– ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వ్యాఖ్యలతో రేగిన రాజకీయ దుమారం!
– మోడీని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలన్న కాంగ్రెస్
న్యూఢిల్లీ : 75ఏండ్ల వయస్సు రాగానే నేతలు పక్కకు తప్పుకోవాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్ ) చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలు స్పందించారు. ఈ ఏడాది సెప్టెంబరులో మోడీ 75కి ఏండ్లు నిండుతాయి.
ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత మోరోపంత్ పింగ్లేపై రాసిన పుస్తకాన్ని ఈ నెల 9న నాగ్‌పూర్‌లో ఆవిష్కరించిన సందర్భంగా భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. పింగ్లేకు 75ఏండ్లు నిండిన సందర్భంగా ఆయనను సత్కరించేందుకు బృందావన్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్‌ఎస్ సమావేశంలో జరిగిన ఒక సంఘటనను భగవత్ గుర్తు చేశారు. ”75ఏండ్ల వయస్సులో మనకు శాలువా కప్పి సత్కరిస్తున్నారంటే దానర్ధం ఇక మీరు పక్కకు తప్పుకుని, ఇతరులకు అవకాశం ఇవ్వండి” అని చెప్పడమే అంటూ పింగ్లే ఆనాడు అన్న మాటలను భగవత్ గుర్తు చేశారు. ఆ భావనను దృష్టిలో వుంచుకునే పింగ్లే పనిచేశారని, ఆ గర్వాన్ని తనకు అంటకుండా జాగ్రత్త పడ్డారని వ్యాఖ్యానించారు.
స్పందించిన కాంగ్రెస్
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, ఆ పార్టీ కమ్యూనికేషన్స్ విభాగానికి ఇన్‌చార్జీ జనరల్ సెక్రెటరీ అయిన జైరాం రమేశ్ స్పందించారు. పాపం ప్రధాని !… విదేశాల్లో పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన వేళ… ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వ్యాఖ్యలను మోడీ గుర్తు చేసుకోవాలి. నాకు సరే,,,మీకు కూడా సెప్టెంబరు 11నాటికి 75ఏండ్లు నిండుతాయి కదా? అని మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు గుర్తు చేయాలని అన్నారు. అదేగనుక జరిగితే ”ఒక బాణానికి రెండు పిట్టలు” పడతాయని రమేశ్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. మరో కాంగ్రెస్ నేత పవన్ ఖెరా స్పందిస్తూ, భగవత్, మోడీ ఇరువురు కూడా ‘ఒకరినొకరు బలపరుచుకుంటూ సంఘీభావం తెలియచేసుకోవాలని’ వ్యాఖ్యానించారు. శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ సంజరు రౌత్ మాట్లాడుతూ గతంలో ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్‌జోసి, జస్వంత్ సింగ్ వంటి సీనియర్ బీజేపీ నేతలను 75ఏండ్లు దాటగానే రిటైరవాలని మోడీ ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మోడీ తనకు కూడా అదే నిబంధనను వర్తింపచేసుకోవాలని సూచించారు.
కొట్టి పారేసిన ఆర్‌ఎస్‌ఎస్
కాగా భగవత్ వ్యాఖ్యలను సందర్భానికి తగినట్లుగా అన్వయించుకుంటున్నారని, ఆయన మోడీని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేయలేదని సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ నేత ఒకరు కొట్టిపారేశారు. ‘రిటైర్మెంట్ వయస్సు గురించి భగవత్ ఎన్నడూ ఏమీ మాట్లాడలేదు. పింగ్లేకు సంబంధించిన ఉదాహరణ ఒక్కటి ఉటంకించారు అంతే. సుదీర్ఘంగా చేసిన ఆ ప్రసంగంలో ఆయన అనేక సంఘటనలను పంచుకున్నారు. పింగ్లే హాస్య చతురత, మేథో సంపత్తి గురించి చెప్పడమే ఆ వ్యాఖ్యల ఉద్దేశ్యం. అంతేకానీ ఎవరికీ దానితో సంబంధం లేదు.” అని స్పష్టం చేశారు. రిటైర్మెంట్ వయస్సుపై సంఫ్‌ు నేతలు వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌గా చేసిన కె.సుదర్శన్ కూడా అద్వానీ, వాజ్‌పేయి వంటి నేతలు 75ఏండ్ల వయస్సులో రిటైరై ఇతరులకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు.
రిటైర్మెంట్ ఏజ్‌పై హీట్
- Advertisement -
- Advertisement -