Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకల్తీ కల్లు ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి

కల్తీ కల్లు ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి

- Advertisement -

– మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
– డ్రగ్స్‌ లాగే కల్తీ కల్లుపై ఉక్కుపాదం మోపాలి : పట్నం రాష్ట్ర నాయకులు డిజి.నర్సింహారావు
– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ ఆఫీస్‌ ఎదుట ధర్నా
– రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ డిప్యూటీ కమిషనర్‌కు వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో/ సుల్తాన్‌బజార్‌

కల్తీ కల్లు ఘటనపై కఠిన చర్యలు చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని పట్నం రాష్ట్ర నాయకులు డిజి.నర్సింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూకట్‌పల్లిలో కల్తీ కల్లు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు పలువురు మృతిచెందారని, మరికొంత మంది చికిత్స పొందుతున్నారని, అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటన చాలా తీవ్రమైన దన్నారు. కల్లు కాంపౌండ్ల యజమానులు కొందరు లాభాపేక్షతో రసాయనాలతో కల్లును తయారు చేసి ప్రజల ప్రాణంతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగానూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నారన్నారు. పేదల మరణాలకు కారణమైన యాజ మాన్యాలను హత్యానేరం కింద కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులు కల్లు కాంపౌండ్లలో తనిఖీలు చేసినట్టయితే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు. సంబంధిత అధికారుల పైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరంతరం తనిఖీలు చేసేలా ఆదేశాలివ్వాలన్నారు.
సీపీఐ(ఎం) మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. డ్రగ్స్‌ లాగే కల్తీ కల్లుపై ఉక్కుపాదం మోపాలన్నారు. అన్ని కల్లు దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలన్నారు. బాధితులకు నాణ్య మైన వైద్యం అందించాలని కోరారు. జిల్లాలో కల్తీ మద్యంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.వెంకటేష్‌, కోట రమేష్‌, ఎన్‌పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్‌, సీపీఐ(ఎం) మేడ్చల్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎర్ర అశోక్‌, జి.శ్రీనివాసులు, రాజశేఖర్‌, నాయకులు రాథోడ్‌ సంతోష్‌, ఎన్‌.శ్రీనివాస్‌, లింగస్వామి, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు వెంకట నర్సయ్య, మహిళ సంఘం నాయకులు మంగ, విజయ, డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి జావిడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -