Saturday, July 12, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅమెరికా సుంకాలు వలసదోపిడీకి కొత్త రూపమౌతాయా?

అమెరికా సుంకాలు వలసదోపిడీకి కొత్త రూపమౌతాయా?

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ దేశాల సుంకాల దాడిగురించి గతంలో కొంత చర్చించాం. ఆయన ప్రకటించిన మూడు లక్ష్యాలు (1.పరిశ్రమలను అమెరికాకు తిరిగి రప్పించటం 2.అమెరికా అప్పుకు, లోటుకు పరిష్కారం చూపటం 3. డీ డాలరైజేషన్‌ను ఆడ్డుకోవటం) సాధించటం ఆచరణలో ఎలా సాధ్యం కాదో చూశాం. మరి ఈ సుంకాల యుద్ధం వెనక ఉన్న హిడెన్‌ ఎజెండా ఏమిటి? అనేది ఇపుడు చూద్దాం.
గత ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాలిస్తానని, ధరలు తగ్గిస్తానని చెప్పటంతోపాటు పన్నులు తగ్గిస్తానని ట్రంప్‌ పదే,పదే చెప్పాడు. ఇటీవల అమెరికన్‌ పార్లమెంట్‌ ఆమోదించిన బడ్జెట్‌లో అమెరికాలోని పేదవర్గాల ప్రజలకిస్తున్న అనేక రాయితీలను తగ్గించారు. ఫుడ్‌కూపన్లు, నిరుద్యోగ పెన్షన్లు, ఆరోగ్యబీమా వగైరా సంక్షేమ పథకాల నిధులను 1.5 లక్షల కోట్ల డాలర్లు (అంటే రూపాయల్లో 127 లక్షల కోట్లు) కోత పెట్టారు. మరోపక్క పన్నులు 4.5 లక్షల కోట్ల డాలర్లు (382 లక్షల కోట్లరూ||లు) తగ్గించారు. ఈ పన్నుల్లో అత్యధిక తగ్గింపులు కార్పొరేట్‌ కంపెనీలకే దక్కుతుంది. ఈ బడ్జెట్‌ వల్ల ప్రభుత్వానికి మొత్తంగా మూడు లక్షల కోట్ల లోటు ఏర్పడుతుంది.
కాకులగొట్టి – గద్దలకేసినట్టు
పలు దేశాలపై విధించిన సుంకాల ద్వారా వచ్చే ఆదాయం అమెరికన్‌ కార్పొరేట్‌ కంపెనీలకు పంచటమే ట్రంప్‌ సుంకాల విధానం. సుంకాల భారం ఎవరు భరిస్తారు? ఎగుమతిదారులు మార్కెట్‌ పోటీవల్ల తమ లాభాలు కొంత తగ్గించుకున్పప్పటికీ, సుంకాల ప్రధాన భారమంతా సరుకులకు పెరిగే ధరల రూపంలో అమెరికా ప్రజలే భరిం చాల్సి ఉంటుంది. ఆమెరికన్‌ ఆర్ధిక వ్యవస్థ సంక్షోభానికి ఇది దారితీస్తుంది. ఆ విధంగా ట్రంప్‌ సుంకాల లక్ష్యం ‘కాకు లను కొట్టి గద్దలకు వేసినట్టు’గా అమెరికన్‌ ప్రజలను కొట్టి అమెరికన్‌ కార్పొరేట్లకు కట్టబెట్టే చర్య తప్ప మరోటి కాదు. అయితే ఈ సుంకాల ద్వారా పతనం అంచులకు చేరిన ప్రపంచీకరణ విధానాలను గట్టెక్కించాలనే లక్ష్యం కూడా ఉన్నట్లు మరో చర్చ నడుస్తోంది.
కారల్‌ మార్క్స్‌ చెప్పినట్టుగా ‘ఉత్పత్తికి సరిపడిన డిమాండ్‌ మార్కెట్‌లో లేకపోవటం’ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఎదుర్కొనే ప్రధాన సమస్య. ఇది సంక్షోభానికి దారితీస్తుంది. ఆ సంక్షోభాలను నివారించటానికే పెట్టుబడిదార్లు వివిధ సమయాల్లో వివిధ వ్యూహాలను అనుసరించి ఇప్పటివరకూ నెట్టుకు రాగలిగారు, మొదట వలసదేశాల దోపిడీ ద్వారా తమ ఉత్పత్తులకు తగిన డిమాండ్‌ను సృష్టించారు. కొత్తగా అభివృద్ది అయిన దేశాలు వలసల పున:పంపకంకోసం జరిపిన ప్రయత్నంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు కూడా డిమాండ్‌ను సృష్టించి ఆర్ధికవ్యవస్థలను సంక్షోభం నుండి బయటపడేసాయి. ఎలాగంటే యుద్ధ అవసరాలకోసం అధికోత్పత్తులు, మిలటరీ సామాగ్రి, యంత్రాంగం అవసరమవుతాయి. వాటికోసం ప్రభుత్వం లోటుబడ్జెట్‌ ద్వారా అదనపు డబ్బు ఫ్రింట్‌ చేసి ఖర్చు పెడుతుంది. ఆ విధంగా డిమాండ్‌ పెరుగుతుంది. ఆ విధంగా జరిగిన రెండు ప్రపంచయుద్ధాలు ఆనాటి పెట్టుబడిదారీ సంక్షోభాల పరిష్కారానికి తోడ్పడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రాజకీయ కారణాలలో (వలస విముక్తి ఉద్యమాలు కమ్యూ నిస్టు శిబిరంతో జతకట్టకుండా నిలవరించటం కోసం) వలసలు రద్దు చేయబడ్డాయి. అప్పుడు డిమాండ్‌ సృష్టించటం కోసం ప్రభుత్వాలు జోక్యం చేసుకోవటం అనే విధానం అమల్లోకి తెచ్చారు. అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లోకి డబ్బు పంపిణీ చేసి సరుకులకు డిమాండు పెంచడమన్నమాట. సంక్షేమ రాజ్యాల ద్వారా సబ్సిడీలు, సంక్షేమ పథకాలు, కార్మిక అనుకూల చట్టాలు వగైరా అన్నీ ఈ కాలంలోనే ఇలాంటి అవసరాల కోసమే వచ్చాయి. ప్రపంచంలో 1970వరకూ, ఇండియాలో 90వరకూ ఈ విధానాలు అమలై డిమాండ్‌ను సృష్టించాయి. ఈ కాలాన్నే ‘పెట్టుబడిదారీ విధాన స్వర్ణయుగం’ అంటున్నాం. సంపదల ఉత్పత్తి బాగా పెరిగింది. పెట్టుబడి సైజు కూడా బ్రహ్మాండంగా పెరిగింది, పెరిగిన పెట్టుబడి ‘అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి’గా మారింది. దానికప్పుడు జాతీయ రాజ్యాల సరిహద్దులు సరిపోవు. ఎల్లలు లేని ప్రపంచం అంటే తన ప్రవేశానికి ఆటంకంలేని ప్రపంచీకరణ విధానాలు దానికి అవసరమయ్యాయి. పెట్టుబడి యొక్క ఆ అవసరంలోంచి వచ్చిన విధానమే ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు.
సంక్షోభంలో ప్రపంచీకరణ!
ఆ విధంగా ఆరంభమైన ప్రపంచీకరణ ఇపుడు ప్రమాదంలో పడింది? ఎందుకంటే దేశ,దేశాలూ తిరిగే ద్రవ్య పెట్టుబడికి తన ‘లాభం గ్యారంటీ’ ఉండాలి. అలా ఉండాలంటే అన్నిదేశాల్లో ధరలు లేక ద్రవ్యోల్బణం ఒక స్థాయికి మించి పెరగకూడదు. అలా పెరగకూడదంటే లోటు బడ్జెట్‌ ఒక నిర్ధిష్టస్థాయికి మించకూడదు. అందువల్ల ప్రభుత్వాలు తమ ఖర్చులు తగ్గించాలి. ఉద్యోగులను తగ్గించాలి. సబ్సిడీలు, సంక్షేమ పథకాలు తగ్గించాలి. ఈ పద్ధతులు ఉల్లంఘిస్తేే ఆ దేశంలో ద్రవ్య పెట్టుబడి నిలవదు. వెంటనే తనకనుకూలమైన వేరే దేశానికి పారిపోతుంది. గత యాభై ఏండ్లుగా ప్రపంచీకరణ విధానాలు ఈ విధంగా అమలు జరిగాయి. అయితే ఈ విధానం వల్ల డిమాండ్‌ కొరతను పరిష్కరించే మార్గాలు మూసుకు పోతాయి. మరి ఈ కాలంలో మార్కెట్‌లో డిమాండ్‌ సమస్య ఎలా పరిష్కారమైంది? అప్పుడప్పుడూ ఏర్పడిన బబుల్స్‌ ఈ సమస్యను కొంత పరిష్కారం చేశాయి. బబుల్స్‌ అంటే జీతాలు, వృత్తి ఆదాయాలు కాక అప్పుల రూపంలో ప్రజల్లోకి వచ్చే అదనపు డబ్బు అని చెప్పవచ్చు. గతంలో డాట్‌.కాం బబుల్‌, అమెరికాలో వచ్చిన హౌసింగ్‌ బబుల్‌ అలాంటివే. ఇంకా చోటా, మోటా బబుల్స్‌ అనేక వేలు దేశ,దేశాల్లో జరిగి ఉంటాయి. కానీ ఈ బుడగలు పగిలిన తర్వాత మళ్లీ షరా మామూలే డిమాండ్‌ సంక్షోభాలు ముందుకు వస్తాయి. ఈ బుడగ ప్రయోగాలను ప్రజలు ఎల్ల కాలం నమ్మరు. అందువల్ల పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రస్తుత సంక్షోభాన్ని ఎలా అధిగమించాలో అర్ధం కావటం లేదు.
