– కార్పొరేట్‌కు దీటుగా సర్కార్ దవాఖానాలు
– గ్రామీణ వైద్యం బలోపేతం
– మెడికల్ కళాశాలలకు అన్ని వసతులూ కల్పిస్తాం :వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ
– నాగర్‌కర్నూల్ జిల్లాలో మంత్రుల పర్యటన
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
వైద్య సేవ అతి పవిత్రమైనది, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ నియోజక వర్గాల్లో శుక్రవారం పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కల్వకుర్తి పట్టణంలో రూ.45.50 కోట్లతో నిర్మించే 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన, నాగర్‌కర్నూర్ జిల్లా ఉయ్యాలవాడ సమీపంలో 26 ఎకరాల్లో రూ.180 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలను ప్రారంభించారు. రూ.235 కోట్లతో 550 పడకల సామర్థ్యంతో ఆధునాతన వసతులతో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలు, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వైద్య విద్యను అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్యులను ప్రజలు దేవుడితో పోలుస్తారని, ఆ నమ్మకాన్ని కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మెడికల్ కాలేజీలో నిమ్స్, ఉస్మానియా స్థాయి వసతులు ఉండాలి, కార్పొరేట్ స్థాయిలో ఆస్పత్రులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేంద్రం, జిల్లాకు ఓ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవ సహాయం, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, గ్రంథాలయ చైర్మెన్ గంగాపురం రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ రమణారావు పాల్గొన్నారు.
రూ.50 లక్షలు మంజూరు: మంత్రి జూపల్లి కృష్ణారావు
మెడికల్ కళాశాల విద్యార్థుల రవాణా సదుపాయానికి ఎలక్ట్రానిక్ బస్సు, ఇతర సౌకర్యాల కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. జూనియర్ వైద్యులు తమ సొంత గ్రామాలను మరువొద్దని, గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండా లని సూచించారు. వైద్య విద్యార్థుల కల నేటితో నెరవేరిందన్నారు.
ట్రస్ట్ ద్వారా మెడికల్ కళాశాలల్లో ఏర్పాట్లు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మెడికల్ కళాశాలకు అవసరమైన ఏర్పాట్లను తన చారిటీ ట్రస్ట్ ద్వారా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ.235 కోట్లతో ఆస్పత్రి నిర్మించడం సంతోషకరమన్నారు. వనపర్తి, జడ్చర్ల రోడ్డు, మహబూబ్‌నగర్ మన్ననూరు రోడ్డును విస్తరించేందుకు రూ.140 కోట్లు విడుదల చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు.
వైద్యసేవ పవిత్రమైంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES