Wednesday, April 30, 2025
Homeజాతీయంభారతీయ ఖడ్గమృగానికి రెండు కొమ్ములట !

భారతీయ ఖడ్గమృగానికి రెండు కొమ్ములట !

– తప్పుల తడకలుగా ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకం
– వేట, వరదల కారణంగా అంతరించిపోతున్నాయంటూ కట్టుకథలు
– ప్పికొడుతున్న నిపుణులు

న్యూఢిల్లీ : ఎన్సీఈఆర్టీ తప్పులో కాలేసింది. నాలుగో తరగతి గణిత పాఠ్య పుస్తకంలో భారత ఖడ్గమృగాల ఫొటోలను తప్పుగా ముద్రించింది. మన దేశంలో ఖడ్గమృగానికి ఒకే కొమ్ము ఉంటుంది. కానీ పుస్తకంలో రెండు కొమ్ములు ఉన్న ఖడ్గమృగం ఫొటోను చూపించారు. అంతేకాదు…ఈ పుస్తకంలో అనేక ఇతర తప్పులు కూడా కన్పించాయని, అవి వేటను ప్రోత్సహించేలా ఉన్నాయని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీఈఆర్టీ రూపొందించిన చరిత్ర పుస్తకాలపై ఇప్పటికే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తాజాగా నాలుగో తరగతి గణిత పుస్తకం కూడా వివాదానికి కారణమైంది. పాఠ్య పుస్తకంలో ఖడ్గమృగాలపై ఇచ్చిన చిన్న బాక్సులో కూడా తప్పులు దొర్లాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రయత్నం మంచిదే కానీ…
ఖడ్గమృగాల వేటపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. వీటి రక్షణకు తీసుకుంటున్న చర్యల కారణంగా అస్సాంలోని కజిరంగాలో ఖడ్గమృగాల సంఖ్య పెరిగింది. ఎన్సీఈఆర్టీ పుస్తకంలో ఖడ్గమృగానికి రెండు కొమ్ములు ఉంటాయని చూపించారని, ఇలాంటి తప్పులు ఆమోదయోగ్యం కావని అనేక మంది సామాజిక మాధ్యమాలలో విమర్శించారు. విద్యార్థులకు అనేక విషయాలలో పరిజ్ఞానం కలిగించాలని ఎన్సీఈఆర్టీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే గణిత పాఠ్య పుస్తకంలో ఖడ్గమృగాల ప్రస్తావన తీసుకొచ్చారు. ‘మన చుట్టూ ఉన్న వేలు’ అనే అధ్యాయంలో…కర్నాటకలో 14వ శతాబ్దంలో నిర్మించిన వెయ్యి స్తంభాల ఆలయం గురించి వివరించారు. ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశంలో వెయ్యి పండుగలు జరుపుకుంటారని తెలిపారు. మన దేశంలో ప్రస్తుతం ఖడ్గమృగాల సంఖ్య నాలుగు వేలకు పైగా ఉన్నందున వాటిని కూడా ఈ అధ్యాయంలో చేర్చారు. ప్రయత్నం మంచిదే అయినప్పటికీ అందులో అనేక తప్పులు చోటుచేసుకోవడం మాత్రం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు.
ఇది నిర్లక్ష్యంతో కూడిన తప్పిదం
ఎన్సీఈఆర్టీ పుస్తకంలో ఇలా ఉంది….భారతీయ ఖడ్గమృగం హిమాలయ పర్వత ప్రాంతాలలో కన్పిస్తుంది. కొమ్ములలో ఔషధ విలువలు, వరదల కారణంగా వాటి సంఖ్య తగ్గిపోయింది. 1900 ప్రాంతంలో వాటి సంఖ్య రెండు వేలకు తగ్గి అంతరించి పోయే స్థితికి చేరింది. ఇటీవల చేపట్టిన పరిరక్షణ చర్యల కారణంగా ఇప్పుడు వాటి సంఖ్య 4,000కు పెరిగింది….కాగా భారతీయ ఖడ్గమృగానికి రెండు కొమ్ములు ఉన్నట్లు చూపడాన్ని నిర్లక్ష్యంతో కూడిన తప్పిదంగా చెప్పవచ్చునని, ప్రచురణకు ముందు సంపాదకులు దానిని పరిశీలించి ఉండాల్సిందని అస్సాంకు చెందిన వన్యప్రాణి పరిరక్షణవేత్త వైభవ్‌ కుమార్‌ తాలూక్‌దార్‌ అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకంలో అనేక ఇతర తప్పులు కూడా ఉన్నాయని ఆయన ఎత్తిచూపారు. అస్సాంలోని బ్రహ్మపుత్రకు చెందిన అల్లువియల్‌ మైదానాలలో పెద్ద సంఖ్యలో ఉన్న ఖడ్గమృగాల ప్రస్తావనే అందులో లేదని చెప్పారు. ఒకే కొమ్మును కలిగిన ఖడ్గమృగం అస్సాం రాష్ట్ర అధికార జంతువు.
తప్పుడు వాదనలు
ఈ పుస్తకంలో వేట, వరదలను ఖడ్గమృగాలకు శత్రువులుగా చూపారని, అది తప్పుడు వాదన అని తాలూక్‌దార్‌ తెలిపారు. 1966లో కజిరంగాలో కేవలం 366 ఖడ్గమృగాలు మాత్రమే ఉండేవని, ఆ ఆర్వాత కజరంగా జాతీయ పార్కుకు ఎన్ని సార్లు వరదలు వచ్చినప్పటికీ ఇప్పుడు వాటి సంఖ్య 2,600కు పెరిగిందని వివరించారు. కాగా ఖడ్గమృగం కొమ్ములకు వైద్యపరమైన విలువ ఉన్నదంటూ పుస్తకంలో తప్పుడు సమాచారాన్ని అందించారని పలువురు మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు సమాచారం కారణంగా వాటిని వేటాడి చంపడం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధమైన వన్యప్రాణుల వ్యాపారాన్ని ప్రోత్సహించినందుకు సంపాదకులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారిని బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img