Friday, July 11, 2025
E-PAPER
Homeకరీంనగర్సిరిసిల్ల హైస్కూల్‌లో ఐఐటీ మద్రాస్‌ కోర్సులు

సిరిసిల్ల హైస్కూల్‌లో ఐఐటీ మద్రాస్‌ కోర్సులు

- Advertisement -

– స్కూల్‌ కనెక్ట్‌ ప్రొగ్రామ్‌లో దక్కిన అరుదైన అవకాశం
– ప్రభుత్వ విద్యార్థుల భవిష్యత్‌కు టెక్నాలజీ తలుపులు
– డేటా సైన్స్‌ నుంచి ఏఐ వరకు..
స్కూల్‌ స్థాయిలోనే ఐఐటీ స్థాయి శిక్షణ
– ఆగస్టు నుంచి ఆన్లైన్‌ కోర్సులతో కొత్త అధ్యాయం
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యా రంగంలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు దేశంలోని అగ్రశ్రేణి సాంకేతిక విద్యాసంస్థ ‘ఐఐటీ మద్రాస్‌’ నుంచి ప్రత్యక్షంగా శిక్షణ అవకాశాలు లభించనున్నాయి. ”స్కూల్‌ కనెక్ట్‌” పేరుతో ప్రారంభమైన ఈ భాగస్వామ్య కార్యక్రమం ద్వారా విద్యార్థులు చిన్న వయస్సులోనే ‘డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బయోలాజికల్‌ ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌, లా, హ్యూమానిటీస్‌’ వంటి విభిన్న రంగాలలో ప్రాథమిక అవగాహనను సంపాదించనున్నారు. ఇది వారు ఉన్నత విద్యలో అడుగు పెట్టే ముందు విజ్ఞానానికి బలమైన పునాది వేయనుంది.విద్యార్థుల విజన్‌ను విస్తరించేలా, ఉన్నత విద్యపై అవగాహన పెంచేలా, భవిష్యత్‌కు మార్గదర్శకంగా ఈ ప్రోగ్రాం నిలవనుంది.

ఐఐటీ మద్రాస్‌ ‘సెంటర్‌ ఫర్‌ ఔట్రీచ్‌ అండ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ (సీఓడీఈ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్కూల్‌ కనెక్ట్‌ ప్రోగ్రామ్‌’ ద్వారా సిరిసిల్ల ప్రభుత్వ హైస్కూల్‌కు ఎంపిక లభించింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలు కూడా ఎంపికయ్యాయి. స్కూల్‌ స్థాయిలోనే విద్యార్థుల్లో అన్వేషణా దక్పథం, టెక్నాలజీపై మక్కువ, వాస్తవిక పరిజ్ఞానం పెంచడం. క్లాస్‌రూమ్‌లో నేర్పే పాఠాలకు పక్కాగా, సమకాలీన సాంకేతిక రంగాలపై అవగాహన కల్పించడం వంటి అంశాలతో కూడిన కొత్త ఆలోచనలకు విద్యార్థుల్లో బీజం వేసే కార్యక్రమంగా నిలవనుంది.

ఐఐటీ శిక్షణా కోర్సుల వివరాలివే..!
ఈ భాగస్వామ్య కింద సుమారు పది ప్రత్యేక కోర్సులు అందించనున్నారు. ఇవి ఆగస్టు నెలలో ప్రారంభమై రెండు నెలల పాటు సాగనున్నాయి. విద్యార్థులు ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్ల రికార్డెడ్‌ లెక్చర్లను ప్రతి సోమవారం వీక్షించగలుగుతారు. అంతేకాదు, ప్రతి శనివారం లైవ్‌ సెషన్‌ ద్వారా విద్యార్థులు నేరుగా ఐఐటీ టీచర్లతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. సందేహాల నివత్తి, టెక్నికల్‌ గైడెన్స్‌ కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు అందించే కోర్సుల్లో డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఏరోస్పేస్‌, ఆర్కిటెక్చర్‌ అండ్‌ డిజైన్‌, ఇంజినీరింగ్‌ బయోలాజికల్‌ సిస్టమ్స్‌, మ్యాథ్స్‌ అన్‌ప్లగ్‌డ్‌: గేమ్స్‌ అండ్‌ పజిల్స్‌, పర్యావరణం, ఫన్‌ విత్‌ మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, లా, ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌, హ్యుమానిటీస్‌ ఉన్నాయి. ఈ కోర్సులకు నామమాత్రపు రుసుము వసూలు చేయనున్న ఐఐటీ మద్రాస్‌, కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్‌ను కూడా జారీ చేయనుంది.

విద్యార్థులకు కలిగే ప్రయోజనాలివే..!
ప్రధానంగా దేశస్థాయి ప్రొఫెసర్ల బోధనను నేరుగా అనుభవించగలుగుతారు. విద్యార్థుల ఆలోచనా దిశను విస్తత పరచనుంది. ఉన్నత విద్య అవకాశాలపై అవగాహన పెరుగుతుంది. కెరీర్‌ ఎంపికలపై స్పష్టత ఏర్పడుతుంది. నూతన రంగాలలో నైపుణ్యం పెంచుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాధారణంగా దక్కని టెక్నాలజీ విద్యను అనుభవించగలుగుతారు.

ఐఐటీ మద్రాస్‌తో భాగస్వామ్యం ఎంతో గర్వకారణం: చకినాల శ్రీనివాస్‌, హెచ్‌ఎమ్‌, సిరిసిల్ల ప్రభుత్వ హైస్కూల్‌
‘ఐఐటీ మద్రాస్‌ తో భాగస్వామ్యం కావడం ఎంతో గర్వకారణం. మా విద్యార్థులకు ఇది అరుదైన అవకాశం. స్కూల్‌ స్థాయిలోనే అంతటా గుర్తింపు పొందిన శాస్త్రవేత్తల బోధన లభించడం అంటే అది వాళ్ల భవిష్యత్తును వెలుగుల బాటలో నడిపించడమే.’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -