Friday, July 11, 2025
E-PAPER
Homeజాతీయంహ‌ర్యానాలో టెన్నిస్ ప్లేయ‌ర్ దారుణ హ‌త్య‌

హ‌ర్యానాలో టెన్నిస్ ప్లేయ‌ర్ దారుణ హ‌త్య‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: హర్యానాలోని గురుగ్రామ్‌లో టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ (25) హత్యకు గురైంది. సొంత కన్నతండ్రి దీపక్ యాదవ్ చేతిలోనే అత్యంత దారుణంగా చంపబడింది. కని పెంచి పెద్ద చేసిన చేతులతోనే బిడ్డ ప్రాణాలు తీశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అంతగా తండ్రి చంపడానికి గల కారణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిందితుడు దీపక్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

రాధిక యాదవ్ రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధ టెన్నిస్ క్రీడాకారిణి. పలు టోర్నమెంట్స్‌లో మెడల్స్ సాధించి కుటుంబానికి, ఆ ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టింది. అయితే గురువారం ఉదయం వంట గదిలో రాధిక అల్పాహారం సిద్ధం చేస్తుండగా వెనుక నుంచి లైసెన్స్ తుపాకీతో తండ్రి దీపక్ యాదవ్ ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. మూడు బుల్లెట్లు లోపలికి దూసుకెళ్లడంతో ప్రాణాలు వదిలింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ హత్యకు ఏడాది క్రితమే బీజం పడినట్లుగా తెలుస్తోంది. ఏడాది క్రితం రాధిక ఒక మ్యూజిక్ వీడియో చేసింది. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనంతరం బంధువుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాకుండా సొంతూరుకి వెళ్లినప్పుడల్లా.. కూతురు ఆదాయంతో బతుకుతున్నావని హేళన చేయడం రుచించలేదు. దీనిపై చాలా రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అలాగే మ్యూజిక్ వీడియోపై కూడా రభస నడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడంతో ఆమె ఆర్థికంగా బలపడింది. ఆమె ఎవరినీ లెక్క చేయకుండా స్వేచ్ఛగా విహరిస్తోంది. ఈ వ్యవహారం తండ్రిని ఎంతగానో బాధపెట్టింది. దీంతో కుమార్తెను చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో వంటగదిలో రాధిక టిఫిన్ రెడీ చేస్తుండగా తండ్రి వెనుక నుంచి ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. విచారణంలో కుమార్తెను తానే చంపినట్లుగా దీపక్ యాదవ్ (49) అంగీకరించాడు.

పోలీసుల కథనం ప్రకారం.. కుమార్తె సంపాదనపై ఆధారపడి జీవించినందుకు స్వస్థలమైన వజీరాబాద్‌లోని గ్రామస్తులు పదే పదే ఎగతాళి చేశారని, ఆమె నడిపే టెన్నిస్ అకాడమీని మూసివేయాలని ఆమెను చాలాసార్లు కోరానని.. అందుకు అంగీకరించకపోవడంతో చంపేసినట్లుగా అధికారులకు దీపక్ చెప్పాడు.

కాల్పుల శబ్దం విని వెంటనే ఆమె మామ కుల్దీప్ యాదవ్ రూమ్‌లోకి వచ్చేటప్పటికీ విగతజీవిగా పడి ఉన్న రాధికను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే రాధిక కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నారు. కానీ ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. పోలీసుల విచారణలో ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -