– బ్రెజిల్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు
– అమెరికా అధ్యక్షుడి దిష్టిబొమ్మలు దహనం
– అధిక సంఖ్యలో పాల్గొన్న నిరసనకారులు
సాపౌలో : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న దారుణమైన టారిఫ్‌లకు వ్యతిరేకంగా బ్రెజిల్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి చేరి ఆందోళనలు జరిపారు. డోనాల్డ్ ట్రంప్ ప్రజల శత్రువు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పలు చోట్ల ఆయన దిష్టిబొమ్మలతో ర్యాలీలు జరిపి దహనం చేశారు. దక్షిణ అమెరికా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 50 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. అమెరికా అధ్యక్షుడి ప్రకటన తర్వాత బ్రెజిల్‌లో ఈ ఆందోళనలు జరిగాయి. పాలిస్టా అవెన్యూలో ఆందోళనకారులు ఆయన దిష్టిబొమ్మతో ఊరేగింపు జరిపారు. ట్రంప్ టారిఫ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆ తర్వాత ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సావో పాలోలో జరుగుతున్న ఆందోళనలో నిరసనకారులు అధిక సంఖ్యలో గుమిగూడారు. ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోలోను పోలి ఉన్న ఫేస్ మాస్క్‌లను ధరించి నిరసన వ్యక్తం చేశారు. కాగా సోషల్‌మీడియా మూవ్‌మెంట్స్, యూనియన్లు ఈ ఆందోళనను నిర్వహించాయి. న్యాయమైన ఆర్థిక విధానాలపై డిమాండ్ చేశాయి. ప్రజలను పణంగా పెట్టి, బిలియనీర్లను రక్షించటాన్ని ఖండించాయి. అయితే 2022 ఎన్నికల్లో ఓటమికి సంబంధించిన విషయంలో అభియోగాలు ఎదుర్కొంటున్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ట్రంప్ టారిఫ్ వార్‌కు తెరలేపారు.