నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల 8 రోజుల పాటు ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు మోడీపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ప్రధాని పర్యటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఘనా అని ఎక్కడికో వెళ్లారు.. ఆయన ఏయే దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలంటూ విమర్శించారు. అలాగే, 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఉండకుడా.. 10 వేల మంది జనాభా ఉన్న దేశాలను మాత్రం సందర్శిస్తున్నారని ఆరోపించారు. అక్కడ ఆయనకు అత్యున్నత అవార్డులు కూడా అందుతున్నాయని మాన్ పేర్కొన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై విదేశాంగశాఖ మండిపడింది. ప్రధాని విదేశీ పర్యటనలపై రాష్ట్రంలోని ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని మాన్ పేరును ప్రస్తావించకుండా పేర్కొంది. అవి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని తెలిపింది. ఈ వ్యాఖ్యలు వారి స్థాయిని తగ్గించేవని మండిపడింది. భారత్‌తో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలను తక్కువ చేసి మాట్లాడటం సబబు కాదని పేర్కొంది.