నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ…శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ బీసీ విభాగం ఆధ్వర్యంలో పెద్దఎత్తున సంబురాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని వేడుకలను నిర్వహించారు. బోనమెత్తి డప్పుచప్పుళ్లతో నృత్యాలుచేస్తూ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం కోసం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులకు బీసీనేతలు ధన్యవాదాలు తెలిపారు. అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ చైర్మెన్లు నూతి శ్రీకాంత్, మెట్టు సాయికుమార్, ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీష్, అల్లం భాస్కర్, గజ్జి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
అగ్రనేతలకు అభినందనలు : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఖర్గే, రాహుల్ గాంధీ సంకల్పముందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు ఆయన అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని తెలిపారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తోందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఏం సంబంధమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కవిత రంగులు పూసుకోవడమేంటని ప్రశ్నించారు. చోటా, మోటా ధర్నాలు చేసి బీసీ రిజర్వేషన్లు తమతో సాధ్యమైనట్టు చెప్పడమేంటని ప్రశ్నించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏం సాధించారని ప్రశ్నించారు.
45 ఏండ్ల కల నెరవేరింది : కేకే
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలనే 45 ఏండ్ల బీసీల కల నెరవేరిందని ప్రభుత్వ సలహాదారుల కే. కేశవరావు అభిప్రాయపడ్డారు. సమా నత్వ సాధనలో రిజర్వేషన్లు ఓ భాగమని చెప్పారు. ఈ నిర్ణయం రాజకీయ పార్టీలకు సంబంధించినది కాదనీ, సామాజిక న్యాయం కోసమేనని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో బీఆర్‌ఎస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతు న్నారని విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపారు. బీసీ బిల్లు చట్ట రూపం దాల్చితే దాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చే అవకాశం ఉందని చెప్పారు. పంచాయతీ రాజ్ చట్టానికి సవరణలు చేసుకోవచ్చన్నారు.
బీసీ రిజర్వేషన్ల నిర్ణయానికి మద్దతు ఇవ్వండి : మంత్రి పొన్నం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాజకీయ పార్టీలు మద్దతివ్వా లంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బీసీలకు సీఎం పదవి ఇస్తామంటూ ఎన్నికలకు ముందు ప్రకటించిన బీజేపీ… ఆ తర్వాత అధ్యక్ష పదవి నుంచి బండి సంజరుని తొలగించిందని విమర్శించారు. నలుగురు బీసీ పార్లమెంట్ సభ్యులున్నప్పటికీ ఇతరులకు ఎందుకు అధ్యక్ష పదవి ఇచ్చిం దని ప్రశ్నించారు. బలహీన వర్గాలకు బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు.
బీసీలంటే కేసీఆర్‌కు చులకన : షబ్బీర్ అలీ
బీసీలంటే మాజీ సీఎం కేసీఆర్‌కు చులకన భావం ఉందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సమానత్వ భావనతో చూస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక బిల్లులన్నింటికీ బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. బీసీలకు న్యాయం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లను అమలు చేయాలనుకోవడం హర్షణీయమన్నారు.
శుభపరిణామం : ఇందిరా శోభన్
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామనడం శుభపరిణామమని కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరాశోభన్ పోశాల హర్షం వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ కోసం అధిష్టానం బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని తెలిపారు. ఊర్లో పెళ్లికి కవిత హడావుడి ఎందుకో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు.
బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతల హర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES