Wednesday, April 30, 2025
Homeఆటలుఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి

– భారత్‌కు వరుసగా రెండో పరాజయం
– 1-4తో ఇండోనేషియా చేతిలో ఓటమి
– సుధిర్మన్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ 2025

ప్రతిష్టాత్మక సుధిర్మన్‌ కప్‌లో టీమ్‌ ఇండియా ఆశలు ఆవిరి. గ్రూప్‌ దశలో వరుసగా రెండో పరాజయం చవిచూసిన భారత్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఫార్మాట్‌లో టోర్నమెంట్‌లో నాకౌట్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టనుంది. సింగిల్స్‌ స్టార్‌ షట్లర్లు పి.వి సింధు, హెచ్‌.ఎస్‌ ప్రణయ్ మరోసారి నిరాశపరచగా.. అగ్రజట్టు ఇండోనేషియా చేతిలో భారత్‌ 1-4తో దారుణ ఓటమి మూటగట్టుకుంది. నామమాత్రపు మ్యాచ్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌లు గురువారం తలపడనున్నాయి.
జియామెన్‌ (చైనా)
సుధిర్మన్‌ కప్‌ నుంచి భారత్‌ నిష్క్రమించింది. ఇండోనేషియాతో మంగళవారం జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా 1-4తో పరాజయం పాలైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తనీశ క్రాస్టో, ధ్రువ్‌ కపిల జంట విజయంతో శుభారంభం అందించినా.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో మన షట్లర్లు తేలిపోయారు. అగ్రశ్రేణి షట్లర్లు పి.వి సింధు, హెచ్‌.ఎస్‌ ప్రణయ్ సైతం అంచనాలను అందుకోలేదు. ఫలితంగా, గ్రూప్‌-డిలో డెన్మార్క్‌, ఇండోనేషియా చేతిలో చిత్తుగా ఓడిన భారత్‌ మరో మ్యాచ్‌ ఉండగానే నాకౌట్‌ ఆశలు ఆవిరి చేసుకుంది. ఇంగ్లాండ్‌పై డెన్మార్క్‌, ఇండోనేషియాలు 5-0తో ఏకపక్ష విజయం సాధించిగా.. గ్రూప్‌-డి నుంచి రెండు విజయాలతో ఇండోనేషియా, డెన్మార్క్‌లు నాకౌట్‌కు చేరుకున్నాయి. రెండు మ్యాచుల్లోనూ ఓడిన భారత్‌, ఇంగ్లాండ్‌ ఇంటి బాట పట్టాయి. గురువారం గ్రూప్‌-డిలో జరుగనున్న నామమాత్రపు మ్యాచ్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేత గ్రూప్‌-డిలో మూడో స్థానం సాధించనుంది.
ఏమాత్రం మారని ప్రదర్శన :
ఈ సీజన్‌లో భారత షట్లర్లు పూర్తిగా తేలిపోతున్నారు. డబుల్స్‌ స్టార్‌ సాత్విక్‌, చిరాగ్‌ సైతం ఈ టోర్నమెంట్‌లో అందుబాటులో లేరు. దీంతో ఇటు సింగిల్స్‌, అటు డబుల్స్‌ విభాగంలో భారత్‌ కనీసం పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసింది. ఇండోనేషియాతో తొలి మ్యాచ్‌లో (మిక్స్‌డ్‌ డబుల్స్‌)లో తనీశ క్రాస్టో, ధ్రువ్‌ కపిల మూడు గేముల పోరులో విజయం సాధించారు. 10-21, 21-18, 21-19తో 70 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో పైచేయి సాధించారు. కానీ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో భారత్‌కు నిరాశే ఎదురైంది. రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత పి.వి సింధు మహిళల సింగిల్స్‌లో తేలిపోయింది. కుసుమ వర్దని చేతిలో 12-21, 13-21తో పూర్తిగా చేతులెత్తేసింది. 38 నిమిషాల్లోనే పి.వి సింధు రెండో మ్యాచ్‌ను వదిలేసింది. మెన్స్‌ సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌ ప్రణరు మూడు గేముల పాటు పోరాడినా.. 21-19, 14-21, 12-21తో జొనాథన్‌ క్రిస్టీ చేతిలో ఓటమి చెందాడు. 73 నిమిషాల మ్యాచ్‌లో ప్రణరు తొలి గేమ్‌ నెగ్గినా.. ఆ తర్వాత తేలిపోయాడు. మహిళల డబుల్స్‌లో ప్రియ, శృతి 10-21, 9-21తో… పురుషుల డబుల్స్‌లో హరిహరణ్‌, రూబెన్‌ కుమార్‌లు 20-22, 18-21తో పరాజయం పాలయ్యారు. సుధిర్మన్‌ కప్‌లో రెండు సార్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరటమే భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శన. ఈ ఏడాది సైతం నాకౌట్‌కు చేరుకునే అవకాశాలు మెండుగా కనిపించినా… డబుల్స్‌, సింగిల్స్‌ షట్లర్లు పూర్తిగా నిరాశపరిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img