నవతెలంగాణ-సుల్తాన్ బజార్: సమాజంలో శాంతి, సమైక్యతతో పాటు మానవీయ విలువల స్థాపన, సామాజిక పురోగతికి ప్రతీ పౌరుడు పాటుపడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హిందీ విభాగం ఆధ్వర్యంలో ‘సాధు చైతన్యం- మానవతావాదం- ఆధ్యాత్మిక సామాజిక పునాది’ అంశంపై రెండు రోజుల జాతీయ హిందీ సదస్సు నిర్వహించారు. కళాశాల విద్యా శాఖ సంయుక్త సంచాలకులు ప్రొఫెసర్ డి.ఎస్.ఆర్. రాజేంద్రసింగ్, గౌరవ అతిథులుగా కేంద్ర హిందీ డైరెక్టరేట్ (న్యూదిల్లీ) అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ నసీం, విశిష్ట అతిథులుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ కార్యాలయ విభాగాధిపతి డి. కె. భన్వర్లాల్ హాజరై సదస్సును ప్రారంభించారు.
కళాశాల ప్రిన్సిపల్, హిందీ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రముఖర్జీ మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో ప్రజలు విభేదాలు మరిచిపోయి భక్తి ఉద్యమ బోధనలు అలవర్చుకోవాలని సూచించారు. డా. మహమ్మద్ నసీం మాట్లాడుతూ హిందీ ఆచార్యులు జాతీయ భాష హిందీ అభివృద్ధికి సెమినార్లు నిర్వహించాలని ఆకాంక్షించారు. సెమినార్లో వివిధ అంశాలపై 60 పరిశోధన పత్రాలను సమర్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సదస్సు కన్వీనర్, కళాశాల హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ భాగ్యవతి, కో-కన్వీనర్ డాక్టర్ మంజు, మీడియా ఇన్ఛార్జి పావని తదితరులు పాల్గొన్నారు.