Saturday, July 12, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసమగ్ర సర్వేనే పరిష్కారం

సమగ్ర సర్వేనే పరిష్కారం

- Advertisement -

ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లికి చెందిన రైతు కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కారణం, తాను కొనుగోలు చేసిన ఎకరంన్నర భూమి అదే గ్రామానికి చెందిన వేరేవారి రికార్డులో నమోదు కావడం. దీనిపై ఏండ్లుగా అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెందాడు. అంతకుముందు జోగులాంబ గద్వాల జిల్లాలో ‘సర్కారు భూమితో పాటు నా మూడెకరాల భూమి కూడా కబ్జా చేశారంటూ’ వ్యవసాయ భూమిలోనే ఓ రైతు పురుగుల మందు తాగాడు. తమ భూములకు హక్కులు కల్పించాలంటూ మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో ఒకటో తేదీ నుంచి రైతులు నిరాహార దీక్షలకు దిగారు. 2018 మే నుంచి ఈ గ్రామానికి చెందిన రైతుల హక్కులు గల్లంతయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో భూ సమస్యలతో సావాసం చేస్తున్న రైతులు కోకొల్లలు. ధరణి లోపాలు, అధికారుల తప్పిదాలతో లక్షలాది మంది అన్నదాతలు పాసుబుక్కులు పట్టుకుని రెవెన్యూ కార్యాలయాలు, ప్రజావాణిల చుట్టూ తిరుగుతున్నారు. గత సర్కార్‌ ధరణి పేరుతో రైతుల్ని ఆగం చేసిందని చెప్పి ప్రస్తుత సర్కార్‌ భూభారతి తెచ్చి నెలలు దాటినా సమస్యలు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.
నెలల తరబడి మూడు విడతలుగా రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో జనం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయి. భూ భారతి చట్టం ఆధారంగా అర్హత గలిగిన వాటిని ఆగస్టు పదిహేను నాటికి పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు ఏడు లక్షలా 98 వేల దరఖాస్తులు ఆన్‌లైన్‌ పూర్తయినట్టు సమాచారం. ధరణిలో కాస్తుకాలం లేదు, భూ భారతిలోనూ అంతే. దీన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌ ఉంది. అయితే గతంలో దరఖాస్తు చేసుకుంటే నోటీసులు జారీచేయడం, విచారణకు ఆదేశించడం, అప్పీళ్ల వ్యవస్థ అందుబాటులో ఉండకపోయేది. ఆ అవకాశం భూభారతి కల్పించింది. కిందిస్థాయిలో పరిష్కారంకాకుంటే పైన ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. ఇదే తమ గొప్పతనంగా ప్రభుత్వనేతలు ప్రచారం చేసుకుంటున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు.పలుకుబడి ఉన్నవారి దరఖాస్తులను త్వరగా పరిష్కరించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, కిందిస్థాయి రైతులను పట్టించు కోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య గోడు చెప్పుకోవడానికి ప్రజావాణికి వచ్చిన అక్కడే కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అధికార యంత్రాంగంలో ఎంతటి నిర్లక్ష్యం ఉందో ఇట్టే అర్థమవుతోంది.
గత పాలకులు సమస్య మూలాల్లోకి వెళ్లకుండా పైపైనే చట్టాలు మార్చుకుంటూ వచ్చిన ఫలితంగానే రైతులు సమస్యలు ఎదుర్కొం టున్నది వ్యవసాయ నిపుణులు చెబుతున్న మాట. కొన్ని ప్రాంతాల్లో ఒక సర్వే నెంబర్‌లో వాస్తవంగా ఉన్న భూమికి, రికార్డుల్లో ఉన్న భూమికి మధ్య వ్యత్యాసం ఉంటున్నది. ఆర్‌ఎస్‌ఆర్‌ (రెవెన్యూ సెటి ల్మెంట్‌ రిజిస్టర్‌)లో ఉన్న తేడాలను సవరించాల్సి ఉన్నది. కొంతమంది రైతుల వద్ద భూమి ఉన్నా పట్టా లేకపోగా రికార్డుల్లో పేరు నమోదు కాదు. కొంతమందికి రికార్డ్‌లో పేరు, పట్టా ఉన్నా చేతిలో భూముండదు. అనేక మంది రైతుల వద్ద పట్టాలో ఉన్నంత భూమి ఫీల్డ్‌లో ఉండదు. ఎందుకుండదో ఎవరికీ తెలియదు. ఏకంగా సర్వే నెంబర్లే మాయమైన ఉదంతాలనేకం. ఇంకా బడాబాబులు ప్రభుత్వ భూములు కబ్జాచేశారన్న ఆరోపణలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. కొంతమంది పెద్దల చేతుల్లో ఎక్కువ భూమి ఉందని, రికార్డుల్లో అంత ఉండదనే చర్చలు కూడా నడుస్తున్నాయి. అలాగే ఆదివాసులు సాగుచేసుకుంటున్న భూముల హద్దులకు సంబంధించి కూడా కొన్నేండ్లుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు శూన్యం.
భూ సమస్యలకు సంబంధించి రోగం ఒకటైతే మందు మరొకటిస్తున్నారు పాలకులు. దీనివల్ల తెలంగాణలో భూవివాదాలు తీరకపోగా రోజురోజుకూ పెరుగుతున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావటంతో ఘర్షణలకు దారి తీస్తున్నాయి. కోర్టులకు వచ్చే కేసుల్లో అత్యధికంగా భూవివాదాలే ఉంటున్నాయి. ఏ రూపంలోనైనా భూ సమస్యలు, తగదాలు పెరడానికి పరోక్షంగా పాలకులే కారణమవ్వడం ఆందోళన కలిగించే అంశం. తెలంగాణలో భూ సర్వే జరిగి డెబ్బయి ఏండ్లకు పైనే అయింది. మరోసారి సమగ్ర భూసర్వే జరగడమే మంచిదన్న అభిప్రాయం వ్యవసాయవేత్తల నుంచి వస్తున్నది. సమగ్ర భూ సర్వే జరిగితే అనేక భూవివాదాలు సమసిపోతాయని రైతు సంఘాల అభిప్రాయం కూడా. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తే భూవివాద రహిత తెలంగాణను చూడొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -