యూబాను ఆర్థికంగా ఒత్తిడికి లోనయ్యేలా చేస్తున్నాయి. వీటివల్ల ఆ దేశ ప్రజలకు రూ.1,29,69,717.04 కోట్ల నష్టం వాటిల్లింది, ఉత్పాదక అడ్డంకులు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ, క్యూబా తన ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాలలో అవకాశాలను అందిస్తోంది. అంతేకాక ప్రకృతి విపత్తులు ఎదుర్కొన్న దేశాలకు క్యూబా తన వైద్యులను, నర్సులను పంపింది. కోవిడ్ సమయంలో చాలా పెద్ద దేశాలు టీకాలు, వైద్య సామగ్రి పంపడానికి నిరాకరించగా, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సహా 50కిపైగా దేశాలకు వైద్యులను పంపింది. 90 శాతానికి పైగా సామర్థ్యం ఉన్న తమ టీకాలను అవసరమైన దేశాలతో పంచుకుంది. తద్వారా క్యూబా నిజమైన అంతర్జాతీయత, మానవత్వం, స్నేహం, సంఘీభావం చాటుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.