– ముంబయికి 5 వై మోడల్ కార్లు
– 2021 నుంచి భారత్‌లో ఎంట్రీకి ప్రయత్నాలు
– కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తానని ప్రధాని మోడీ హామీ..
ముంబయి : ఎలన్ మస్క్‌కు చెందిన విద్యుత్ వాహనాల కంపెనీ టెస్లా భారత్‌లో తన షోరూంను ముంబయిలో ఏర్పాటు చేస్తోంది. దీన్ని 15న ప్రారంభించనుందని రిపోర్టులు వస్తోన్నాయి. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా షోరూంను ప్రారంభించనుంది. ఇందుకోసం ఇప్పటికే 5 వై మోడల్ కార్లు ముంబయికి చేర్చినట్టు సమాచారం. చైనాలోని షాంగై నుంచి వాటిని తీసుకొచ్చింది. ముంబయి తర్వాత ఢిల్లీలోనూ మరో షోరూం
ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి 2021 నుంచి టెస్లా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో ఎలన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఖరీదైన కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడానికి మోడీ అంగీకరించడంతో టెస్లా భారత్‌లో ప్రవేశించడానికి మార్గం సుగమం అయ్యింది.