నవతెలంగాణ-హైదారాబాద్: ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో శనివారం ఉదయం నాలుగు అంతస్తుల భవనం కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనలో నలుగురిని రక్షించి ఆస్పత్రికి తరలించగా.. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. శిథిలాలను తొలగిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, పౌర రక్షణ సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
దేశ రాజధాని నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జనతా మజ్దూర్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూప్పకూలిన విషయం తెలిసిందే. 8 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. వారిలో 14 నెలల శిశువుతోపాటు బాధితులను అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ప్రమాదంలో గాయపడిన బాధితుల వివరాలను అధికారులు వెల్లడించారు. పర్వేజ్ (32),నవేద్(19), సిజా(21), దీప(56), గోవింద్(60),రవి కశ్యప్ (27), జ్యోతి (27), 14 నెలల అహ్మద్‌గా గుర్తించారు. గాయపడిన శిశువు తప్ప మిగతా వారందరినీ జగ్ ప్రవేశ్ చంద్ర (జెపిసి) ఆసుపత్రికి , శిశువు జిటిబి ఆసుపత్రికి తరలించారు.