– రిజర్వేషన్ల పెంపు బిల్లును గవర్నర్ ఆమోదించాలి
– అందుకోసం బీజేపీ రాష్ట్ర నేతలు చొరవ తీసుకోవాలి
– తాత్కాలికంగా రైల్ రోకో వాయిదా
– ఆర్డినెన్స్ జారీలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం ఉధృతం : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే హైకోర్టులో కేవియట్ దాఖలు చేసి ఆర్డినెన్స్ జారీ చేయించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (యూపీఎఫ్) నాయకులతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ అన్ని కుల సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తేగా, రాష్ట్ర శాసనసభ, శాసన మండలిలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టిందని తెలిపారు. అయితే ఆ బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని ఆమె ఆక్షేపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 17న రైల్ రోకోకు పిలుపునిచ్చినట్టు గుర్తుచేశారు. ప్రజల్లో కాంగ్రెస్, బీజేపీల వైఖరి ఎండగట్టడంతో ఒత్తిడికి తలొగ్గి క్యాబినెట్‌లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ చట్ట సవరణ చేసిందని తెలిపారు. ఇది తెలంగాణ జాగృతి సాధించిన విజయమని తెలిపారు. సవరణ బిల్లును గవర్నర్ ఆమోదించేలా బీజేపీ నాయకులు ఒత్తిడి పెంచాలని కోరారు.
బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో తాము పిలుపునిచ్చిన రైల్ రోకోను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. గవర్నర్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ జారీ చేయకపోతే మళ్లీ ఆందోళనను ఉధతం చేస్తామని హెచ్చరించారు. క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదన మాత్రమే చేశారనీ, విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేలా బీజేపీ నేతలు కృషి చేయకుంటే కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతలు ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. షెడ్యూల్ 9లో బీసీ రిజర్వేషన్లను చేర్పించి రాజ్యాంగ పరమైన భద్రత కల్పించే బాధ్యతను కేంద్ర మంత్రి బండి సంజరు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందా అని వారం రోజులు వేచి చూస్తామని తెలిపారు. అప్పటికీ గవర్నర్ ఆమోదం తెలపని పక్షంలో మళ్లీ ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశంలో యూపీఎఫ్ కన్వీనర్ బొల్లా శివశంకర్, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు రూప్ సింగ్, వరలక్ష్మీ, లలితా యాదవ్, సంపత్ గౌడ్, కొట్టాల యాదగిరి, నరేందర్ యాదవ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES