Friday, July 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఆల్బనేస్‌పై అమెరికా ఆంక్షలు

ఆల్బనేస్‌పై అమెరికా ఆంక్షలు

- Advertisement -

– యూఎస్‌లో ప్రవేశానికి నో
– ఆర్థిక లావాదేవీలు నిలుపుదల
– ఇజ్రాయిల్‌ దాష్టీకాలను ప్రపంచానికి వెల్లడించిన ఫలితం
వాషింగ్టన్‌ డీసీ :
గాజా యుద్ధంలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దాష్టీకాలు అందరికీ తెలిసినవే. వీటిని కళ్లకు కట్టినట్లు ప్రపంచానికి వివరించిన ఐక్యరాజ్యసమితి(యూఎన్‌ఓ) ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సెస్కా ఆల్బనేస్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆంక్షలు విధించారు. ఆల్బనేస్‌ యూఎస్‌లోకి ప్రవేశించకుండా ఆమెపై వీసా షరతులు పెట్టారు. ఆర్థిక ఆంక్షల్లో భాగంగా యూఎస్‌లో ఆమె ఆస్తులను ఫ్రీజ్‌ చేయాలని ఆదేశించారు. ఆమె బ్యాంకు ఖాతాల పైనా ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై డోనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. అయితే వీటన్నింటిని ఆల్బనేస్‌ తేలిగ్గా తీసుకున్నారు. అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలపై ఆల్బనేస్‌ రాజకీయ, ఆర్థిక యుద్ధ ప్రచారం జరుపుతున్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆరోపించారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగానికి సంబంధించి ఆల్బనేస్‌ ఐరాస ప్రత్యేక పాత్రికేయురాలిగా పనిచేస్తున్నారు. పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని, దీనికి వెంటనే అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేస్తున్న వారిలో ఆమె కూడా ఒకరు.
ఆంక్షలను తేలికగా తీసుకున్న ఆల్బనేస్‌
ఆల్బనేస్‌పై ఎప్పటి నుంచో ఆగ్రహంతో ఉన్న ఇజ్రాయిల్‌, దాని మద్దతుదారులు ఆమెను ఐరాస బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతున్నారు. కాగా తనపై అమెరికా విధించిన ఆంక్షలను ఆల్బనేస్‌ తేలికగా తీసుకున్నారు. తన పనిపై దృష్టి సారిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ‘మాఫియా తరహాలో భయపెట్టే ఎత్తుగడలపై వ్యాఖ్యానించేదేమీ లేదు. మారణహోమాన్ని ఆపాలని, బాధ్యులను శిక్షించాలని సభ్య దేశాలను కోరే పనిలో బిజీగా ఉన్నాను. వారికి కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాను. ఇజ్రాయిల్‌ మారణహోమంతో లబ్ది పొందే వారిని కూడా శిక్షించాలని కోరుతున్నాను’ అని తెలిపారు. గాజాలో యుద్ధ నేరాల ఆరోపణలపై ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ)లో విచారణను ఎదుర్కొంటున్న ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూ పర్యటనకు తమ గగనతలాలను ఉపయోగించుకునేందుకు అనుమతించిన యూరోపియన్‌ ప్రభుత్వాలపై ఆల్బనేస్‌ విమర్శలు సంధించారు. ‘అంతర్జాతీయ న్యాయ క్రమాన్ని ఉల్లంఘించే ప్రతీ రాజకీయ చర్య తమను బలహీనపరుస్తుందని, ప్రమాదంలో పడేస్తుందని ఇటలీ, ఫ్రాన్స్‌, గ్రీక్‌ పౌరులు తెలుసుకోవాల్సి ఉంటుంది’ అని ఆమె సామాజిక మాధ్యమ వేదికలో పోస్ట్‌ చేశారు. ఐసీసీలో ఇజ్రాయిల్‌ అధికారులను విచారించాలని ఆల్బనేస్‌ కోరుతున్నారని, ఆమెపై ఆంక్షలు విధించడానికి ఇదే ప్రాతిపదిక అని రుబియో తెలిపారు. ఆల్బనేస్‌ యూదు సంస్కృతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏ విధమైన చట్టబద్ధమైన ప్రాతిపదిక లేకుండా ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ, రక్షణ శాఖ మాజీ మంత్రి గల్లంట్‌లకు ఐసీసీ అరెస్ట్‌ వారంట్లు జారీ చేయాలని ఆల్బనేస్‌ సిఫారసు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గాజాపై ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడులలో అమెరికా సంస్థలు సహా అంతర్జాతీయ కంపెనీల పాత్ర ఉన్నదని ఆల్బనేస్‌ ఇటీవల తన నివేదికలో వివరించారు. ఇలాంటి ప్రచారాన్ని తాము సహించబోమనీ, అది తమ దేశ ప్రయోజనాలు, సార్వభౌమత్వానికి ముప్పు కలిగిస్తుందని అమెరికా దౌత్యవేత్త ఒకరు ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -