– పాతవే కొనసాగించాలన్న ప్రభుత్వం
– హైకోర్టును ఆశ్రయించిన కొన్ని కాలేజీ యాజమాన్యాలు
– సీబీఐటీ రూ.2.23 లక్షలు, ఎంజీఐటీ రూ.2 లక్షలు ఫీజు
– వసూలు చేసుకునేందుకు కోర్టు అనుమతి
– కౌంటర్ దాఖలు చేసే పనిలో విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజుల పంచాయితీ మొదలైంది. పాత ఫీజులనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని సవాల్ చేస్తూ రెండు కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) ఖరారు చేసిన ఫీజులను నిర్ణయించాలని కోరాయి. ఆ ఫీజులను వసూలు చేసుకోవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఆ రెండు కాలేజీల్లో ఫీజులు పెరగనున్నాయి. రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సులకు పాత ఫీజులే అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా గతనెల 30న ఉత్తర్వులు (జీవోనెంబర్ 26) జారీ చేశారు. 2022-25 బ్లాక్ పీరియెడ్‌లో ఉన్న ఫీజులే ప్రస్తుత విద్యాసంవత్సరం (2025-26)కు వర్తిస్తాయని వివరించారు.
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ), మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ) యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయిం చాయి. టీఏఎఫ్‌ఆర్సీ ఖరారు చేసినట్టు గా సీబీఐటీకి రూ.2.23 లక్షలు, ఎంజీఐటీకి రూ.రెండు లక్షలు వసూలు చేసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వా న్ని ఆదేశించింది. అయితే గత విద్యాసంవత్సరం వరకు సీబీఐటీ ఫీజు రూ.1.65 లక్షలు, ఎంజీఐటీ ఫీజు రూ.1.60 లక్షలు ఉన్నది. దీంతో టీఏఎఫ్‌ఆర్సీ, సాంకేతిక విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారు లు కౌంట ర్ దాఖలుకు సంబంధించిన అంశంపై సమాలోచన చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని, అందుకు సంబంధించిన ఉత్తర్వులను కోర్టుకు సమ ర్పించే అవకాశమున్నది. పాత ఫీజులను కొనసాగిం చడానికి గల కారణాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే సీబీఐటీ, ఎంజీఐటీతోపాటు మరో 11 కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచిచూడాల్సిందే.
విద్యార్థుల్లో ఆందోళన
ప్రస్తుతం ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఎప్‌సెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. వెబ్‌ఆప్షన్ల నమోదు గడువు కూడా గురువారంతో ముగిసింది. సుమారు 90 వేల మందికిపైగా అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారు. పాత ఫీజులు కాకుండా సీబీఐటీకి రూ.2.23 లక్షలు, ఎంజీఐటీకి రూ.రెండు లక్షలు వసూ లు చేసుకోవాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పాత ఫీజులనే చెల్లిస్తుంది. పెరిగిన ఫీజు ఎవరు చెల్లించాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. రాష్ట్రంలో ఎప్‌సెట్‌లో పది వేలలోపు ర్యాంకుతోపాటు ఎస్సీ,ఎస్టీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదివిన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్య ం ఉన్నది. ఆ ఫీజులను ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వ నిర్ణయం కాకుండా హైకోర్టు ఆదేశాలతో ఫీజు పెరగడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. సీబీఐటీ, ఎంజీఐటీలో ప్రవేశాలు వస్తే ఏం చేయాలన్న దానిపై ఇబ్బందికి గురవుతున్నారు. ఇంకోవైపు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.