తిరిగి ప్రభుత్వ ఖర్చు పెంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం ద్వారా డిమాండ్‌ పెంచటం కూడా ఇప్పుడు కుదరదు. ఎందుకంటే ప్రపంచీకరణ ద్వారా ఆర్థికవ్యవస్థలన్నీ కలిపివేయ బడ్డాయి. అలా చేయడానికి ప్రపంచ ప్రభుత్వమేమీలేదు. ఈ నేపథ్యంలో వివిధ దేశాలపై సుంకాల విధింపు ద్వారా గతంలో వలసదేశాల్లోని ప్రజల్ని దోచుకుని ధనిక దేశాల ఆర్థిక సంక్షోభాలను అధిగమించిన విధంగా ప్రయత్నాలు జరగవచ్చుననే చర్చ జరుగుతోంది.
ప్రమాదంలో భారత వ్యవసాయ రంగం!
ప్రపంచీకరణతో పెట్టుబడికి, సరుకులకు స్వేచ్చ లభించింది. అంటే పెట్టుబడి ఉత్పత్తి ఖర్చులు తక్కువగా ఉండే దేశాలవైపు పరుగులు పెడితే, సరుకులు లాభం ఎక్కువగా వచ్చే మార్కెట్లను ముంచెత్తుతాయి. ధనిక పారిశ్రామిక దేశాల పెట్టుబడులు మూడో ప్రపంచదేశాలకు తరలిపోయి పారిశ్రామి కంగా దెబ్బతిన్న పరిణామం జరిగినా, ప్రభుత్వా లిస్తున్న సబ్సిడీలతో ఆధునిక టెక్నాలజీతో ధనిక దేశాలు వ్యవసాయ సరుకులు (ఉష్టదేశాలలో మాత్రమే పండే కొన్ని వ్యాపార పంటలు మినహా) అత్యంత చౌకగా, భారీగా ఉత్పత్తి చేస్తున్నారు. మిగిలిపోతున్న ఆ ఉత్పత్తులను సుంకాలు లేకుండా ఆసియా, ఆఫ్రికా తదితర దేశాలకు ఎగుమతులు చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. ఉదాహరణకు ఇండియా లాంటి దేశాలు తమ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవటానికి ఇతర దేశాల నుండి వచ్చే ‘చౌకసరుకులపై’ ప్రస్తుతం విధిస్తున్న సుంకాలను రద్దుచేసి ‘జీరోటారిప్‌’గా మారాలని లేదా వాటి రేటును బాగా తగ్గించుకోవాలని ట్రంప్‌ ఒత్తిడి చేస్తున్నాడు. ‘జీరో టారిఫ్‌కు భారత్‌ ఒప్పుకొంటోంది” అని ట్రంప్‌ పదే,పదే ప్రకటించాడు కూడా. ‘ఇంకా చర్చలు ముగియలేదు’ అని మాత్రమే అంటూ ట్రంప్‌ ప్రకటనలను భారత్‌ సూటిగా ఖండించలేకపోతోంది. జీరో టారిఫ్‌కు ఒప్పుకుంటే ఏమవు తుంది? ‘మైక్‌ టైసన్‌కు – కేసీఆర్‌కు కుస్తీ పోటీ’ పెట్టినట్టు భారత వ్యవసాయ రంగం కుప్పకూలిపోతుంది. అమెరికా సరుకుల అమ్మకం ద్వారా భారత సంపద అమెరికాకు (గతంలో వలసల కాలంలో బ్రిటన్‌కు తరలిపోయినట్టు) తరలిపోతుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే.
ధనిక పారిశ్రామిక దేశాలన్నీ ఏకమై మిగతా ప్రపంచ దేశాల్లో తమ సరుకులపై సుంకాలు ఎత్తివేసే విధంగా ఒత్తిడి చేయటం, తమదేశాల్లోకి వచ్చే సరుకులపై మాత్రం సుంకాలు విధించగలిగితే వలసలనాటి దోపిడీ మళ్లీ మరోరూపంలో చేసే అవకాశం, ఆ విధంగా ధనికదేశాల డిమాండ్‌ కొరతను, తద్వారా ఆర్థికసంక్షోభాన్ని అధిగమించటానికి అవకాశం ఉండొచ్చేమో? అయితే ట్రంప్‌ మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా సుంకాలు విధిస్తున్న తీరు అందుకు ఉపయోగ పడదు. ఒక వేళ ఆ రూపానికి ఈ సుంకాల దాడి పరిణామం చెందితే మాత్రం, అప్పుడు మిగతా దేశాలన్నీ ప్రపంచీకరణ నుండి విడగొట్టుకుని తామే ఆర్థిక కూటమిగా ఏర్పడి ఆ కొత్త రూపంలో వచ్చే దోపిడీని ఎదుర్కోవటమే సరైన మార్గమవుతుంది.
– తమ్మినేని వీరభద్రం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -