నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నెలసరి (రుతుస్రావం)ని నిర్ధారించుకునేందుకు బాలికల దుస్తులు విప్పించి తనిఖీ చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ దారుణమైన చర్యకు పాల్పడిన స్కూల్ ప్రిన్సిపాల్, ప్యూన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
షాహాపూర్‌లోని ఒక పాఠశాల వాష్‌రూమ్‌లో రక్తపు మరకలు కనిపించాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ 5 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులను పాఠశాల హాలుకు పిలిపించారు. వాష్‌రూమ్ ఫ్లోర్‌పై ఉన్న రక్తపు మరకల చిత్రాలను వారికి చూపించి, నెలసరిలో ఉన్నవారు, లేనివారు వేర్వేరు గ్రూపులుగా విడిపోవాలని ఆదేశించారు.
అనంతరం నెలసరిలో లేమని చెప్పిన 10 నుంచి 12 ఏళ్ల బాలికలను ఓ మహిళా ప్యూన్ తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆ ప్యూన్ విద్యార్థినుల లోదుస్తులను తాకుతూ తనిఖీ చేసింది. ఈ క్రమంలో, నెలసరిలో లేని వారి గ్రూపులో ఉన్న ఒక బాలిక శానిటరీ న్యాప్‌కిన్ వాడినట్టు గుర్తించారు. దీంతో ఆ విద్యార్థినిని అందరి ముందు ప్రిన్సిపాల్ తీవ్రంగా మందలించి అవమానించారు.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నిన్న పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపి, షాహాపూర్ పోలీస్ స్టేషన్‌లో స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్, ప్యూన్, ఇద్దరు టీచర్లు, ఇద్దరు ట్రస్టీలు సహా మొత్తం ఆరుగురిపై లైంగిక నేరాల నుంచి పిల్లల పరిరక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు.
“ఈ కేసులో ప్రిన్సిపాల్, ఒక ప్యూన్‌ను అరెస్టు చేశాం. మిగిలిన నలుగురిపై విచారణ కొనసాగుతోంది” అని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.