నవతెలంగాణ-హైదరాబాద్: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ అభం శుభం తెలియని ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమ్ముడు, మరదలు గొడవ పడుతుండటంతో అడ్డుకోవడానికి వచ్చిన బావపైకి మరదలు త్రిశూలం విసిరింది. ఆ త్రిశూలం తలలో గుచ్చుకుని బావ కొడుకు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అహ్మద్‌నగర్ జిల్లాలోని కేడ్‌గావ్ గ్రామం అంబెగావ్ రిహాబిలిటేషన్ కాలనీకి చెందిన సచిన్ మెంగ్వాడే, పల్లవి మెంగ్వాడే ఇద్దరూ భార్యాభర్తలు. గురువారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవను ఆపేందుకు సచిన్ మెంగ్వాడే అన్న నితిన్ మెంగ్వాడే, అతడి భార్య భాగ్యశ్రీ ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న పల్లవి మెంగ్వాడే తన బావ నితిన్ మెంగ్వాడే పైకి త్రిశూలం విసిరింది.
దాంతో ఆ త్రిశూలం నుంచి తప్పించుకునేందుకు నితిన్ మెంగ్వాడే పక్కకు జరిగాడు. అయితే నితిన్ వెనుకాలే తన తల్లి భాగ్యశ్రీ చంకలో ఉన్న 11 నెలల బాలుడు అవదూత్ మెంగ్వాడే తలలోకి ఆ త్రిశూలం దూసుకెళ్లింది. దాంతో అవదూత్ విలవిల్లాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్లవి మెంగ్వాడే, సచిన్ మెంగ్వాడేపై కేసులు బుక్ చేశారు. ఘటనపై ప్రశ్నించేందుకు నితిన్ మెంగ్వాడేను కూడా అదుపులోకి తీసుకున్నారు.