Saturday, July 12, 2025
E-PAPER
Homeజాతీయంసమాచారం ఇవ్వలేం

సమాచారం ఇవ్వలేం

- Advertisement -

– సోషల్‌ మీడియా ఖాతాల బ్లాక్‌పై ఆర్టీఐ ప్రశ్నకు కేంద్రం సమాధానం
– జాతీయ భద్రతే కారణమని ప్రతిస్పందన
– సర్కారు నిషేధ ఉత్తర్వుల ప్రతులు ఇవ్వలేమన్న వైనం

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు భారత్‌లో సోషల్‌ మీడియాను విపరీతంగా కట్టడి చేస్తున్న విధానం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. కేంద్రానికి వ్యతిరేకంగా వార్తలు, కథనాలు, పోస్టులు ఏవైనా కనబడితే వాటిపై ఆంక్షలకు దిగుతున్నది. ఇటీవల ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్‌పై కూడా ఇదే చర్యకు దిగింది. భారత్‌లో రాయిటర్స్‌కు చెందిన సోషల్‌ మీడియా ఖాతాలను బ్లాక్‌ చేసింది. కేంద్రం చర్యపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దేశంలోని వార్త సంస్థలు, జర్నలిస్టులను కట్టడి చేస్తూ, వారి సోషల్‌ మీడియా ఖాతాలతో పాటు పోర్టల్స్‌ను బ్లాక్‌ చేసే ఆన్‌లైన్‌ సెన్సార్‌షిప్‌ చర్యలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఉత్తర్వు మేరకు రాయిటర్‌తో పాటు మొత్తం 2,300కు పైగా ఖాతాలను నిషేధించినట్టు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ‘ఎక్స్‌’ వివరించింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎనిమిది వేలకు పైగా అకౌంట్లను బ్లాక్‌ చేసినట్టు ఎక్స్‌ ఇప్పటికే తెలిపిన విషయం విదితమే. ఇది జరిగిన కొన్ని రోజులకే తాజా పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. బ్లాక్‌ జాబితాలో ది కాశ్మీరియత్‌, ఫ్రీ ప్రెస్‌ కాశ్మీర్‌, మక్తూబ్‌ మీడియా, బీబీసీ ఉర్దూ వంటి న్యూస్‌పోర్టల్‌లు, పలువురు జర్నలిస్టులకు చెందిన సోషల్‌ మీడియా ఖాతాలు ఉన్నాయి.
కేంద్రం జారీ చేసిన నిషేధ ఉత్తర్వుల ప్రతులు అందించాలంటూ సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద దరఖాస్తు దాఖలైంది. న్యూఢిల్లీలోని కామన్వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనిషియేటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్‌ నాయక్‌ ఈ ప్రశ్నను సంధించారు. ఎక్స్‌, ఇంటర్నెట్‌ సర్సీస్‌ ప్రొవైడర్లకు జారీ చేసిన బ్లాకింగ్‌ ఆర్డర్ల కాపీలను ఇవ్వాలని కోరారు. ఈ ఏడాది మే 12న కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖను ఆయన ఆర్టీఐ ద్వారా అభ్యర్థించారు. అయితే కేంద్రం మాత్రం ‘జాతీయ భద్రత’ను కారణంగా చూపిస్తూ సమాచారాన్నివ్వటానికి నిరాకరించింది. ఆర్టీఐ చట్టంలోని జాతీయ భద్రతకు సంబంధించిన సెక్షన్‌ 8(1)(ఎ)ను ఉటంకిస్తూ సదరు మంత్రిత్వ శాఖ తన అభ్యర్థనను తిరస్కరించిందని వెంకటేశ్‌ నాయక్‌ చెప్పారు. ఐటీ చట్టం, సంబంధిత నిబంధనల కింద తాను కోరిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలన్న విషయాన్ని కూడా ప్రస్తావించిందని ఆయన తెలిపారు.
సెక్షన్‌ 8(1)(ఎ)లోని ఏడు నిబంధనలలో దేనిని ఆధారంగా చేసుకొని సమాచార నిరాకరించారన్నదానిపై మాత్రం సదరు మంత్రిత్వ శాఖ స్పష్టతనివ్వలేదని వెంకటేశ్‌ నాయక్‌ చెప్పారు. సమాచారాన్ని నిరాకరించిన కేంద్రం తీరుపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు సమాచారాన్ని తెలసుకోవాలన్న పౌరుల ప్రాథమిక హక్కును దెబ్బ తీస్తుందని అన్నారు. హేతుబద్ధత కలిగి ఉన్న ఉత్తర్వులను ప్రచురించటానికి ప్రభుత్వం నిరాకరిస్తే.. దానిని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని తెలిపారు.
అప్పుడూ ఇంతే…
తమకు వ్యతిరేకంగా కథనాలను ప్రచారం చేసిన మీడియా సంస్థలపై గతంలోనూ మోడీ సర్కారు ‘నిషేధ ఉత్తర్వులు’ అనే ఆయుధాన్ని వాడింది. రాఫెల్‌ యుద్ధ విమానాలపై సీఎన్‌ఎన్‌ నివేది కను ఉటంకిస్తూ ఆర్టికల్‌ను ప్రచురించారని ‘ది వైర్‌’ న్యూస్‌ పోర్టల్‌ను కేంద్రం బ్లాక్‌ చేసింది. ఆ ఆర్టికల్‌ను తొలగించిన తర్వాత ది వైర్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. 2021లో రైతుల నిరసన లకు సంబంధించి పోస్టులు చేసిన జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలకు చెందిన దాదాపు 250 అకౌంట్లను బ్లాక్‌ చేయించింది. ఇక కరోనా విషయంలో ప్రభుత్వానికి వ్యతిరే కంగా ఉన్న ట్వీట్లను తొలగించాలంటూ మోడీ ప్రభుత్వం 2021లో ‘ఎక్స్‌’కు ఇలాంటి ఆదేశాలే ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -